రెండో బ్లాక్‌బాక్సు కోసం అన్వేషణ

చైనాలో బోయింగ్‌ 737 విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో నాలుగో రోజూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండో బ్లాక్‌బాక్స్‌ కోసం అన్వేషిస్తున్నారు. 132 మందితో ప్రయాణిస్తున్న ఈ

Published : 25 Mar 2022 05:20 IST

చైనా విమాన ప్రమాదంలో నాలుగో రోజూ గాలింపు

బీజింగ్‌: చైనాలో బోయింగ్‌ 737 విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో నాలుగో రోజూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండో బ్లాక్‌బాక్స్‌ కోసం అన్వేషిస్తున్నారు. 132 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం దక్షిణ చైనాలోని పర్వత ప్రాంతాల్లో సోమవారం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రమాదం సంభవించి 3 రోజులు దాటగా గురువారం కొన్ని పెద్ద శకలాలు, ఇంజిన్‌ భాగాలు, లోగో ఉన్న రెక్కలోని కొంతభాగాన్ని కనుగొన్నట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. కొన్ని వాలెట్లు, గుర్తింపు-బ్యాంకు కార్డులు, మానవ అవశేషాలను గుర్తించారు. ప్రయాణించిన వారిలో ఏ ఒక్కరూ జీవించి ఉన్నట్లు ఇంతవరకూ ఎలాంటి సమాచారం లభించలేదు. కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌తో కూడిన ఓ బ్లాక్‌బాక్సు బుధవారం లభ్యం కాగా దాన్ని బీజింగ్‌లోని ఓ ల్యాబ్‌లో డీకోడ్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విమాన ప్రమాదానికి కారణాలను తెలుసుకోవాలంటే బ్లాక్‌బాక్సులు దొరకడమే కీలకమని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ప్రమాద కారణాలను అంచనా వేయలేమని పరిశోధకులు చెబుతున్నారు. విమానం ఎత్తు అకస్మాత్తుగా పడిపోతున్న సమయంలో పైలట్లతో సంప్రదించేందుకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ ఒకరు విఫలయత్నం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండో బ్లాక్‌బాక్సును కనుగొనేందుకు గాలింపు ప్రాంత పరిధిని విస్తరించినట్లు చెప్పాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని