Updated : 11 Apr 2022 06:33 IST

పాక్‌ కొత్త ప్రధాని షెహబాజ్‌!

 గెలుపు లాంఛనమే.. నేటి మధ్యాహ్నం ఎన్నిక

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ కొత్త ప్రధానిగా పీఎంఎల్‌(ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌(70) బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యతిరేక కూటమిలోని ప్రతిపక్షాలన్నీ షెహబాజ్‌ను కొత్త ప్రధానిగా ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం తెల్లవారుజామున వాయిదా పడిన పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ కొత్త ప్రధాని ఎన్నిక కోసం సోమవారం మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానమంత్రి పదవి కోల్పోయి ‘మాజీ’ అయ్యారు. పదవి నుంచి వైదొలిగాక ‘మరో స్వాతంత్య్ర పోరాటం మొదలైంది’ అంటూ ఆయన తొలి ట్వీట్‌ చేశారు. 342 మంది సభ్యులున్న సభలో ప్రతిపక్షాల తీర్మానానికి అనుకూలంగా 174 ఓట్లు వచ్చాయి. పాక్‌ చరిత్రలో గత ప్రధానులు బేనజీర్‌ భుట్టో (1989), షౌకత్‌ అజీజ్‌ (2006) అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొని విజయవంతంగా గట్టెక్కారు. ఈ రకంగా అవిశ్వాస తీర్మానం ద్వారా ఓడిన తొలి పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ చరిత్రకెక్కారు. 

షెహబాజ్‌ నామినేషన్‌.. 

ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఆదివారం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన షెహబాజ్‌ షరీఫ్‌ రాజ్యాంగానికి మద్దతుగా నిలిచినందుకు మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీకార రాజకీయాలు ఉండబోవని కూడా స్పష్టం చేశారు. గతంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ప్రధాని అభ్యర్థిత్వానికి షెహబాజ్‌ పేరును పాక్‌ మాజీ అధ్యక్షుడు, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ సహాధ్యక్షుడు అయిన ఆసిఫ్‌ అలి జర్దారీ ప్రతిపాదించారు. జర్దారీ కుమారుడైన బిలావల్‌ భుట్టో సంకీర్ణ సర్కారులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. మరోవైపు.. ఇమ్రాన్‌ సారథ్యంలోని ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’ పార్టీ సైతం ప్రధాని పదవికి తమ అభ్యర్థిగా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి పేరును ప్రకటించింది. దీంతో ఏకగ్రీవానికి అవకాశం లేకుండాపోయింది. ఆదివారం ఇమ్రాన్‌ఖాన్‌ నివాసంలో జరిగిన పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో మూకుమ్మడి రాజీనామాల ప్రతిపాదన కూడా వచ్చింది. పార్టీ నేతలందరూ ఇమ్రాన్‌కు సంఘీభావం తెలిపారు.

పాక్‌ వదిలి వెళ్లకుండా నిఘా

జాతీయ అసెంబ్లీ పరిణామాల నేపథ్యంలో పాక్‌ విమానాశ్రయాల్లో శనివారం రాత్రి నుంచే నిఘా పెంచారు. ప్రధాన దర్యాప్తు సంస్థ ‘ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ’ (ఎఫ్‌ఐఏ) ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది పలుచోట్ల మోహరించారు. ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులెవరూ ‘నిరభ్యంతర పత్రం’ (ఎన్వోసీ) లేకుండా దేశం విడిచిపోరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలు ఎవరు జారీ చేశారన్నది అధికారులు వెల్లడించలేదు. ఇమ్రాన్‌ఖాన్‌ మూడో భార్య బుష్రా బీబీ స్నేహితురాలైన ఫరాఖాన్‌ వారం రోజుల కిందటే దుబాయ్‌ వెళ్లిపోయారు. అధికారుల బదిలీల్లో ఈమె దాదాపు 32 మిలియన్‌ డాలర్లు (రూ.243 కోట్లు) వసూలు చేశారన్నది ప్రతిపక్షాల ఆరోపణ. కొత్త ప్రభుత్వం వస్తే అరెస్టు చేసే అవకాశం ఉన్నందున ఫరాఖాన్, ఆమె భర్త ముందే పాక్‌ వీడి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇమ్రాన్, ఆయన మంత్రివర్గంలోని సహచరులు దేశం విడిచిపోకుండా చూడాలని ఇస్లామబాద్‌ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. సోమవారం దీనిపై విచారణ జరగనుంది. 

‘కెప్టెన్‌’కు కర్తవ్యబోధ

రాజీనామాకు చివరిదాకా ససేమిరా అంటూ వచ్చిన ఇమ్రాన్‌ తన వ్యూహంలో ఆఖరి ప్రయత్నంగా ఆర్మీ చీఫ్‌ను మార్చేందుకు సైతం విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి ఇద్దరు ‘అనూహ్యమైన అతిథులు’ హెలికాప్టరులో ఇమ్రాన్‌ నివాసానికి వచ్చి 45 నిమిషాలసేపు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశం వాడీవేడిగా జరిగినట్లు సమాచారం. ఆ తర్వాతే జాతీయ అసెంబ్లీలో అవిశ్వాసంపై ఓటింగుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ‘బీబీసీ - ఉర్దూ’ కథనం ప్రకారం ఆ అతిథులు ఇద్దరూ.. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా, ఐఎస్‌ఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీం అహ్మద్‌ అంజుం. కాగా, ఆర్మీ మీడియా అధికారులు ఈ కథనాన్ని ఖండించారు. 

1,332 రోజుల ఇమ్రాన్‌ పాలన

‘నయా (కొత్త) పాకిస్థాన్‌’ నినాదంతో దేశ 22వ ప్రధానమంత్రిగా 2018 ఆగస్టు 18న ప్రమాణస్వీకారం చేసిన ఇమ్రాన్‌ఖాన్‌ (69) మొత్తం 1,332 రోజులు ఆ బాధ్యతలు నిర్వహించారు. వచ్చే ఏడాది ఆగస్టులో మళ్లీ సాధారణ ఎన్నికలు జరగనుండగా..  దాదాపు 16 నెలల పదవీకాలం ఉండగానే ఇమ్రాన్‌ వైదొలగాల్సి వచ్చింది. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో ఈ పరిణామంపై స్పందిస్తూ ‘వెల్‌కం టు పురానా (పాత) పాకిస్థాన్‌’ అని వ్యాఖ్యానించారు.

భారత్‌ - పాక్‌ సంబంధాల మెరుగుదలకు అవకాశం

దూకుడుగా వ్యవహరించే ఇమ్రాన్‌ కంటే.. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించే అనుభవజ్ఞుడైన షెహబాజ్‌ షరీఫ్‌ హయాంలో భారత్‌ - పాక్‌ సంబంధాలు ఎంతోకొంత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. షెహబాజ్‌కు సన్నిహితుడైన పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-ఎన్‌ నేత సమీవుల్లాఖాన్‌ పీటీఐతో మాట్లాడుతూ.. భారత్‌ విషయంలో తమ నేత బలమైన, ఆచరణాత్మకమైన ఓ కొత్త విధానాన్ని రూపొందిస్తారని తెలిపారు. షెహబాజ్‌ సోదరుడైన నవాజ్‌ షరీఫ్‌ పాక్‌ ప్రధాని హోదాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో స్నేహపూర్వకంగానే వ్యవహరించేవారు.   

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని