అమెరికాలో 9 లక్షలు దాటిన మరణాలు

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభణ నేపథ్యంలో.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య శుక్రవారం 9 లక్షలు దాటింది. కేవలం గత 51 రోజుల్లోనే లక్ష మందిని మహమ్మారి పొట్టన పెట్టుకుంది.

Updated : 06 Feb 2022 06:31 IST

కొవిడ్‌ మహమ్మారి విలయం

వాషింగ్టన్‌: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభణ నేపథ్యంలో.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య శుక్రవారం 9 లక్షలు దాటింది. కేవలం గత 51 రోజుల్లోనే లక్ష మందిని మహమ్మారి పొట్టన పెట్టుకుంది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం.. రెండేళ్లలో అమెరికాలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య ఇండియానాపొలిస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో లేదా ఉత్తర కరోలినాలోని చార్లెట్‌ నగర జనాభా కంటే ఎక్కువ. ‘‘అమెరికాలో మహమ్మారి 9 లక్షల మందిని పొట్టన పెట్టుకుంటుందని రెండేళ్ల క్రితం చెబితే.. చాలామంది దీన్ని నమ్మి ఉండరు’’ అని బ్రౌన్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌ డాక్టర్‌ ఆశిష్‌ కె.ఝా అన్నారు. ఏప్రిల్‌ నాటికి మరణాల సంఖ్య 10 లక్షలకు చేరవచ్చన్నారు. ‘‘మనం శత్రువుని తక్కువగా అంచనా వేశాం’’ అని జాన్స్‌ హాప్‌కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జోష్‌వా ఎం. షార్ఫ్‌స్టెయిన్‌ అభిప్రాయపడ్డారు.

ఈ గాయం భరించలేనిది : బైడెన్‌

అమెరికాలో 9 లక్షల మంది కరోనాకు బలి కావడం పట్ల అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘మహమ్మారి మిగిల్చిన భౌతిక, మానసిక, భావోద్వేగ గాయం భరింపశక్యం కానిది’’ అని పేర్కొన్నారు. అమెరికన్లంతా టీకాలు, బూస్టర్‌ డోసులు తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. 25 కోట్ల మంది ప్రజలు కనీసం ఒక డోసు తీసుకుని తమను తాము కాపాడుకున్నారన్నారు.

జాన్స్‌ హాప్‌కిన్స్‌ సమాచారం మేరకు.. అమెరికాలో జనవరి మధ్య నాటికి రోజువారీ కేసుల సంఖ్య దాదాపు 5 లక్షల మేర నమోదైంది. అనంతరం కొవిడ్‌ అత్యంత తీవ్రదశకు చేరుకోవడంతో ఆ సంఖ్య 8 లక్షలు కూడా దాటింది. కాగా గత రెండు వారాలుగా 49 రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయి. జనవరి మధ్య నుంచి అమెరికాలో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా 15% తగ్గింది. మరణాలు మాత్రం ఇప్పటికే ఎక్కువగా సంభవిస్తున్నాయి. గత శీతాకాలం నుంచి సగటున రోజుకు 2,400 మంది చనిపోతున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్ర దశ దాదాపు ముగింపునకు వస్తోందని ప్రజారోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొత్త వేరియంట్లు మరిన్ని వచ్చే అవకాశం ఉందని, వాటితో పరిస్థితి మళ్లీ ప్రమాదకరంగా కూడా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న తొలి మూడు వ్యాధుల్లో కొవిడ్‌ ఒకటి. వీటిలో హృద్రోగాలు, క్యాన్సర్‌ కూడా ఉన్నాయి.

* అమెరికాలో 2020 డిసెంబరు మధ్య నాటికి కొవిడ్‌ మరణాల సంఖ్య 3 లక్షలు ఉండగా.. 2021 జూన్‌ మధ్య నాటికి ఆ సంఖ్య రెట్టింపు అయింది. అక్టోబరు 1 నాటికి 7 లక్షలకు చేరగా డిసెంబరు 14 సరికి ఆ సంఖ్య 8 లక్షలైంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7.74 కోట్లు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని