Ukraine Crisis: పచ్చడి సీసాతో డ్రోన్‌ను కూల్చేసిన బామ్మ!

చెమ్చాతో సముద్రాన్ని తోడ శక్యమా!.. కమ్చీతో విమానాన్ని తోల శక్యమా! సిరిసిరిమువ్వా!’ అన్న కవి ప్రశ్నలు ఉక్రెయిన్‌ పౌరులు వింటే ‘శక్యమే’ అంటారు కాబోలు. రష్యా యుద్ధ ట్యాంకర్‌ను ఎత్తుకెళ్లిన ఉక్రెయిన్‌ రైతు.. ఆరు విమానాల్ని కూల్చేసిన ఒకే ఒక్కడు.. ఇలా ఎన్నో వార్తలు గత కొన్నిరోజులుగా ఉక్రెయిన్లో చక్కర్లు కొడుతున్నాయి.

Updated : 10 Mar 2022 09:21 IST

యుద్ధభూమి ఉక్రెయిన్‌లో కథలుగా పౌరుల సాహసాలు

కీవ్‌: ‘చెమ్చాతో సముద్రాన్ని తోడ శక్యమా!.. కమ్చీతో విమానాన్ని తోల శక్యమా! సిరిసిరిమువ్వా!’ అన్న కవి ప్రశ్నలు ఉక్రెయిన్‌ పౌరులు వింటే ‘శక్యమే’ అంటారు కాబోలు. రష్యా యుద్ధ ట్యాంకర్‌ను ఎత్తుకెళ్లిన ఉక్రెయిన్‌ రైతు.. ఆరు విమానాల్ని కూల్చేసిన ఒకే ఒక్కడు.. ఇలా ఎన్నో వార్తలు గత కొన్నిరోజులుగా ఉక్రెయిన్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని వినడమే తప్ప.. సరైన ఆధారాలు ఎక్కడా లేవు. బలమైన రష్యా సేనలపై పోరుకు సామాన్యులంతా కదలివస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ సైనికులు, పౌరుల్లో కదనోత్సాహం నింపేందుకు ఇలాంటి కథనాలు వ్యాప్తి చెందుతున్నాయన్న వాదనల మధ్య మరో వార్త అందరి దృష్టినీ ఆకర్షించింది. ఓ వృద్ధురాలు టమాట ఊరగాయ సీసాతో రష్యా డ్రోన్‌ను కూల్చేసిందన్నది దాని సారాంశం. ఆ పని చేసింది తానేనంటూ.. ఓ మహిళ ఉక్రెయిన్‌కు చెందిన లిగా.లైఫ్‌ వార్తాసంస్థను సంప్రదించింది. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా పేరు ఎలీనా. గతంలో జర్నలిస్టుగా పనిచేసి, వ్యాపారవేత్తగా మారా. ఓ రోజు (కచ్చితంగా ఎప్పుడన్నది చెప్పలేదు) కీవ్‌లోని నా ఇంటి బాల్కనీలో కూర్చొని సిగరెట్‌ తాగుతున్నా. అప్పుడే ఓ డ్రోన్‌ అటుగా ఎగురుతూ వచ్చింది. చుట్టూ చూశా.. కుర్చీ కింద టమాట ఊరగాయ సీసా ఉంది. దాన్ని తీసి బలంగా డ్రోన్‌పై విసిరా. అది కిందపడి ముక్కలైంది’ అంటూ ఎలీనా చెప్పిన వివరాలతో ఆ వార్తాసంస్థ కథనం ప్రచురించింది. ఎలీనా కూల్చినట్లుగా చెబుతున్న డ్రోన్‌.. ఆయుధాలు ప్రయోగించే మిలటరీ డ్రోన్‌ అయి ఉండదని నిపుణులు చెబుతున్నారు. నిఘా కార్యకలాపాల కోసం ఫొటోలు, వీడియోలు తీసే సాధారణ డ్రోన్‌పై ఆమె సీసా విసిరి ఉండొచ్చని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని