8 దాడుల్ని తిప్పికొట్టిన ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాలపై పట్టు సాధించాలన్న రష్యా ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. అందుకే అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లలేకపోతున్నాయి. డాన్‌బాస్‌పై పూర్తి ఆధిపత్యం తెచ్చుకోవడం ద్వారా ఒక మెట్టు పైకెక్కాలని

Published : 24 Apr 2022 05:19 IST

ఆయుధ గిడ్డంగుల్ని ధ్వంసం చేశామన్న రష్యా

కీవ్‌: ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాలపై పట్టు సాధించాలన్న రష్యా ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. అందుకే అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లలేకపోతున్నాయి. డాన్‌బాస్‌పై పూర్తి ఆధిపత్యం తెచ్చుకోవడం ద్వారా ఒక మెట్టు పైకెక్కాలని పుతిన్‌ సేనలు విఫలయత్నం చేశాయి. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టేలా 24 గంటల వ్యవధిలో ఎనిమిది దాడుల్ని ఉక్రెయిన్‌ తిప్పికొట్టింది. రష్యాకు చెందిన 9 యుద్ధ ట్యాంకుల్ని, 18 సాయుధ శకటాల్ని, 13 వాహనాల్ని, ఒక ట్యాంకర్‌ను, మూడు శతఘ్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసింది. 24 గంటల వ్యవధిలో చెప్పుకోదగ్గ పురోగతిని రష్యా సాధించలేకపోయిందని బ్రిటన్‌ రక్షణశాఖ తెలిపింది. మేరియుపొల్‌పై పైచేయి సాధించినట్లు ప్రకటించినా ఉక్రెయిన్‌ గగనతలాన్ని, సముద్ర మార్గాన్ని నియంత్రించేటంత స్థాయిని రష్యా ఇంకా సాధించలేకపోయింది.
 అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారం ఆవరణలోని సొరంగాల్లో ఉన్న ఉక్రెయిన్‌ సైనికుల్ని బయటకు రప్పించే ప్రయత్నాలు ఇంకా సఫలం కాలేదు. ఆ ఆవరణను చుట్టుముట్టేందుకు రష్యా సైనికులు ప్రయత్నాలు కొనసాగించారు. ప్రతిరోజూ అక్కడ బాంబులు పడుతూనే ఉన్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. తూర్పు ప్రాంతాలపై రష్యా దృష్టి సారించడంతో అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార భూగర్భంలో ఆశ్రయం పొందుతున్నవారిలో పాతికమంది రెండు నెలల తర్వాత కాసేపు బయటకు వచ్చి సూర్యకాంతిని ఆస్వాదించగలిగారు.

తరలింపులకు మరో యత్నం
ఒడెసా నగరంపై ఆరు క్రూయిజ్‌ క్షిపణుల్ని రష్యా ప్రయోగించింది. ఈ దాడుల్లో మూడు నెలల పసికందు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తదితర దేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందిన ఆయుధాలను దాచిపెట్టిన ప్రదేశాన్ని ధ్వంసంచేసినట్లు రష్యా ప్రకటించింది. తూర్పు డాన్‌బాస్‌ ప్రాంతంలో అనేక గ్రామాలు తమ నియంత్రణలోకి వచ్చాయనీ, ఉక్రెయిన్‌ సైన్యానికి చెందిన మూడు ఆయుధ గిడ్డంగులు సహా 11 లక్ష్యాలను నాశనం చేశామనీ తెలిపింది. ఆదివారం ఈస్టర్‌ సందర్భంగా శనివారం దేశమంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్‌, విదేశాంగ మంత్రి బ్లింకెన్‌లతో ఆదివారం తాను కీవ్‌లో భేటీ కానున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

మరిన్ని ఆంక్షలపై యోచన
రష్యాపై ఇప్పటికే విధించిన ఆంక్షలకు అదనంగా చమురు, గ్యాస్‌ పరంగా మరిన్ని ఆంక్షలు విధించడానికి పాశ్చాత్య దేశాలు యోచిస్తున్నాయి. అమెరికా ఇంకాస్త కఠినంగా వ్యవహరించాల్సి ఉందని అక్కడి ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో ఈ దిశగా బైడెన్‌ సర్కారు ప్రతిపాదిస్తోంది.

26న పుతిన్‌తో, 28న జెలెన్‌స్కీతో గుటెరస్‌ భేటీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీతో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ భేటీ తేదీలు ఖరారయ్యాయి. 26న ఆయన మాస్కో వెళ్లనున్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌తో విందులో పాల్గొననున్నారు. అనంతరం పుతిన్‌ను కలవనున్నారు. రష్యా పర్యటన అనంతరం గుటెరస్‌ ఉక్రెయిన్‌కు వెళ్తారు. ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతో సమావేశమవుతారు. 28న జెలెన్‌స్కీతో భేటీ అవుతారని ఐరాస ప్రతినిధి తెలిపారు

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts