క్షిపణి పరీక్షలు జరిపాం

ఉత్తర కొరియా ఈనెల 25, 26 తేదీల్లో క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని ఆ దేశ అధికార వార్తా సంస్థ కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) శుక్రవారం వెల్లడించింది. మంగళవారం

Published : 29 Jan 2022 04:02 IST

ఉత్తర కొరియా ప్రకటన

సియోల్‌: ఉత్తర కొరియా ఈనెల 25, 26 తేదీల్లో క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని ఆ దేశ అధికార వార్తా సంస్థ కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) శుక్రవారం వెల్లడించింది. మంగళవారం రెండు దూరశ్రేణి క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించగా అవి నింగిలో 2 గంటల 35 నిమిషాలసేపు దూసుకెళ్లి 1800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించాయి. వాటికి అణ్వస్తాల్రను ప్రయోగించే సామర్థ్యం ఉంది. గురువారం ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే రెండు క్షిపణులను ప్రయోగించారు. సాధారణ బాంబులను మోసుకెళ్లే ఈ రెండు క్షిపణులు సముద్రంలోని లక్ష్యాన్ని ఛేదించాయని కేసీఎన్‌ఏ ప్రకటించింది. ట్రక్కుల నుంచి, రైళ్ల నుంచి ప్రయోగించడానికి అనువైన ఈ రెండు క్షిపణులు రష్యన్‌ ఇస్కందర్‌ క్షిపణుల నమూనాలో తయారయ్యాయి. మంగళ, గురువారాల్లో జరిపిన పరీక్షలతో కలుపుకొని ఉత్తర కొరియా కొత్త సంవత్సరంలో ఇంతవరకు మొత్తం 6 క్షిపణి పరీక్షలు నిర్వహించినట్లు లెక్కతేలుతోంది. జనవరి 11న జరిపిన హైపర్‌ సోనిక్‌ క్షిపణి పరీక్షను వీక్షించిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ ఈ వారం జరిపిన పరీక్షలకు హాజరుకాలేదు. దానికి బదులు ఒక ప్రధాన ఆయుధ వ్యవస్థను నిర్మిస్తున్న కర్మాగారాన్ని సందర్శించారు.

శీతాకాల ఒలింపిక్స్‌ తర్వాత మరింత దూకుడు

అమెరికా తమ మీద కఠిన ఆంక్షలు విధిస్తూనే ఉంటే, ఆ దేశాన్ని తాకగల దూరశ్రేణి అణ్వస్త్ర వాహక క్షిపణి పరీక్షలను కొనసాగిస్తామని గత వారం కిమ్‌ అధ్యక్షతన జరిగిన పాలక పార్టీ సమావేశంలో అక్కడి సీనియర్‌ నాయకులు బెదిరించారు. బైడెన్‌ ప్రభుత్వం రష్యా, చైనాలను ఢీకొనే యత్నాల్లో నిమగ్నమైన సమయంలో ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలు నిర్వహించడం ప్రాముఖ్యం సంతరించుకుంది. చైనాలో ఫిబ్రవరి 4 నుంచి శీతాకాల ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. ఆ తరవాత ఉత్తర కొరియా మరిన్ని ఆయుధ పరీక్షలు జరిపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని