Corona Virus:కొవిడ్‌ తర్వాత ఊపిరితిత్తుల్లో లోపాలు.. ప్రత్యేక పరీక్షల్లో గుర్తింపు

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నాక కూడా శ్వాస ఇబ్బందులు వీడని వారి ఊపిరితిత్తుల్లో లోపాలను గుర్తించినట్లు తాజా అధ్యయనం పేర్కొంది.

Updated : 30 Jan 2022 12:19 IST

బ్రిటన్‌ శాస్త్రవేత్తల పరిశోధన

లండన్‌: కొవిడ్‌-19 నుంచి కోలుకున్నాక కూడా శ్వాస ఇబ్బందులు వీడని వారి ఊపిరితిత్తుల్లో లోపాలను గుర్తించినట్లు తాజా అధ్యయనం పేర్కొంది. దీన్నిబట్టి కరోనా వైరస్‌ వల్ల ఈ అవయవానికి అంతర్గతంగా నష్టం జరుగుతున్నట్లు స్పష్టమవుతోందని పరిశోధకులు తెలిపారు. సాధారణ పరీక్షల్లో ఇవి బయటపడకపోవచ్చని వివరించారు. కొవిడ్‌ అనంతర సమస్యలు (లాంగ్‌ కొవిడ్‌) ఎదుర్కొంటున్న వారిలో శ్వాస ఇబ్బంది సాధారణంగా కనిపిస్తోంది. అయితే కరోనా వల్ల శ్వాస పోకడలో జరిగిన మార్పులు, అలసట లేక మరేదైనా ప్రాథమిక అంశం కారణంగా ఇలా జరుగుతోందా అన్నదానిపై స్పష్టత లేదు. దీని నిగ్గు తేల్చేందుకు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ ఆసుపత్రికి చెందిన ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.

కొవిడ్‌ నుంచి కోలుకున్నాక శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు బాధితులను పరిశీలించారు. సీటీ స్కాన్‌లు సహా అనేక ఇతర పరీక్షల్లో వీరు ఆరోగ్యంగానే ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. కొవిడ్‌ సోకినప్పుడు వీరు ఆసుపత్రిలో చేరలేదని, తీవ్ర అనారోగ్యం బారిన కూడా పడలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయినా కరోనా నుంచి కోలుకున్న సంవత్సరం తర్వాత కూడా వీరిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు. వీరి ఊపిరితిత్తుల్లో లోపాలను పరిశీలించడానికి వినూత్న జెనాన్‌ గ్యాస్‌ స్కాన్‌ విధానాన్ని ప్రయోగించారు. అసలు లోపాన్ని ఇది బయటపెట్టింది. వీరి ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి సాఫీగా సాగడంలేదని వెల్లడైంది. ఇలాంటి లక్షణాలకు నిర్దిష్ట కారణాలను గుర్తిస్తే మరింత సమర్థ చికిత్సలను అభివృద్ధి చేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని