16 ఏళ్ల లోపు పిల్లల్లో అంతుచిక్కని కాలేయ వ్యాధి

అమెరికాతో పాటు పలు ఐరోపా దేశాల్లో పిల్లలకు అంతుచిక్కని కాలేయ వ్యాధి సోకుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ వ్యాధితో ఓ చిన్నారి కూడా మృతి చెందినట్లు వెల్లడించింది.

Published : 25 Apr 2022 05:39 IST

12 దేశాల్లో 169 కేసులు

ఒక చిన్నారి మృతి: డబ్ల్యూహెచ్‌వో

బెర్లిన్‌: అమెరికాతో పాటు పలు ఐరోపా దేశాల్లో పిల్లలకు అంతుచిక్కని కాలేయ వ్యాధి సోకుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ వ్యాధితో ఓ చిన్నారి కూడా మృతి చెందినట్లు వెల్లడించింది. 12 దేశాల్లో ఇంతవరకు ఇలాంటి 169 కేసులు బయటపడినట్లు పేర్కొంది. ప్రధానంగా బ్రిటన్‌లో ఎక్కువ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీన్ని ‘అంతుచిక్కని మూలాలతో వచ్చే అతి తీవ్ర హెపటైటిస్‌’గా పేర్కొంది. వ్యాధి బారిన పడినవారంతా ఒక నెల నుంచి 16 ఏళ్ల వయసువారేనని తెలిపింది. వీరిలో 17 మందికి కాలేయ మార్పిడి అవసరమైనట్లు పేర్కొంది. అయితే ఈ వ్యాధితో ఏ దేశంలో మరణం సంభవించిందీ డబ్ల్యూహెచ్‌వో వెల్లడించలేదు. 74 కేసుల్లో అడినోవైరస్‌ను గుర్తించగా.. మరో 20 మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బ్రిటన్‌లో తొలిసారి ఇలాంటి కేసులు నమోదు కాగా.. అక్కడ 114 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. ‘‘హెపటైటిస్‌ కేసులు పెరుగుతున్నాయా? లేదా సాధారణంగానే ఈ స్థాయిలో కేసులున్నప్పటికీ వాటిపట్ల అవగాహన పెరగడం వల్ల ఇప్పుడే వీటిని గుర్తిస్తున్నారా? అన్నది తెలియరాకుండా ఉంది’’ అని డబ్ల్యూహెచ్‌వో ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణంగా జలుబుకు కారణమయ్యే వైరస్‌తో ఈ కేసులకు సంబంధం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘అడినోవైరస్‌ కూడా ఈ వ్యాధికి కారణం కావచ్చన్న అంచనాలున్నాయి. వ్యాధి కారకాలను కనుగొనేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి’’ అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. పిల్లల్లో హెపటైటిస్‌ కేసులను గుర్తించే చర్యలను ఆయా దేశాలు ముమ్మరం చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని