Omicron XE: ఒమిక్రాన్‌లో కొత్త రకం.. అధిక సాంక్రమికశక్తితో ‘ఎక్స్‌ఈ’!

కొవిడ్‌-19 ఒమిక్రాన్‌ వేరియంట్‌లో కొత్త రకం.. తొలిసారి బ్రిటన్‌లో గుర్తించిన  దీనికి గతంలోని స్ట్రెయిన్‌ల కంటే ఎక్కువ సాంక్రమికశక్తితో ఉన్నట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఒమిక్రాన్‌ ఉపరకాలైన ‘బీఏ.1, బీఏ.2’ల

Published : 03 Apr 2022 07:51 IST

ఐరాస/జెనీవా: కొవిడ్‌-19 ఒమిక్రాన్‌ వేరియంట్‌లో కొత్త రకం.. తొలిసారి బ్రిటన్‌లో గుర్తించిన  దీనికి గతంలోని స్ట్రెయిన్‌ల కంటే ఎక్కువ సాంక్రమికశక్తితో ఉన్నట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఒమిక్రాన్‌ ఉపరకాలైన ‘బీఏ.1, బీఏ.2’ల మిశ్రమ ఉత్పరివర్తన రకమైన దీన్ని ‘ఎక్స్‌ఈ’గా పేర్కొంది. ఈ ఏడాది జనవరి 19న దీన్ని కనుగొన్నట్లు తెలిపింది. అప్పటినుంచి 600కు పైగా జన్యుక్రమాలు నమోదైనట్లు పేర్కొంది. దీనిపై మరింత సమగ్రంగా వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించింది. ఈమేరకు కొవిడ్‌ మహమ్మారి విషయంలో ఎలాంటి ఉదాసీనతకు చోటివ్వొద్దని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ‘ఎక్స్‌ఈ’కి సంబంధించి.. వ్యాధి లక్షణాలు, వ్యాప్తి తీరుతెన్నులు, తీవ్రత వంటివన్నీ తేలేంతవరకూ దీన్ని ఒమిక్రాన్‌కు సంబంధించినదిగానే పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి మిశ్రమ రకాలతో ప్రజారోగ్యానికి ముప్పు, సార్స్‌-కోవ్‌-2 వేరియంట్లు తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, మరిన్ని ఆధారాలు లభ్యం కాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. అనేక దేశాల్లో కొవిడ్‌ పరీక్షలు తగ్గించడం పట్ల ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.

బ్రిటన్‌లో 49 లక్షల మంది కొవిడ్‌ బాధితులు..

బ్రిటన్‌లో క్రియాశీలక కేసులు పెరుగుతున్నాయి. ఈమేరకు గత వారం (మార్చి 26 నాటికి ముగిసే) సరికి దాదాపు 49 లక్షల మంది కొవిడ్‌ బాధితులున్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయం పేర్కొంది. అంతకుముందు వారానికి ఈ సంఖ్య 43 లక్షలుగా ఉండేది. అధిక సాంక్రమికశక్తి ఉన్న ఒమిక్రాన్‌ ఉప రకమైన బీఏ.2 వ్యాప్తి కారణంగానే బ్రిటన్‌లో కేసులు పెరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని