Updated : 23 Feb 2022 05:22 IST

Ukraine Crisis: పుతిన్‌ పిడుగు

ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించిన రష్యా
అటువైపుగా కదులుతున్న పుతిన్‌ సేనలు
వెనక్కి తగ్గేదిలేదన్న ఉక్రెయిన్‌
చొరబాటును తప్పుబట్టిన ఐరాస
స్వదేశం వెలుపల సైన్యం వినియోగానికి రష్యా చట్టసభ గ్రీన్‌సిగ్నల్‌
పుతిన్‌ నిర్ణయంపై ప్రపంచదేశాలు అగ్గిమీద గుగ్గిలం
ఆంక్షల కత్తి ఝళిపిస్తున్న అగ్రరాజ్యాలు
వేర్పాటువాద ప్రాంతాలతో అమెరికా వాణిజ్యం బంద్‌
పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు జర్మనీ ఫుల్‌స్టాప్‌
మాస్కో, కీవ్‌

ఊహించిందే జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. అనుకున్నది చేశారు. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వానికి పెను సవాలు విసిరారు. తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ వేర్పాటువాద భూభాగాలను స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతాలుగా గుర్తిస్తూ సోమవారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ చేశారు. 2014లో ఈ ప్రాంతాలు స్వతంత్రత ప్రకటించుకున్నప్పుడు నిర్ణయించుకున్న సరిహద్దులే వాటికి ఉంటాయని ప్రకటించారు. నాటోలో సభ్యత్వం పొందకుండా, ఆయుధాలను ఇతర దేశాల నుంచి పొందకుండా ఉక్రెయిన్‌ను అడ్డుకునేందుకు ఈ దిశగా అడుగువేశారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వంతో, పాలనతో ఇకపై ఈ ప్రాంతాలకు ఎలాంటి సంబంధాలు ఉండవని తెలిపారు. ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు శాంతి పరిరక్షక దళాల పేరిట సేనలను పంపించాలని నిర్ణయించారు. రష్యా వెలుపల సైనిక బలగాల వినియోగానికి తమ దేశ చట్టసభ అనుమతి కూడా పొందారు. అధ్యక్షుడి నిర్ణయానికి అనుగుణంగా రష్యా యుద్ధట్యాంకులు, సైనిక బలగాలు కదులుతున్నాయి. క్రిమియాను తమ దేశంలో భాగంగా గుర్తించాలని కూడా అంతర్జాతీయ సమాజానికి పుతిన్‌ పిలుపునిచ్చారు. పుతిన్‌ నిర్ణయం ఉక్రెయిన్‌ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని ప్రపంచ దేశాలు ఆక్షేపించాయి. ఆయన తీరును తీవ్రంగా గర్హిస్తూ.. రష్యాపై ఆంక్షల కత్తి ఝళిపించడం ప్రారంభించాయి. ఐరాస భద్రతామండలి అత్యవసరంగా సమావేశమై తాజా పరిణామాన్ని ఖండించింది. రష్యా చర్య దురాక్రమణ కిందికే వస్తుందని అమెరికా అధ్యక్షభవనం ప్రకటించింది.  వేర్పాటువాదుల ప్రాంతంలో పెట్టుబడులు, వాణిజ్యాన్ని నిషేధిస్తూ ఆ మేరకు వెను వెంటనే అధ్యక్షుడు బైడెన్‌ ఉత్తర్వులు వెలువరించారు. రష్యా నుంచి తమ దేశానికి గ్యాస్‌ తరలించే కీలకమైన ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల్ని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అసలేం జరిగింది..?

పుతిన్‌ అధ్యక్షతన సోమవారం రష్యా భద్రతా మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో సభ్యులు తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి గుర్తింపు ఇవ్వాలని అధ్యక్షుడిని కోరారు. సమావేశానంతరం రష్యా జాతీయ టీవీ ద్వారా పుతిన్‌ గంటసేపు ప్రసంగించారు. ‘‘ఉక్రెయిన్‌కు అసలు ఎప్పుడూ సొంత దేశం హోదా లేదు. దానికి ఎప్పుడూ స్థిరమైన రాజ్యాధికారం కూడా లేదు. ఉక్రెయిన్‌ సొంతంగా అణ్వాయుధాలు తయారు చేయగలదు. దానికి పశ్చిమ దేశాలు సాయం చేసే అవకాశం ఉంది. అదే అసలైన ముప్పు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలను స్వయం ప్రతిపత్తి ఉన్న భూభాగాలుగా గుర్తిస్తున్నట్లు డిక్లరేషన్‌పై సంతకం చేశారు. అదే సమయంలో వేర్పాటువాద ప్రాంత నాయకులు పుతిన్‌ను సైనిక సాయం కోరారు. ఆ మేరకు శాంతి పరిరక్షణ దళాలు ఆ ప్రాంతాలకు వెళ్తాయని పుతిన్‌ ప్రకటించారు.

బలగాల వినియోగానికి సమ్మతి

రష్యా వెలుపల తమ సైనిక బలగాలను వినియోగించేందుకు రష్యా శాసనకర్తలు మంగళవారం పుతిన్‌కు అనుమతిచ్చారు. ఈ మేరకు ఎగువసభ ‘ఫెషరేషన్‌ కౌన్సిల్‌’ ఏకగ్రీవంగా ఓటు వేసింది. దీంతో ఉక్రెయిన్‌పై దాడికి ముందస్తు సూచనలు మరింత బలపడ్డాయి.

రష్యా ఆక్రమణ మొదలైందన్న బ్రిటన్‌

ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ మొదలైందని బ్రిటన్‌ మంత్రి సాజిద్‌ జావిద్‌ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన వీలైనంత మందిని ఈ ఆంక్షల పరిధిలోకి తెస్తామని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలకు పుతిన్‌ పూర్తిగా పాతర వేశారని బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ మండిపడ్డారు. రష్యా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బకొట్టేలా వీలైనన్ని ఆంక్షలు విధిస్తామని తేల్చిచెప్పారు.


రంగంలోకి యుద్ధ ట్యాంకులు

వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్న దొనెట్స్క్‌ నగరం వైపు ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలు వెళ్తున్నట్లు రాయిటర్స్‌ వార్తాసంస్థ తెలిపింది. దొనెట్స్క్‌కు సమీపంలో ఐదు, నగరంలో మరో 2 యుద్ధ ట్యాంకులు కనిపించాయని, వాటిపై ఎలాంటి చిహ్నాలు కనిపించలేదని వివరించింది. తమ సేనలు ఉక్రెయిన్‌లో ప్రవేశించిన విషయాన్ని రష్యా అధికారికంగా ధ్రువీకరించలేదు. దాదాపు 1.50 లక్షల మంది సైనికులను ఉక్రెయిన్‌కు మూడువైపులా మోహరించినట్లు సమాచారం. ఇప్పటికే తిరుగుబాటుదారులు, ఉక్రెయిన్‌ సైన్యం మధ్య కాల్పులతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్‌ భూభాగంలో రష్యా సేనలు ప్రవేశించినట్లు ఐరోపాలోని అనేక దేశాలు చెబుతున్నాయి.


భయపడం: ఉక్రెయిన్‌

తాము శాంతిని కోరుకుంటున్నామని, తమ భూభాగాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ‘ఇది మా దేశం. మేం ఎవరికీ భయపడేది లేదు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో వెనకడుగు వేసేది లేదు’ అని తేల్చి చెప్పారు.  


రష్యావి భయానక చర్యలన్న అమెరికా

ఐరాస: రష్యా - ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్‌ వినతి మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు రష్యాపై మండిపడ్డాయి. తూర్పు ఉక్రెయిన్‌లో శాంతి పరిరక్షణ పేరిట రష్యా చేపట్టిన చర్యలు అర్థం లేనివని అమెరికా దుయ్యబట్టింది. యుద్ధం చేయాలన్న దురుద్దేశంతోనే రష్యా కొన్ని ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పించిందని మండిపడింది. ‘‘రష్యా చర్యల వల్ల ఉక్రెయిన్‌ వ్యాప్తంగానే కాకుండా ఐరోపాలో, ప్రపంచమంతటా భయానక పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉక్రెయిన్‌ సైన్యం, అక్కడి వేర్పాటువాదుల మధ్య ఘర్షణలను నివారించేలా 2014-15లో చేసుకున్న ఒప్పందాన్ని పుతిన్‌ ముక్కలు చేశారు. ఆయన అంతటితో ఆగుతారనే నమ్మకం లేదు’’ అని పేర్కొంది. ఈ సమావేశంలో రష్యాకు మద్దతు లభించలేదు. రష్యా చర్యలను బ్రిటన్‌ సహా పలు దేశాలు ఖండించాయి. ఉక్రెయిన్‌కు అవసరమైన మేర తమ మద్దతు ఉంటుందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి బైడెన్‌ ఫోన్‌

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే అంశంపై జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఓలాఫ్‌ షోల్స్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌తోనూ బైడెన్‌ సంభాషించారు.


Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని