చంద్రుడిపైకి టయోటా కారు..ప్రత్యేక వాహనాన్ని రూపొందిస్తున్న జపాన్‌ సంస్థ

చంద్రుడిపై అన్వేషణ కోసం ఒక వాహనాన్ని రూపొందించేందుకు టయోటా సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం జపాన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి కసరత్తు చేస్తోంది. 2040 నాటికి జాబిల్లిపైన ఆ తర్వాత అంగారకుడిపైన

Updated : 29 Jan 2022 08:39 IST

టోక్యో: చంద్రుడిపై అన్వేషణ కోసం ఒక వాహనాన్ని రూపొందించేందుకు టయోటా సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం జపాన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి కసరత్తు చేస్తోంది. 2040 నాటికి జాబిల్లిపైన ఆ తర్వాత అంగారకుడిపైన ప్రజలు నివసించడానికి తోడ్పడటం దీని ఉద్దేశం.

ఈ వాహనానికి ‘లూనార్‌ క్రూజర్‌’ అని పేరు పెట్టారు. కార్లలో ప్రజలు సురక్షితంగా తినడం, పనిచేయడం, నిద్రపోవడం, ఇతరులతో కమ్యూనికేషన్‌ సాగించడం వంటివి చేయగలరు. రోదసిలో ఉన్నప్పుడూ ఇదే సూత్రం వర్తిస్తుందన్న ఉద్దేశంతో ఈ కసరత్తు చేస్తున్నట్లు ఈ ప్రాజెక్టు అధిపతి టకోవా సాటో తెలిపారు. రోదసిలో తనిఖీలు, నిర్వహణ పనుల వంటివి చేపట్టేందుకు లూనార్‌ క్రూజర్‌కు ఒక రోబోటిక్‌ హస్తాన్ని కూడా అమరుస్తున్నారు. భిన్న పనులను సులువుగా చేపట్టగలిగేలా ఈ సాధనం అంచులను మార్చుకోవచ్చు. ‘గిటాయ్‌ జపాన్‌’ సంస్థ దీన్ని రూపొందించింది. ‘‘రోదసిలోకి వెళ్లడం ఇప్పటివరకూ సవాల్‌గా ఉండేది. దాన్ని ఇప్పుడు అధిగమించాం. అయితే అంతరిక్షంలో పనిచేయడం వ్యోమగాములకు ప్రమాదకరంగా ఉంటోంది. అందుకయ్యే ఖర్చులూ అధికమే. ఈ ఇబ్బందిని రోబోలు తీరుస్తాయి’’ అని గిటాయ్‌ సీఈవో షో నకానోస్‌ తెలిపారు.

చంద్రుడిపై పరిశోధనలకు జపాన్‌లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఐస్పేస్‌ అనే ప్రైవేటు సంస్థ రోవర్‌లు, ల్యాండర్‌లు, ఆర్బిటర్‌లపై పనిచేస్తోంది. ఈ ఏడాది చివర్లో చంద్రుడిపై ల్యాండింగ్‌ నిర్వహణకు ప్రయత్నిస్తోంది. జపాన్‌కు చెందిన వ్యాపారవేత్త యుసాకు మేజవా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్‌)కి వెళ్లొచ్చారు. స్పేస్‌ఎక్స్‌ సంస్థ రూపొందిస్తున్న స్టార్‌షిప్‌లో చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రావడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని