Ukraine Crisis: రష్యాపై చమురు పిడుగు

క్రెయిన్‌పై విచక్షణా రహితంగా విరుచుకుపడుతున్న రష్యాపై అమెరికా, బ్రిటన్‌ భారీ ఆర్థిక అస్త్రాన్ని సంధించాయి. చమురు ఎగుమతుల ద్వారా ఆ దేశానికి వస్తున్న ఆదాయానికి గండికొట్టే కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యా నుంచి చమురు,

Updated : 09 Mar 2022 06:17 IST

రష్యా దిగుమతులపై నిషేధం ప్రకటించిన అమెరికా, బ్రిటన్‌
ఆర్థిక ఆంక్షలు మరింత తీవ్రతరం
ప్రజల తరలింపులకు మార్గం సుగమం
సుమీ నుంచి బయటపడిన భారతీయ విద్యార్థులు

కీవ్‌, లివీవ్‌: ఉక్రెయిన్‌పై విచక్షణా రహితంగా విరుచుకుపడుతున్న రష్యాపై అమెరికా, బ్రిటన్‌ భారీ ఆర్థిక అస్త్రాన్ని సంధించాయి. చమురు ఎగుమతుల ద్వారా ఆ దేశానికి వస్తున్న ఆదాయానికి గండికొట్టే కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతి చేసుకోరాదని అమెరికా మంగళవారం నిర్ణయించింది. రష్యాపై ఇప్పటికే విధించిన ఆంక్షలకు ఇది అదనం. తద్వారా రష్యాపై ఒత్తిడిని తీవ్రతరం చేయొచ్చని బైడెన్‌ సర్కారు భావిస్తోంది. ఇతర ఆంక్షల ప్రభావం రష్యాపై ఉన్నా, ఇంధన అమ్మకాల ద్వారా నిరంతరం ఆర్థిక వనరులు పొందగలుగుతోంది. అందుకే అమెరికా ఈ అడుగు వేసింది. దీని ప్రభావం తమ ప్రజలపైనా పడవచ్చనీ, అయినా రష్యా చేపట్టిన యుద్ధాన్ని సమర్థించేది లేదని బైడెన్‌ స్పష్టంచేశారు.

తరలిపోయేవారికి వెసులుబాటు

బాంబులు, రాకెట్లు, క్షిపణుల మోత నుంచి ఎంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోదామా అని ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉక్రెయిన్‌లో నిరీక్షిస్తున్నవారికి ఎట్టకేలకు కాస్త ఉపశమనం లభించింది. ప్రజలు తరలిపోవడానికి సురక్షిత నడవాలు(సేఫ్‌ కారిడార్లు) ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన రష్యా- ఈసారి ఆ మాట నిలబెట్టుకోవడంతో ఆ ప్రక్రియ మొదలైంది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న ప్రజలతో ప్రత్యేక బస్సులు కిటకిలాడాయి. రెడ్‌క్రాస్‌ చిహ్నం బస్సుల్లో వీరిని తరలిస్తున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా ప్రజలు వలస వెళ్లినట్లయిందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. కొన్నిరోజులుగా కీవ్‌లో నిలిచిపోయిన భారతీయ విద్యార్థులు మొత్తానికి అక్కడి నుంచి కదిలి పోల్టావా అనే ప్రాంతానికి బయల్దేరారు.

తేల్చుకునే స్వేచ్ఛను ప్రజలకు వదిలేయాలి

సురక్షిత కారిడార్లు ఒకటికంటే ఎక్కువే ఉంటాయనీ, అయితే అవి రష్యాకు దారి తీస్తాయని రష్యా సమన్వయ కేంద్రం తెలిపింది. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ప్రజలకు వదిలేయాలని రష్యా రాయబారి ఐరాసలో పేర్కొన్నారు. భారత్‌, చైనాలకు చెందిన విద్యార్థులు సహా పలువురిని ఉక్రెయిన్‌లోని పొల్టావా నగరానికి చేరుస్తామని ఉక్రెయిన్‌ ఉప ప్రధాని ఇరియానా వెరెష్‌చుక్‌ చెప్పారు. రష్యా, బెలారస్‌లకు ప్రజల్ని తరలించాలనే ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రజల తరలింపు విషయంలో ఐక్యరాజ్యసమితిలోనూ రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

కొనసాగుతున్న బాంబుల మోత

కీవ్‌ నగరం రష్యా సైనికుల చేతికి చిక్కకుండా చూసేందుకు వందలకొద్దీ అడ్డుకట్టలను ఉక్రెయిన్‌ సైనికులు, ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ నగర శివార్లతో పాటు పలుచోట్ల రష్యా బలగాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. సుమీ నగరంలో రష్యా సేనలు చేసిన లక్షిత దాడుల్లో 10 మంది పౌరులు మరణించారు. రెండు చమురు డిపోలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. యుద్ధంలో కనీసం 400 మంది సాధారణ పౌరులు చనిపోయారని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ తెలిపారు. తమ బలగాల చేతిలో సుమారు 11,000 మంది రష్యా సైనికులు చనిపోయి ఉంటారని తెలిపారు. ఉక్రెయిన్‌ దళాల చేతిలో రష్యా మేజర్‌ జనరల్‌ విటాలి గెరాసిమోవ్‌ ప్రాణాలు కోల్పోయారు. కొద్దిరోజుల వ్యవధిలో ఈ స్థాయి ఉన్న రెండో ఉన్నతాధికారిని రష్యా కోల్పోయినట్లయింది.


కొనసాగితే రష్యాకు నష్టమే: అమెరికా

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌ స్థావరాలపై 625కి పైగా క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా నిఘా విభాగం వెల్లడించింది. యుద్ధం మరికొన్ని రోజులు ఇలానే కొనసాగితే రష్యా భారీ నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉందని అమెరికా మరోసారి హెచ్చరించింది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని నాటో సభ్య దేశాలపై యుద్ధ ప్రభావం పడితే తక్షణమే చర్యలు తీసుకునేలా అక్కడకు అదనపు బలగాలను పంపినట్లు తెలిపింది. వీటితో కలిపి నాటో సభ్యదేశాల్లో లక్షకు పైగా అమెరికా సేనలు ఉన్నాయని తెలిపింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని