Updated : 20 Feb 2022 06:10 IST

‘అణు’ మాత్రం తగ్గడం లేదు

భారీస్థాయిలో రష్యా అణ్వాయుధ విన్యాసాలు
ఉక్రెయిన్‌ అధికారులపై మోర్టార్లతో తిరుగుబాటుదారుల దాడి
యుద్ధానికి సిద్ధమని ప్రకటన  
చర్చిద్దాం రండి.. పుతిన్‌కు జెలెన్‌స్కీ ఫోన్‌

కీవ్‌/మాస్కో/మ్యూనిక్‌: ఉక్రెయిన్‌ సరిహద్దులో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయానక వాతావరణం నెలకొంది. ఓ వైపు రష్యా వేర్పాటువాదులు ఉక్రెయిన్‌పై ఫిరంగులతో విరుచుకుపడుతుంటే.. మరోవైపు పుతిన్‌ సేనలు ‘అణు’ విన్యాసాలు చేస్తూ.. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చేశాయి. రష్యా దాడిచేస్తే తీవ్రాతి తీవ్రమైన ఆంక్షలు తప్పవని అమెరికా, నాటోకూటమి హెచ్చరికలు జారీచేస్తున్నా.. రష్యా అణుమాత్రం తగ్గట్లేదు. ఏ చిన్న హింసాత్మక పరిణామమైనా.. భీకర యుద్ధానికి ఎక్కడ దారితీస్తుందోనని ప్రపంచం యావత్తూ భయపడిపోతుంటే.. వేర్పాటువాదులు శనివారం ఏకంగా ఉక్రెయిన్‌ సైనికాధికారులపైనే ఫిరంగులతో దాడులు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో వివాదం మరింత జటిలంగా మారింది. ఉద్రిక్తతల్ని చల్లార్చే యత్నాల్లో భాగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్‌చేశారు. సంక్షోభ నివారణ కోసం చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. చర్చల వేదికను మీరే నిర్ణయించండని కోరారు. దీనిపై రష్యా నుంచి స్పందన లేదు.

దాడి తథ్యమన్న బైడెన్‌

పుతిన్‌ దాడి చేయాలని నిశ్చయించుకున్నారని, మరికొన్ని రోజుల్లో ఆయన ఉక్రెయిన్‌పై దండెత్తడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పునరుద్ఘాటించారు. యుద్ధ మేఘాలు అలముకుంటుండంతో ఉక్రెయిన్‌ విడిచి రావాలని జర్మనీ, ఆస్ట్రియా తమ పౌరులను హెచ్చరించాయి. రాజధాని కీవ్‌కు లుఫ్తాన్సా తన విమానాలను రద్దు చేసుకుంది. నాటో కూటమి కూడా కీవ్‌లోని తమ కార్యాలయంలోని అధికారులను బ్రసెల్స్‌కు, ఉక్రెయిన్‌లోని లవీవ్‌ నగరానికి తరలిస్తున్నామని ప్రకటించింది.

తుపాకీ పట్టే వారంతా సైన్యంలో చేరండి

ఏ సమయంలోనైనా ఉక్రెయిన్‌ సైన్యం తమపై దాడి చేయొచ్చని, అందుకే పూర్తిస్థాయి పోరాటానికి సిద్ధమవుతున్నామని రష్యా అనుకూల తిరుగుబాటు వర్గాలు పేర్కొన్నాయి. తుపాకీ పట్టగలిగే సామర్థ్యమున్న వారంతా తమ సైన్యంలో చేరాలని డొనెట్స్క్‌ వేర్పాటువాద నేత డెనిస్‌ పుష్లిన్‌ పిలుపునిచ్చారు. మరోవైపు ఉక్రెయిన్‌ దళాలు, తిరుగుబాటు వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. శనివారం ఈ ప్రాంతానికి చేరుకున్న ఉక్రెయిన్‌ ఉన్నత సైనిక అధికారులపై వేర్పాటువాదులు మోర్టార్‌ దాడులకు దిగారు. దీంతో వారు తలదాచుకోవడానికి దగ్గర్లోని బంకర్‌కు పరిగెత్తాల్సి వచ్చింది.

సైనిక సన్నద్ధతపై పుతిన్‌ ఆరా!

శనివారం రష్యా భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహించింది. తన అణుపాటవాన్ని పరీక్షించుకుంది. అణుబాంబులను మోసుకెళ్లే బాలిస్టిక్‌ క్షిపణులు ఇందులో పాల్గొన్నాయి. అత్యాధునిక హైపర్‌సొనిక్‌, క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించింది. టీయూ-95 బాంబర్లను ఉపయోగించింది. విన్యాసాలను మాస్కోలోని రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయం నుంచి బెలారస్‌ అధ్యక్షుడు లుకాషెంకోతో కలిసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పర్యవేక్షించారు. సైనిక సన్నద్ధతపై కమాండర్లతో మాట్లాడారు.

అతి సమీపంలోనే..

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా మోహరించిన సైన్యంలోని 40 నుంచి 50 శాతం దళాలు దాడి చేసేంత సమీపంలో ఉన్నాయని అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. 120 నుంచి 125 వరకు బెటాలియన్‌ టేక్టికల్‌ గ్రూప్‌(బీటీజీ)లను రష్యా మోహరించిందని, ఒక్కో గ్రూప్‌లో 750 నుంచి 1000 మంది సైనికులు ఉంటారని తెలిపింది.

ఈ సమయంలో ఇక్కడెందుకు?

మ్యూనిక్‌ భద్రతా సమావేశానికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఓవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అధ్యక్షుడు దేశం విడిచి రావడం శ్రేయస్కరం కాదని చాలా మంది రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. జెలెన్‌స్కీ.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తదితర నేతలతో చర్చలు జరిపారు. ఈ కష్ట సమయంలో తమ దేశానికి అందిస్తున్న సహకారంపై ధన్యవాదాలు తెలిపారు.


యుద్ధం చేస్తే మీకే ప్రమాదం: కమలా హారిస్‌

ష్యా దూకుడు తగ్గించుకోకుండా, యుద్ధమని తెగబడితే ఆ దేశంపై కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహరిస్‌ హెచ్చరించారు. శనివారం ఆమె జర్మనీలోని మ్యూనిక్‌ భద్రతా సమావేశంలో ప్రసంగించారు. యుద్ధం చేస్తే.. ఐరోపా దేశాలు.. అమెరికాకు మరింత చేరువవుతాయని ఇది రష్యాకే ప్రమాదమని అన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఉద్దేశించి.. ఇది చరిత్రలో ఓ నిర్ణయాత్మక ఘట్టమని, మీ దేశానికి ఎలాంటి ముప్పు వచ్చినా తీవ్రంగా తీసుకుంటామని తెలిపారు. దీనికి సమాధానంగా తమకు శాంతి కావాలని జెలెన్‌స్కీ సమాధానమిచ్చారు.


 

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని