Updated : 26 Apr 2022 04:55 IST

Ukraine Crisis: ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అండ

జెలెన్‌స్కీతో అమెరికా మంత్రుల రహస్య భేటీ

కావాల్సిన సాయమంతా అందజేతకు భరోసా

కీవ్‌పై కొనసాగిన రష్యా దాడులు

ఐదు రైల్వే జంక్షన్ల విధ్వంసం

నేడు జర్మనీలో నాటో సమావేశం

పోలండ్‌-ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపం నుంచి: సైనిక బలగాల పరంగా ఉక్రెయిన్‌కు కావాల్సిన పూర్తి మద్దతును అందిస్తామని అమెరికా గట్టి భరోసా ఇచ్చింది. ఆ దేశం తరఫున రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. పోలండ్‌-ఉక్రెయిన్‌ సరిహద్దులో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీతో ఆదివారం రాత్రి వారు మూడు గంటలపాటు రహస్యంగా భేటీ అయ్యారు. రెండు నెలల క్రితం యుద్ధం మొదలయ్యాక అమెరికా నుంచి ఈ స్థాయి నేతలు ఉక్రెయిన్‌కు రావడం ఇదే ప్రథమం. వారి భేటీ నిర్దిష్టంగా ఎక్కడ జరిగింది అనే దానితో పాటు ఈ పర్యటన ముగిసేవరకు ఏ వివరాలనూ వెల్లడించకుండా విలేకరులపైనా ఆంక్షలు విధించారు. రష్యాను తిప్పికొట్టి, తమ దేశానికి విజయం సాధించి పెట్టడమే తన లక్ష్యమని జెలెన్‌స్కీ చెప్పారు. మంత్రులతో భేటీ ప్రోత్సాహకరంగా, ప్రభావవంతంగా ముగిసిందన్నారు. తమ సైన్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించామని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యక్తిగతంగా అందిస్తున్న సాయం ఎనలేనిదని చెప్పారు.

మరింత సాయం.. విజయం ఖాయం: ఆస్టిన్‌

‘గెలుపు సాధించాలని జెలెన్‌స్కీ తపిస్తున్నారు. దీనికి మా వంతు చేయూత అందించాలని మేం అనుకుంటున్నాం. మరిన్ని యుద్ధ ట్యాంకులు, ఇతర పేలుడు పదార్థాలను ఆయన అడుగుతున్నారు. తగిన పరికరాలు, అండదండలు ఉంటే ఉక్రెయిన్‌ గెలవగలదు. ఆ పూర్తి నమ్మకం మాకు ఉంది. ఆ దిశగా కావాల్సిందంతా మేం చేస్తాం’ అని ఆస్టిన్‌ పోలండ్‌లో విలేకరులకు చెప్పారు. పోరు తీరు మారినా సార్వభౌమత్వ పరిరక్షణలో ఉక్రెయిన్‌ విజయం సాధించడం మాత్రం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశారు. మరెక్కడా ఇలాంటి దురాక్రమణలకు పాల్పడకుండా రష్యాను బలహీనపరచాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. విదేశీ సైన్యానికి ఆర్థిక సాయం కింద అమెరికా మరో 30 కోట్ల డాలర్లు నగదు రూపేణా ఇస్తుందని తెలిపారు. సాయంపై నేరుగా మాట్లాడే ఉద్దేశంతోనే ఉక్రెయిన్‌కు వచ్చామని బ్లింకెన్‌ చెప్పారు. రష్యాపై ఒత్తిడి పెంచడంలో 30 దేశాలతో కలిసి తాము చేస్తున్న ప్రయత్నాలు నిజమైన ఫలితాలను రాబడుతున్నాయన్నారు. ‘ఉక్రెయిన్‌ మొత్తాన్ని కబళించి, స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని హరించాలనుకున్న రష్యా ఓడిపోతోంది. ఉక్రెయిన్‌ విజయం సాధిస్తోంది’ అని చెప్పారు. అమెరికా నుంచి ఈ భరోసా లభించిన నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఆ దేశ రాయబారిగా బ్రిడ్జెట్‌ బ్రింక్‌ నియమితులయ్యారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. పోలండ్‌ నుంచి బ్లింకెన్‌ వాషింగ్టన్‌కు, ఆస్టిన్‌ జర్మనీకి వెళ్లనున్నారు. జర్మనీలో నాటో రక్షణ మంత్రుల సమావేశం మంగళవారం జరగనుంది.

423 లక్ష్యాలపై దాడి

ఉక్రెయిన్‌లో 423 లక్ష్యాలపై దాడి చేసినట్లు రష్యా ప్రకటించింది. దీనిలో ఒక చమురు శుద్ధి కర్మాగారం కూడా ఉంది. 26 చోట్ల సైనిక స్థావరాలను తమ విమానాలు ధ్వంసం చేశాయని తెలిపింది. రైల్వే వ్యవస్థ, ఇంధన నిల్వలు, మౌలిక సదుపాయాలపై గురిపెట్టి బాంబులు వేసింది. మిత్ర దేశాల నుంచి సైనిక సాయాన్ని రైళ్ల ద్వారా చేరవేస్తుండడంతో రైల్వే వ్యవస్థను విధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. ఐదు రైల్వే జంక్షన్లపై జరిగిన ఈ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోయారు. మేరియుపొల్‌లోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారంలో తలదాచుకున్న ప్రజల్ని సురక్షితంగా తరలించడానికి ఐరాస సాయం చేయాలని ఉక్రెయిన్‌ కోరింది. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించడం అమెరికాకు తగదని రష్యా ఆక్షేపించింది. దీనికి వెంటనే స్వస్తి పలకాలని అమెరికాలో రష్యా రాయబారి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దౌత్య వర్గాల ద్వారా ఒక నోట్‌ పంపినట్లు తెలిపారు.


మాల్దోవాలో పేలుళ్ల కలకలం

బుకారెస్ట్‌: ఉక్రెయిన్‌ పొరుగు దేశం మాల్దోవాలోని వేర్పాటువాద ట్రాన్స్‌నిస్ట్రియా ప్రాంతంలో సోమవారం పేలుళ్లు జరగడం కలకలం సృష్టించింది. రాకెట్ల నుంచి దూసుకొచ్చిన గ్రెనేడ్లు భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం సహా పలు భవనాలను తాకినట్లు పోలీసులు తెలిపారు. ఫలితంగా వాటి కిటికీలు ధ్వంసమయ్యాయని, ఆ ప్రాంతంలో భారీగా పొగ కమ్ముకుందని పేర్కొన్నారు. ఎవరైనా గాయపడ్డారా అనేది ప్రస్తుతానికి తెలియరాలేదు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకొని ఉక్రెయిన్‌పై దాడికి ఉపయోగించుకునేందుకు పుతిన్‌ సేనలు ప్రయత్నించే అవకాశముందని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఈ పేలుళ్లకు ప్రాధాన్యం సంతరించుకుంది.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts