Pakistan: పాక్‌ జాతీయ అసెంబ్లీ పునరుద్ధరణ!

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేస్తూ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరి తీసుకొన్న వివాదాస్పద నిర్ణయాన్ని పాక్‌ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఖాసిం నిర్ణయాన్ని కొట్టివేస్తూ

Updated : 08 Apr 2022 05:20 IST

 డిప్యూటీ స్పీకర్‌ నిర్ణయాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు

‘అవిశ్వాసం’పై రేపు ఓటింగు నిర్వహణకు ఆదేశం

ఇమ్రాన్‌ఖాన్‌కు అనూహ్యమైన ఎదురుదెబ్బ

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేస్తూ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరి తీసుకొన్న వివాదాస్పద నిర్ణయాన్ని పాక్‌ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఖాసిం నిర్ణయాన్ని కొట్టివేస్తూ జాతీయ అసెంబ్లీని పునరుద్ధరిస్తున్నట్లుగా గురువారం సాయంత్రం ప్రకటించింది. న్యాయస్థానం తీర్పు తర్వాత.. ఇక అవిశ్వాసాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడిన ప్రధాని ఇమ్రాన్‌కు ఇది అనూహ్యమైన ఎదురుదెబ్బే. అధికార పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌కు చెందిన డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరి ప్రతిపక్షాలు ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను ఏప్రిల్‌ 3న రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న ‘విదేశీ కుట్ర’కు అవిశ్వాస తీర్మానంతో సంబంధం ఉందంటూ ఖాసిం అప్పట్లో తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీని వెనువెంటనే ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ సూచన మేరకు పాక్‌ జాతీయ అసెంబ్లీని దేశాధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి రద్దు చేశారు. మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్‌ ఈ చర్యలతో కొంత ఉపశమనం పొందినా, నాలుగు రోజులు తిరక్కముందే న్యాయస్థానం దిమ్మ తిరిగేలా తీర్పు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. పార్లమెంటు రద్దు నిర్ణయం కూడా రాజ్యాంగ విరుద్ధమేనంటూ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. ఏప్రిల్‌ 9వ తేదీ ఉదయం 10.00 గంటలకు జాతీయ అసెంబ్లీని సమావేశపరచి, ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఓటింగు నిర్వహించాలంటూ స్పీకర్‌ను ఆదేశించింది. 

* సుప్రీంకోర్టులో గురువారం ఈ విచారణ జరుగుతున్న సమయంలో కోర్టు లోపల, వెలుపలా పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. ఇటు ప్రభుత్వం.. అటు ప్రతిపక్షాల తరఫున ప్రముఖ న్యాయవాదులు కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. కోర్టు సూచన మేరకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (నవాజ్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ తాజా ఎన్నికలపై తన అభిప్రాయాన్ని ధర్మాసనం ముందు వెల్లడించారు. ‘విదేశీ కుట్ర పేరుతో ప్రతిపక్ష నేతలపై ద్రోహులుగా ముద్ర వేస్తే మేము మా కుటుంబాల ముందుకే వెళ్లలేం. ఇక ప్రజల ముందుకు ఎలా వెళతాం?’ అని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.

నో కామెంట్‌: భారత్‌

పాక్‌ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు భారత ప్రభుత్వం తిరస్కరించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇస్లామాబాద్‌లో ఏం జరుగుతోందో ఓ కంట గమనిస్తున్నాం. అయినా ఇది వాళ్ల అంతర్గత వ్యవహారం’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని