Shehbaz Sharif: కశ్మీర్‌ నెత్తురోడుతోంది

పాకిస్థాన్‌ ప్రధాని పీఠమెక్కిన తొలిరోజే షెహబాజ్‌ షరీఫ్‌ తన నైజం బయటపెట్టుకున్నారు. భారత్‌పై విషం చిమ్ముతూ మాట్లాడారు. కశ్మీర్‌ లోయ నెత్తురోడుతోందని పేర్కొన్నారు. అక్కడి ప్రజలకు దౌత్యపరమైన, నైతిక మద్దతు అందిస్తామని ఉద్ఘాటించారు.

Updated : 12 Apr 2022 06:06 IST

అక్కడి ప్రజలకి దౌత్యపరమైన, నైతిక మద్దతు అందిస్తాం
వివాద పరిష్కారానికి మోదీ ముందుకు రావాలి
పాక్‌ కొత్త ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని పీఠమెక్కిన తొలిరోజే షెహబాజ్‌ షరీఫ్‌ తన నైజం బయటపెట్టుకున్నారు. భారత్‌పై విషం చిమ్ముతూ మాట్లాడారు. కశ్మీర్‌ లోయ నెత్తురోడుతోందని పేర్కొన్నారు. అక్కడి ప్రజలకు దౌత్యపరమైన, నైతిక మద్దతు అందిస్తామని ఉద్ఘాటించారు. కశ్మీర్‌ వివాదం పరిష్కారమైతే తప్ప భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవని వ్యాఖ్యానించారు. అదే సమయంలో- చైనాతో తమ బంధం ఏ పరిస్థితుల్లోనూ చెక్కుచెదరబోదని స్పష్టం చేశారు. ప్రధానిగా ఎన్నికైన అనంతరం షెహబాజ్‌ జాతీయ అసెంబ్లీలో ఈ మేరకు తొలి ప్రసంగం చేశారు. జమ్మూ-కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి ఉద్దేశించిన ఆర్టికల్‌-370 రద్దు సహా పలు అంశాలను ప్రస్తావించారు. ఆది నుంచీ భారత్‌-పాక్‌ మధ్య సత్సంబంధాలు లేవని పేర్కొన్నారు.

2019 ఆగస్టులో భారత్‌ ఆర్టికల్‌-370ని రద్దు చేసినప్పుడు పాక్‌ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ దౌత్యపరంగా తగిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని షెహబాజ్‌ విమర్శించారు. ‘‘ఆర్టికల్‌-370ని ఉపసంహరించుకున్నప్పుడు ఇమ్రాన్‌ ఏం చేశారు? కశ్మీర్‌ రోడ్లపై కశ్మీరీల నెత్తురు వరదలా పారుతోంది. వారి రక్తంతో లోయ ఎరుపు రంగు పులుముకుంది. భారత్‌తో సత్సంబంధాలనే పాక్‌ కోరుకుంటోంది. కానీ కశ్మీర్‌ వివాదం పరిష్కారమయ్యేంతవరకు ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనవు. కశ్మీరీలకు రాజకీయపరంగా, దౌత్యమార్గాల్లో, నైతికంగా మేం మద్దతు కొనసాగిస్తాం. అక్కడి సోదర సోదరీమణుల వాణిని ప్రతి అంతర్జాతీయ వేదికపై వినిపిస్తాం’’ అని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, కశ్మీరీల అంచనాలకు అనుగుణంగా కశ్మీర్‌ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత ప్రధాని మోదీ ముందుకురావాలని షెహబాజ్‌ పిలుపునిచ్చారు.

ప్రధానిగా ఏకగ్రీవ ఎన్నిక

అంతకుముందు, పాక్‌ 23వ ప్రధానమంత్రిగా షెహబాజ్‌ షరీఫ్‌ (70) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో- దేశంలో కొన్నాళ్లుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది. వాస్తవానికి ప్రధాని పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ తరఫున విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమూద్‌ ఖురేషి తొలుత బరిలో నిలిచారు. అయితే- సోమవారం జాతీయ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే.. ప్రధాని ఎన్నిక ప్రక్రియను తాను, తమ పార్టీ చట్టసభ్యులు బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ఖురేషి ప్రకటించారు. తామంతా సామూహికంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపి, సభను వీడారు. దీంతో ప్రధానిగా షెహబాజ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. జాతీయ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 342. ప్రధాని పీఠమెక్కాలంటే కనీసం 172 మంది మద్దతు అవసరం. షెహబాజ్‌కు 174 ఓట్లు వచ్చినట్లు స్పీకర్‌ అయాజ్‌ సాదిక్‌ ప్రకటించారు. అంతకుముందు, అంతరాత్మ తనను అనుమతించడం లేదంటూ సభ నిర్వహణకు డిప్యూటీ స్పీకర్‌ ఖాసిమ్‌ సూరి నిరాకరించారు.

అలాగైతే రాజీనామా చేస్తా

ప్రధానిగా తన ఎన్నిక గురించి షెహబాజ్‌ మాట్లాడుతూ.. చెడుపై మంచి విజయం సాధించిందని పేర్కొన్నారు. విదేశాల నుంచి గత నెల 7న బెదిరింపు లేఖ వచ్చిందని ఇమ్రాన్‌ చెబుతున్నారని గుర్తుచేశారు. కానీ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని అంతకంటే ముందే తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. తమకు విదేశీ కుట్రదారుల నుంచి మద్దతు లభించినట్లు ఏ చిన్న సాక్ష్యాధారం దొరికినా.. తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.

ప్రమాణస్వీకారం ముందు ఉత్కంఠ

ప్రధానిగా షెహబాజ్‌ ప్రమాణస్వీకారానికి ముందు సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ఆయనతో దేశాధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ప్రమాణం చేయించాలి. అయితే ఆ కార్యక్రమానికి కొన్ని గంటల ముందు అల్వీ తనకు కాస్త నలతగా ఉన్నట్లు చెప్పారు. పరిశీలించిన వైద్యుడు.. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రధానిగా షెహబాజ్‌తో సెనేట్‌ ఛైర్మన్‌ సాదిక్‌ సంజ్రానీ ప్రమాణం చేయించారు. అల్వీ గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీలో సభ్యుడు. 2018 సెప్టెంబరులో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

ఎన్నాళ్లు కొనసాగేనో..

షెహబాజ్‌ ఎన్నికతో పాక్‌లో రాజకీయ సంక్షోభం ప్రస్తుతానికి ముగిసినట్టు కనిపిస్తున్నప్పటికీ.. పీఎంఎల్‌-ఎన్‌తో మిత్రపక్షాలు ఎన్నాళ్లు కలిసి ఉంటాయన్నది ప్రశ్నార్థకమే. జాతీయ అసెంబ్లీలో ఆ పార్టీకి కేవలం 86 సీట్లు ఉన్నాయి. ఇమ్రాన్‌ను గద్దె దింపడమే ఏకైక లక్ష్యంగా ప్రస్తుతం విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ముందుముందు వాటి మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు పుష్కలమని విశ్లేషకులు చెబుతున్నారు.

చౌకీదార్‌ చోర్‌ హై అంటూ నినాదాలు

ప్రధాని పదవిని కోల్పోయిన ఇమ్రాన్‌ ఖాన్‌కు మద్దతుగా పీటీఐ కార్యకర్తలు ఇస్లామాబాద్‌, కరాచీ, పెషావర్‌, క్వెట్టా సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఇమ్రాన్‌ కేబినెట్‌లో ఇన్నాళ్లూ మంత్రిగా పనిచేసిన షేక్‌ రషీద్‌ పంజాబ్‌లో నిర్వహించిన భారీ నిరసన సభకు వేలమంది తరలివచ్చారు. అక్కడ గుమిగూడినవారిలో పలువురు ‘చౌకీదార్‌ చోర్‌ హై (కాపలాదారుడే దొంగ)’ అంటూ నినాదాలు చేశారు. సైన్యాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. భారత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ నినాదాన్ని ఎక్కువగా ఉపయోగించిన సంగతి గమనార్హం.


దొంగలతో కలిసి కూర్చోలేను: ఇమ్రాన్‌

జాతీయ అసెంబ్లీలో సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా ప్రకటించారు. చట్టసభ సమావేశాల్లో దొంగలతో కలిసి తాను కూర్చోలేనని పేర్కొన్నారు. షెహబాజ్‌ షరీఫ్‌పై భారీ ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులున్న సంగతిని ట్విటర్‌ వేదికగా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన గుర్తుచేశారు. మరోవైపు- ఇమ్రాన్‌కు ఇన్నాళ్లూ సన్నిహితంగా ఉన్న మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆజం ఖాన్‌ సహా ఆరుగురు కీలక వ్యక్తులు దేశం విడిచి వెళ్లకుండా ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) ఆదివారం ఆంక్షలు విధించింది.


షెహబాజ్‌కు మోదీ శుభాకాంక్షలు

పాక్‌ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్‌ షరీఫ్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భారత్‌ శాంతి, స్థిరత్వాలను కోరుకుంటోంది. ప్రాంతీయంగా ఉగ్రవాదానికి తావుండకూడదు. అప్పుడే అభివృద్ధి సంబంధిత సవాళ్లపై మనం దృష్టిసారించగలం. మన ప్రజలు క్షేమంగా ఉండేలా చూడగలం’’ అని షెహబాజ్‌ను ఉద్దేశించి ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని