Ukraine Crisis: మేరియుపొల్‌లో శవాల గుట్టలు

ఉక్రెయిన్‌లోని అమాయక పౌరులపై పుతిన్‌ సేనలు సాగిస్తున్న హింసాకాండ మరోసారి వెలుగుచూసింది. మ్యాక్సర్‌ టెక్నాలజీస్‌ తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు నివ్వెరపరుస్తున్నాయి. మేరియుపొల్‌కు సమీపంలో 200కు

Updated : 23 Apr 2022 05:22 IST

ఉపగ్రహ చిత్రాలతో సామూహిక  సమాధులు వెలుగులోకి..

కీవ్‌: ఉక్రెయిన్‌లోని అమాయక పౌరులపై పుతిన్‌ సేనలు సాగిస్తున్న హింసాకాండ మరోసారి వెలుగుచూసింది. మ్యాక్సర్‌ టెక్నాలజీస్‌ తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు నివ్వెరపరుస్తున్నాయి. మేరియుపొల్‌కు సమీపంలో 200కు పైగా భారీ సామూహిక సమాధుల గుట్టలు ఉన్నట్టు వాటిలో వెల్లడైంది! సుమారు తొమ్మిది వేల మంది ఉక్రెయిన్‌ పౌరులను రష్యా సైనికులు హతమార్చారని, మృతదేహాలను ట్రక్కుల్లో తీసుకొచ్చి మేరియుపొల్‌ సమీపంలో ఖననం చేశారని స్థానిక మేయర్‌ సహాయకుడు ఆండ్రియుష్‌చెంకో చెప్పారు. బుచాలో మాదిరే ఇక్కడా పుతిన్‌ సేనలు అమానవీయ ఘటనలకు పాల్పడ్డాయన్నారు. ఈ ఉపగ్రహ చిత్రాలపై క్రెమ్లిన్‌ నుంచి ఇంకా ఎలాంటి స్పందనా లేదు! ‘‘మేరియుపొల్‌ తన ప్రాభవం కోల్పోయింది. ఇప్పుడు అక్కడ సమాధులే కనిపిస్తున్నాయి. రష్యా సైనికులు అకారణంగా ప్రజలను కాల్చి చంపేస్తున్నారు. నగరంలో చిక్కుకుపోయిన చాలామంది రెండు నెలలుగా బేస్‌మెంట్లలోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు’’ అని అక్కడి నుంచి బయటపడిన యురియ్, పొనీలా లులాక్‌లు చెప్పారు. సైనిక చర్య ఆరంభం నుంచి మేరియుపొల్‌పై విరుచుకుపడుతున్న రష్యా... ఆ నగరంపై పట్టు సాధించినట్టు ఓ అధికారి చెప్పారు.  

రాత్రివేళ బాంబుల మోత..

ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పుతిన్‌ సేనలు దాడులు చేస్తున్నాయి. బొగ్గు గనులు, ఖనిజ ఆధార పరిశ్రమలు, భారీ పరికరాల కర్మాగారాలు ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతంలోని పట్టణాలే లక్ష్యంగా రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. స్లొవ్యాన్స్క్‌ నగరంపై పుతిన్‌ సేనలు రాత్రివేళ బాంబులు కురిపించినట్టు స్థానిక మేయర్‌ పేర్కొన్నారు.ఖర్కివ్‌ నగరంపైనా రష్యా  దాడులు కొనసాగిస్తోంది.

డాన్‌బాస్‌పై ఆధిపత్యం కోసమే..

కీవ్‌ నుంచి రష్యా తన సేనలను ఉపసంహరించుకున్న తర్వాత.. డాన్‌బాస్‌ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ‘‘డాన్‌బాస్‌పై ఆధిపత్యం చాటుకోవడం ద్వారా తమ ప్రజలను సంతృప్తి పరిచేందుకు రష్యా ప్రయత్నించవచ్చు. కానీ, పుతిన్‌ సేనలను ఉక్రెయిన్‌ దళాలు దీటుగానే అడ్డుకుంటున్నాయి. డాన్‌బాస్‌పై ఆధిపత్యం సాధించడం మాస్కోకు మరీ అంత సులభమేమీ కాదు’’ అని అమెరికా రక్షణశాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు విశ్లేషించారు.  

26న రష్యాకు గుటెరస్‌

ఐరాస: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆరంభించి రెండు నెలలు కావస్తున్న తరుణంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ మాస్కో వెళ్తున్నారు! ఈ నెల 26న పర్యటన ఉండనుంది. ఆ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో గుటెరస్‌ భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై చర్చించాల్సి ఉందనీ... మాస్కో, కీవ్‌లకు వచ్చి మాట్లాడతానంటూ ఆయన పుతిన్, జెలన్‌స్కీలకు వేర్వేరుగా లేఖలు రాశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని