Ukraine Crisis: కళ్లన్నీ మేరియుపొల్‌ పైనే..

కీలకమైన మేరియుపొల్‌ నగరాన్ని గుప్పిట పట్టేందుకు రష్యా ఒకపక్క గట్టి పట్టు బిగిస్తే.. మరోపక్క అక్కడి నుంచి పెద్దఎత్తున ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ఉక్రెయిన్‌ దృష్టి సారించింది. వృద్ధులు, మహిళలు, పిల్లల తరలింపునకు ప్రాథమికంగా అవగాహన కుదరడంతో

Updated : 22 Apr 2022 02:26 IST

కొనసాగిన రష్యా దాడులు  
వెయ్యికిపైగా లక్ష్యాలపై గురి  
చర్చల బంతి ఉక్రెయిన్‌ కోర్టులో ఉంది: క్రెమ్లిన్‌ 

కీవ్‌: కీలకమైన మేరియుపొల్‌ నగరాన్ని గుప్పిట పట్టేందుకు రష్యా ఒకపక్క గట్టి పట్టు బిగిస్తే.. మరోపక్క అక్కడి నుంచి పెద్దఎత్తున ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ఉక్రెయిన్‌ దృష్టి సారించింది. వృద్ధులు, మహిళలు, పిల్లల తరలింపునకు ప్రాథమికంగా అవగాహన కుదరడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వారిని జపోరిజిజియాకు పంపించనున్నారు. ఆ ప్రాంతం సురక్షితంగా ఉండడంతో పాటు అక్కడ ఆహారం, మందులు, తాగునీరు లభిస్తుందని మేరియుపొల్‌ మేయర్‌ తెలిపారు. ఇంకోవైపు రష్యా సైనిక బలగాలు డాన్‌బాస్‌ ప్రాంతం వెంబడి వందల కిలోమీటర్ల కొద్దీ బాంబుల మోత కొనసాగించాయి. అక్కడ ఉన్న బొగ్గు గనులు, లోహ పరిశ్రమలు, ఇతర కర్మాగారాలు ఉక్రెయిన్‌ ఆదాయానికి ప్రధాన వనరులు. ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలంటే వీటన్నింటినీ స్తంభింపజేయాలని రష్యా భావిస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న 1,053 లక్ష్యాలపై పదాతిదళాలతో, 73 లక్ష్యాలపై వైమానిక దళంతో దాడులు నిర్వహించినట్లు ఆ దేశ సైనిక వర్గాలు ప్రకటించాయి. ఖేర్సన్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ దళాలపై, వాటి వాహనాలపై క్షిపణులు కురిపించినట్లు తెలిపాయి. 

రష్యాది అనాగరిక సైన్యం: జెలెన్‌స్కీ 

అజోవ్‌స్తల్‌ ఉక్కు పరిశ్రమను, తద్వారా మేరియుపొల్‌ నగరం మొత్తాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవడం రష్యా లక్ష్యంగా కనిపిస్తోందని ఉక్రెయిన్‌ సైనిక ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారంపైనా, దాదాపు 300 మంది చికిత్స పొందుతున్న ఒక ఆసుపత్రిపైనా రష్యా దాడులు చేసిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత అమానవీయ, అనాగరిక సైన్యంగా రష్యా తన పేరును చరిత్రలో లిఖించుకుంటోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విమర్శించారు. ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ దళాలను చుట్టుముట్టే ఉద్దేశంతోనే ఇటీవలి కాలంలో మరికొన్ని వేలమందిని రణక్షేత్రంలోకి రష్యా దించిందని సైనిక నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని మరింతగా పెంచడంపై పాశ్చాత్య దేశాలు దృష్టి సారించాయి. అమెరికా తరఫున మరోసారి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేయనున్న విషయాన్ని ఆ దేశాధ్యక్షుడు బైడెన్‌ త్వరలో ప్రకటించనున్నారు. కెనడా, నెదర్లాండ్స్‌ కూడా భారీ ఆయుధాలను పంపించనున్నాయి. 

ఇవే చిట్టచివరి రోజులేమో!

మేరియుపొల్‌లో రోజుల తరబడి పోరాడుతున్న ఉక్రెయిన్‌ దళాలు విసుగెత్తిపోతున్నాయి. తమకు ఇవే చిట్టచివరి రోజులయ్యేలా ఉన్నాయనీ, కొన్ని గంటలు, మహా అయితే కొన్ని రోజులకు మించి పోరాడలేమని ఉక్రెయిన్‌ కమాండర్‌ మేజర్‌ వొలీనా చెప్పడం దీనికి నిదర్శనం. ఉక్రెయిన్‌ సైనికులు ఆయుధాలు వదిలిపెట్టి, స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా లొంగిపోవాలని రష్యా మరోసారి అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారంలో ఉన్న కమాండర్‌ ఇలాంటి సందేశాన్ని పంపించారు. తమకంటే రష్యా సైనికులు పదింతలు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. తమను తృతీయపక్ష దేశానికి తీసుకుపోవాలని కోరారు. ఆహారం, మందుల కొరత పరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని వివరించారు.  

డిమాండ్ల ముసాయిదా ఇచ్చిన రష్యా 

మాస్కో: యుద్ధాన్ని విరమించాలంటే తమ డిమాండ్లేమిటో చెబుతూ రష్యా ఒక ముసాయిదాను ఉక్రెయిన్‌కు పంపింది. చర్చల్లో భాగంగా దీనిని ప్రతిపాదించింది. ఇప్పుడు బంతి ఉక్రెయిన్‌ కోర్టులో ఉందని క్రెమ్లిన్‌ వ్యాఖ్యానించింది. ఆ దేశ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. వీటిని తాము సమీక్షిస్తున్నట్లు ఉక్రెయిన్‌ ప్రతినిధి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని