Ukraine Crisis: అది సామూహిక హత్యాకాండే

ఉక్రెయిన్‌ జాతి విధ్వంసానికే రష్యా యత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోపించారు. అక్కడ జరుగుతున్నది సామూహిక హత్యాకాండేనని తాను అంటానని, ఉక్రెయిన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేయాలనేదే

Updated : 14 Apr 2022 05:33 IST

ఉక్రెయిన్‌ జాతి విధ్వంసానికే రష్యా యత్నం 

ఆ దేశాన్నే తుడిచిపెట్టేయాలని అనుకుంటోంది: బైడెన్‌ ధ్వజం

డెమొయిన్స్‌(అమెరికా): ఉక్రెయిన్‌ జాతి విధ్వంసానికే రష్యా యత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోపించారు. అక్కడ జరుగుతున్నది సామూహిక హత్యాకాండేనని తాను అంటానని, ఉక్రెయిన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేయాలనేదే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంకల్పమని చెప్పారు. వాషింగ్టన్‌ నుంచి లోవా వచ్చిన ఆయన.. తిరుగు ప్రయాణానికి ముందు విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు వేరే కార్యక్రమంలోనూ ప్రసంగించారు. ‘ఉక్రెయిన్‌ అస్తిత్వమే లేకుండా చేయాలని పుతిన్‌ ప్రయత్నిస్తున్నారు. అది రోజురోజుకీ తేటతెల్లమవుతోంది. రష్యా ప్రవర్తన.. అంతర్జాతీయ స్థాయి సామూహిక హత్యాకాండ ప్రమాణాల కిందికి వస్తుందా లేదా అనేది న్యాయనిపుణులు నిర్ణయించాలి. నాకు మాత్రం అది అలాగే అనిపిస్తోంది. ఉక్రెయిన్‌లో రష్యా ఏమేం ఘోరాలు చేసిందనే దానిపై మరిన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి. అక్కడ జరిగిన విధ్వంసంపై మరింత సమగ్రంగా తెలుసుకుంటున్నాం’ అని బైడెన్‌ చెప్పారు.  ఉక్రెయిన్‌కు 80 కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని అందించడానికి ఆయన ఆమోదించారు.

స్వాగతించిన జెలెన్‌స్కీ 

బైడెన్‌ వ్యాఖ్యల్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వాగతించారు. ‘నిజమైన నేత నుంచి నిఖార్సైన మాటలు వచ్చాయి. శత్రువును ఎదుర్కోవాలంటే వారి చర్యలను నేరుగా పేరుపెట్టి ప్రస్తావించడం అవసరం. ఇప్పటికే అమెరికా మాకు చాలా సాయం చేసింది. మరింత భారీ ఆయుధాలు మాకు అత్యవసరంగా కావాలి’ అని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని