భారత క్షిపణి ఘటనపై చైనా సలహా

భారత్‌ ప్రయోగించిన ఓ క్షిపణి ఇటీవల పాకిస్థాన్‌ భూభాగంలో పడిన ఘటనపై తాజాగా చైనా స్పందించింది. రెండు దేశాలు చర్చించుకొని, సాధ్యమైనంత త్వరగా దీనిపై విచారణ జరపాలని

Published : 15 Mar 2022 05:08 IST

బీజింగ్‌: భారత్‌ ప్రయోగించిన ఓ క్షిపణి ఇటీవల పాకిస్థాన్‌ భూభాగంలో పడిన ఘటనపై తాజాగా చైనా స్పందించింది. రెండు దేశాలు చర్చించుకొని, సాధ్యమైనంత త్వరగా దీనిపై విచారణ జరపాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ సోమవారం బీజింగ్‌లో మాట్లాడుతూ సలహా ఇచ్చారు. దక్షిణాసియాలో ప్రధాన దేశాలైన భారత్‌, పాకిస్థాన్‌లపై ప్రాంతీయ భద్రత, సుస్థిరతలను కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. అయితే క్షిపణి ఘటనపై సంయుక్త విచారణ జరపాలన్న పాకిస్థాన్‌ డిమాండ్‌ను ఆయన సమర్థించకపోవడం గమనార్హం. మున్ముందు ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడటానికి రెండు దేశాలూ ఎప్పటికప్పుడు సమాచారం మార్పిడి చేసుకోవాలని, ముందస్తు నోటీసులు పంపుకొనే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా ఝావో సూచించారు. సాంకేతిక లోపం కారణంగా ఈనెల 9న ప్రమాదవశాత్తూ తమ క్షిపణి పాక్‌ భూభాగంలో పడిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని భారత రక్షణ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇది విచారించాల్సిన ఘటనే అయినా, క్షిపణి వల్ల ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిస్తోందని తెలిపింది. భారత్‌ వివరణ పట్ల సంతృప్తి చెందని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ ఈ ఉదంతంపై సంయుక్త విచారణ జరగాలని శనివారం డిమాండ్‌ చేసింది. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య ప్రతినిధిని పిలిచి నిరసన తెలిపింది. ఉభయ దేశాలూ అణ్వస్త్ర రాజ్యాలు కనుక ఇలాంటి ఘటనల్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా పరిగణించాలని కోరింది. పాక్‌ భూభాగంలో పడిన క్షిపణి ఏ తరహాదో భారత్‌ వెల్లడించకపోయినా అది బ్రహ్మోస్‌ క్షిపణి అని పాక్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని