Imran Khan: భారత్‌లా మనం ఎందుకు ఉండలేం? : ఇమ్రాన్‌

న్యాయస్థానం చేతుల్లో మళ్లీ ఊపిరి పోసుకున్న పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ శనివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. విదేశీకుట్ర పేరుతో చట్టసభ రద్దుకు సాహసించిన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భవితవ్యం మరికొద్ది గంటల్లో

Updated : 09 Apr 2022 09:54 IST

ఇస్లామాబాద్‌: జాతినుద్దేశించి శుక్రవారం రాత్రి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగించారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పుపై విచారం వ్యక్తం చేస్తున్నా. అయినా గౌరవిస్తా. తీర్పు చెప్పే ముందు విదేశాల బెదిరింపు లేఖ గురించి ఆలోచిస్తే బాగుండేది. విదేశీ ‘దిగుమతి’ సర్కారును ఆమోదించం. మన పొరుగున ఉన్న భారత్‌ సౌర్వభౌమ దేశం. ప్రపంచంలోని మరే శక్తీ ఆ దేశాన్ని శాసించలేదు. కేసుల నుంచి తప్పించుకునేందుకు మన ప్రతిపక్షాలు విదేశాలు చెప్పినట్టు ఆడుతున్నాయి. అమెరికా దౌత్యవేత్తలు మనవాళ్లను కలిశారు. ఆ తర్వాతే కథంతా నడిచింది. మన మీడియా కూడా వారితోనే చేతులు కలిపింది. దేశ భద్రత దృష్ట్యా అన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేను. రాజకీయవేత్తలు గొర్రెల్లా అమ్ముడుపోయారు. ఆదివారం  వీధుల్లోకి రండి. ఈ పరిణామాలపై శాంతియుతంగా నిరసన తెలియజేయండి’’ అంటూ ఇమ్రాన్‌ పాక్‌ ప్రజలను కోరారు.


ఇమ్రాన్‌ సర్కారుకు.. ఆఖరి బంతి

పాక్‌ పార్లమెంటులో ‘అవిశ్వాసం’పై నేడు ఓటింగు
కొత్త ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికకు రంగం సిద్ధం

ఇస్లామాబాద్‌: న్యాయస్థానం చేతుల్లో మళ్లీ ఊపిరి పోసుకున్న పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ శనివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. విదేశీకుట్ర పేరుతో చట్టసభ రద్దుకు సాహసించిన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. పాక్‌ జాతీయ అసెంబ్లీ శుక్రవారం విడుదల చేసిన ఆరు పాయింట్ల అజెండా మేరకు.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగును నాలుగో అంశంగా చేపడతారు. 342 స్థానాలున్న ఈ సభలో ప్రతిపక్షాల తీర్మానం నెగ్గాలంటే 172 ఓట్లు అవసరం. ఇంతకంటే ఎక్కువ బలమే తమకుందని ప్రతిపక్షాలు పరోక్షంగా రుజువు చేసుకొన్నందున ప్రధాని ఇమ్రాన్‌ పదవీచ్యుతుడు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే.. పాక్‌ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయిన తొలి ప్రధాని ఆయనే అవుతారు.  అటు ప్రతిపక్ష శిబిరంలో.. కొత్త సర్కారుకు ఏర్పాటుకు ప్రాథమిక చర్చలన్నీ పూర్తయ్యాయి. ఇమ్రాన్‌ దిగిపోగానే, జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీకి కూడా ఉద్వాసన పలకాలని భావిస్తున్నారు. కొత్త ప్రధానిగా ప్రతిపక్షాలు బలపరుస్తున్న పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (నవాజ్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌(70) ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని