లొంగేదే లేదు

ఓడరేవు నగరం మేరియుపొల్‌లో ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలని రష్యా చేసిన డిమాండును ఉక్రెయిన్‌ సైన్యం తిరస్కరించింది. తెల్లజెండాలు చూపించి లొంగిపోతే సైనికులు సురక్షితంగా నగరం నుంచి బయటపడేందుకు

Updated : 22 Mar 2022 06:11 IST

మేరియుపొల్‌పై రష్యా ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ నిరాకరణ

కీవ్‌లో షాపింగ్‌ మాల్‌పై దాడిలో 8 మంది మృతి

రసాయన కర్మాగారంపై బాంబులు పడి లీకైన అమ్మోనియా

కీవ్‌లో సోమవారం రష్యా బంబుల వర్షం కురిపించడంతో సర్వనాశనమైన షాపింగ్‌ మాల్‌, వాహనాలు

లివీవ్‌: ఓడరేవు నగరం మేరియుపొల్‌లో ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలని రష్యా చేసిన డిమాండును ఉక్రెయిన్‌ సైన్యం తిరస్కరించింది. తెల్లజెండాలు చూపించి లొంగిపోతే సైనికులు సురక్షితంగా నగరం నుంచి బయటపడేందుకు అవకాశం కల్పిస్తామని, ఆ మేరకు రాతపూర్వక స్పందన కోసం సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు సమయం ఇస్తున్నామని రష్యా తొలుత ప్రకటించింది. దానికి అంగీకరిస్తే నగరానికి మానవతా సాయం కింద సరఫరాలు వెంనే మొదలవుతాయనీ, మేరియుపొల్‌లోనే ఉండాలా.. బయటకు వెళ్లిపోవాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవచ్చనీ తెలిపింది. ఉక్రెయిన్‌ నియంత్రణలో ఉన్న ప్రాంతాలకు సైనికులు వెళ్లిపోయేందుకు ‘మానవతా దృక్పథం’తో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పింది. దీన్ని వినియోగించుకోకపోతే ఏం చేస్తుందనేది మాత్రం వెల్లడించలేదు. లొంగుబాటుకు, ఆయుధాలు వదిలేసేందుకు ఎంతమాత్రం ఆస్కారం లేదనీ, రష్యాది కపట ప్రకటన అని ఉక్రెయిన్‌ పేర్కొంది. మేరియుపొల్‌ సహా ప్రధాన నగరాలపై దాడుల్ని రష్యా ముమ్మరంగా కొనసాగించింది. రాజధాని కీవ్‌లోని నివాస ప్రాంతాల మధ్య ఉన్న షాపింగ్‌ మాల్‌పై దాడిలో 8 మంది మృతిచెందారు. మేరియుపొల్‌లోని ఆర్ట్‌ స్కూల్‌పై ఆదివారం నాటి బాంబు దాడి తర్వాత పరిస్థితిపై ఎలాంటి స్పష్టతరాలేదు. ఈ స్కూలుపై బాంబులు వేసిన పైలట్‌ అంతు చూస్తామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన వీడియో సందేశంలో ప్రతినబూనారు. ఇప్పటికే ఇలాంటి వందమందిని తుదముట్టించామని చెప్పారు. ఆ నగరంలో జరుగుతున్నది సామూహిక యుద్ధ నేరమని ఈయూ విదేశాంగ విధాన అధిపతి జోసెఫ్‌ బొరెల్‌ వ్యాఖ్యానించారు.

సాగుతున్న చర్చలు.. పైచేయి కోసం తంటాలు

ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలై ఇప్పటికి 26 రోజులు గడిచినా పైచేయి రష్యా సాధించలేకపోయింది. నగరాలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రష్యా దాడులు చేస్తుండగా, ఆ దేశ సరఫరా వ్యవస్థల్ని ధ్వంసం చేసేలా మెరుపుదాడులకు జెలెన్‌స్కీ సేనలు దిగుతున్నాయి. రెండు దేశాల మధ్య వీడియో మాధ్యమంలో చర్చలు కొనసాగినా ప్రతిష్టంభన తొలగిపోలేదు. నేరుగా పుతిన్‌తో భేటీ అయ్యేందుకు జెలెన్‌స్కీ ఆసక్తి చూపిస్తుండగా.. ముందుగా చర్చల్లో మరింత పురోగతి సాధించాల్సి ఉందని రష్యా ప్రతినిధులు అంటున్నారు.

నాలుగు దేశాధినేతలతో మాట్లాడిన బైడెన్‌

యుద్ధం నేపథ్యంలో ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌ దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాట్లాడారు. ముఖాముఖి చర్చల నిమిత్తం ఈ వారంలోనే బెల్జియం, పోలండ్‌లకు ఆయన వెళ్లనున్నారు. నాటో, ఈయూ సభ్య దేశాలతో అత్యవసరంగా బైడెన్‌ భేటీ కానున్నారని శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. గురువారం జరగబోయే శిఖరాగ్ర సమావేశం ద్వారా నాటోను బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. యుద్ధంలో ఇంతవరకు 902 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు ఐరాస తెలిపింది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇజ్రాయెల్‌ ప్రయత్నాలు ప్రారంభించింది.

దేనినీ వదిలిపెట్టడం లేదు ‘సుమీ’

తూర్పు ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు క్రూయిజ్‌ క్షిపణి దాడుల్లో సుమీఖింపోరమ్‌ రసాయన కర్మాగారం నుంచి అమ్మోనియా లీక్‌ అయిందని అధికారులు వెల్లడించారు. దాడిలో ఈ కర్మాగారం పూర్తిగా నేలమట్టమైంది. ప్లాంటు పరిసర ప్రాంతాల్లో 2,63,000 మంది నివసిస్తున్నారు. రసాయనిక దాడులు జరిగాయంటూ తమపై నిందలు వేసేలా ఉక్రెయిన్‌ దళాలే గ్యాస్‌ను లీక్‌ చేశాయని రష్యా చెబుతోంది. మేరియుపొల్‌ను స్వాధీన పరచుకుని తమ రాకపోకలకు మార్గం సుగమం చేసుకోవాలని రష్యా భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని