Ukraine Crisis: ఎవరి బలాబలాలెంత?

ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమర శంఖం పూరించిన వేళ.. ఇరు దేశాల సైనిక బలాబలాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పుతిన్‌ సేన ఆయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్‌ సామర్థ్యం వెలవెలబోతోంది. క్షిపణి పరిజ్ఞానం, ట్యాంకు బలగం విషయంలో రష్యా ప్రపంచంలోనే

Updated : 25 Feb 2022 06:03 IST

ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమర శంఖం పూరించిన వేళ.. ఇరు దేశాల సైనిక బలాబలాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పుతిన్‌ సేన ఆయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్‌ సామర్థ్యం వెలవెలబోతోంది. క్షిపణి పరిజ్ఞానం, ట్యాంకు బలగం విషయంలో రష్యా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. జలాంతర్గాముల బలంలో మూడో స్థానంలో ఉంది. దీనికితోడు ఉక్రెయిన్‌ తరఫున తన బలగాలను పంపబోమని అమెరికా చెప్పడంతో పోరు ఏకపక్షంగానే సాగే అవకాశం కనిపిస్తోంది.

పశ్చిమ దేశాల సాయం
* ఉక్రెయిన్‌ ఆత్మరక్షణ కోసం పశ్చిమ దేశాలు భారీగా ఆయుధాలు అందించాయి. 2014 నుంచి అమెరికా 250 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం చేసింది. వీటిలో జావలిన్‌ క్షిపణులు, తీర రక్షణ గస్తీ బోట్‌లు, హమ్వీ వాహనాలు, స్నైపర్‌ రైఫిళ్లు, నిఘా డ్రోన్లు, రాడార్‌ వ్యవస్థలు వంటివి ఉన్నాయి. జావలిన్‌ క్షిపణిని సైనికులు భుజం మీద నుంచే పేల్చవచ్చు. వాటి సాయంతో రష్యా ట్యాంకులను లక్ష్యంగా చేసుకోవచ్చు.

* భుజం నుంచి పేల్చే స్టింగర్‌ క్షిపణులూ ఉక్రెయిన్‌కు అందాయి. వీటితో యుద్ధవిమానాలు, హెలికాప్టర్లపై దాడి చేయవచ్చు.

* టర్కీ.. బేరక్తర్‌ టీబీ2 డ్రోన్లను ఉక్రెయిన్‌కు విక్రయించింది. బ్రిటన్‌ గత నెలలో 2వేల స్వల్పశ్రేణి ట్యాంకు విధ్వంసక క్షిపణులను పంపింది. ఇవికాక టన్నులకొద్దీ మందుగుండు సామగ్రి, శతఘ్ని, మోర్టారు షెల్స్‌, గ్రెనేడ్‌ లాంచర్లు, మెషీన్‌గన్‌లు ఉక్రెయిన్‌కు అందుతున్నాయి.

నేడు కొంత నయం.. 

2014లో పుతిన్‌ సేన.. ఉక్రెయిన్‌లోని క్రిమియాను ఆక్రమించుకుంది. నాడు కనీస పోరాటం కూడా చేయకుండానే ఉక్రెయిన్‌ చేతులెత్తేసింది. తర్వాత తన శిక్షణను మెరుగుపరచుకుంది. ఈసారి మాతృదేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ రక్షించుకోవాలన్న సంకల్పం కనిపిస్తోంది. 2014 నుంచి రష్యా మద్దతున్న వేర్పాటువాదులతో పోరాడటం ద్వారా ఉక్రెయిన్‌ సైన్యం గణనీయ స్థాయిలో యుద్ధ అనుభవాన్ని గడించింది. ప్రాథమిక సైనిక శిక్షణ పొందిన 9 లక్షల మంది వాలంటీర్లతో రిజర్వు దళాలను సిద్ధం చేసుకుంది. దీనికితోడు బుధవారం నుంచి ఆయుధాలను కలిగి ఉండేందుకు పౌరులకు ఉక్రెయిన్‌ ప్రభుత్వం అనుమతినిచ్చింది.

రష్యా బలం ముందు నిలిచేనా? 

ఉక్రెయిన్‌ చర్యలు, పశ్చిమ దేశాల ఆయుధాలతో రష్యా ఆక్రమణ  కొంతమేర జాప్యం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతిమంగా ఉక్రెయిన్‌కు భారీగా నష్టం తప్పదని అంచనావేస్తున్నారు.
* ఉక్రెయిన్‌ విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలు చాలా బలహీనంగా ఉన్నాయి. దీంతో రష్యా యుద్ధవిమానాలకు పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవచ్చు.
* ఒకవేళ రష్యా గనుక అధునాతన ఎలక్ట్రానిక్‌ యుద్ధవ్యవస్థలనూ రంగంలోకి దించితే ఉక్రెయిన్‌ ఆదేశిక, నియంత్రణ వ్యవస్థ (కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌) కుప్పకూలుతుంది. ఫలితంగా క్షేత్రస్థాయిలోని సైన్యంతో సంబంధాలు తెగిపోవచ్చు.

పూర్తిస్థాయి ఆక్రమణ ఉంటుందా? 

ఉక్రెయిన్‌ను పూర్తిస్థాయిలో ఆక్రమించేందుకు రష్యా యత్నించకపోవచ్చని పలువురు సైనిక విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి ప్రయత్నంతో పోరు సంక్లిష్టంగా మారుతుందని, దీర్ఘకాలం కొనసాగుతుందని, భారీ ప్రాణనష్టం ఉంటుందని వారు పేర్కొన్నారు.  అందువల్ల భీకర వైమానిక దాడులు, పరిమిత స్థాయిలో భూభాగాల ఆక్రమణకు మాత్రమే రష్యా పరిమితం కావొచ్చు. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతం నుంచి దక్షిణం, పశ్చిమ దిక్కులకు రష్యా సేన మళ్లవచ్చు. తద్వారా క్రిమియాకు నల్ల సముద్రంతో సంధానత కల్పించే ప్రయత్నం చేయవచ్చు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని