తడి కన్నులను తుడిచిన నేస్తం.. కీవ్‌లో 130 మంది భారతీయులకు ఆశ్రయం, ఆహారం

ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఒక భారతీయుడు ఉంటాడు. అక్కరలో నేనున్నానంటాడు. ఇప్పుడు రష్యా దాడుల ధాటికి చివురుటాకులా వణికిపోతున్న ఉక్రెయిన్‌లోనూ ఉన్నాడు... మనీశ్‌ దవే! కీవ్‌లో చిక్కుకుపోయిన మనవాళ్లతో పాటు ఉక్రెయిన్‌ జాతీయులకూ ఆశ్రయం కల్పించి, ఆహారం అందిస్తున్నారు. మనీశ్‌ది గుజరాత్‌లోని వడోదరా. భారతీయులు చాలామంది ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న విషయం తెలుసుకుని గత ఏడాదే కీవ్‌ చేరుకున్నారు. భారతీయ సంస్కృతిని ఇక్కడ పరిచయం చేయాలని, మనవారికి ఇంటి వంటను అందించాలని తలపోశారు.

Updated : 03 Mar 2022 07:59 IST

ఉదారత చాటుకుంటున్న రెస్టారెంట్‌ యజమాని మనీశ్‌ దవే

కీవ్‌: ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఒక భారతీయుడు ఉంటాడు. అక్కరలో నేనున్నానంటాడు. ఇప్పుడు రష్యా దాడుల ధాటికి చివురుటాకులా వణికిపోతున్న ఉక్రెయిన్‌లోనూ ఉన్నాడు... మనీశ్‌ దవే! కీవ్‌లో చిక్కుకుపోయిన మనవాళ్లతో పాటు ఉక్రెయిన్‌ జాతీయులకూ ఆశ్రయం కల్పించి, ఆహారం అందిస్తున్నారు. మనీశ్‌ది గుజరాత్‌లోని వడోదరా. భారతీయులు చాలామంది ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న విషయం తెలుసుకుని గత ఏడాదే కీవ్‌ చేరుకున్నారు. భారతీయ సంస్కృతిని ఇక్కడ పరిచయం చేయాలని, మనవారికి ఇంటి వంటను అందించాలని తలపోశారు. అప్పు చేసిన డబ్బులతో ‘సాథియా’ పేరుతో చిన్న రెస్టారెంట్‌ తెరిచారు. ఆర్థికంగా తాను నిలదొక్కుకోక ముందే రష్యా యుద్ధానికి దిగింది. కీవ్‌లో చిక్కుకుపోయిన చాలామంది భారతీయులు స్వదేశానికి వచ్చే దారిలేక, నిద్రాహారాలకు దూరమై.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తీవ్రంగా సతమతమవుతున్నారు. వారి కన్నీటిని చూసి చలించిపోయారు మనీశ్‌. తన రెస్టారెంట్‌ను బంకర్‌గా మార్చేశారు. 130 మందికి పైగా భారతీయులకు ఇక్కడ ఆశ్రయం కల్పించి, ఆహారం అందిస్తున్నారు. ఆపదలో ఉన్నవారు తమ వద్ద ఆశ్రయం పొందవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా ఆహ్వానం పలుకుతున్నారు. ఉక్రెయిన్‌ జాతీయులైన చాలామంది గర్భిణులు, చిన్నారులు, విద్యార్థులు, నిరాశ్రయులు కూడా సాథియాలో తలదాచుకుంటున్నారు. ఆయన ఉదారతపై వాషింగ్టన్‌ పోస్ట్‌ వంటి పత్రికలు ప్రత్యేక కథనాలు అందించడంతో ఇప్పుడు యావత్‌ ప్రపంచానికీ పరిచయమయ్యారు... మనీశ్‌!

సరకులను తీసుకురావడమే కష్టమవుతోంది
మా రెస్టారెంట్‌ బేస్‌మెంట్‌లో ఉంది. దీంతో దీన్ని బంకర్‌లా మార్చి, భారతీయులతో పాటు ఉక్రెయిన్‌ జాతీయులకూ ఆశ్రయం కల్పిస్తున్నాం. ఆహారమూ అందిస్తున్నాం. బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో సరకులను తీసుకురావడం ఇబ్బందిగా మారింది. నాలుగైదు రోజులకు సరిపడా బియ్యం, పిండి ఉన్నాయి. కాయగూరలు, ఇతర సామగ్రిని సమకూర్చుకోవాలి.

- మనీశ్‌ దవే, సాథియా రెస్టారెంట్‌ యజమాని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని