Ukraine Crisis: గుటెరస్‌ ఉండగానే.. కీవ్‌లో క్షిపణి దాడి

ఉక్రెయిన్‌లో రష్యా దాడులను ముమ్మరం చేసింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ తన బృందంతో కలిసి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నా... కాల్పులకు తెరిపి ఇవ్వలేదు. గుటెరస్‌...

Updated : 30 Apr 2022 05:49 IST

ఐరాసను రష్యా అవమానించిందంటూ జెలెన్‌స్కీ మండిపాటు

‘డాన్‌బాస్‌’ లక్ష్యంగా పుతిన్‌ సేనల దాడులు

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా దాడులను ముమ్మరం చేసింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ తన బృందంతో కలిసి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నా... కాల్పులకు తెరిపి ఇవ్వలేదు. గుటెరస్‌ గురువారం సాయంత్రం రాజధాని కీవ్‌ను సందర్శించి, అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయిన క్రమంలోనే... పుతిన్‌ సేనలు అక్కడ క్షిపణులతో విరుచుకుపడ్డాయి! పాతిక అంతస్తుల భవనంలోకి క్షిపణి దూసుకెళ్లడంతో... అమెరికా నిధులతో నడిచే బ్రాడ్‌కాస్ట్‌ సంస్థ ‘రేడియో లిబర్టీ’ జర్నలిస్టు మృతిచెందారు. మరో పదిమంది పౌరులు గాయపడ్డారు. గుటెరస్‌, ఆయన బృందం సురక్షితంగానే ఉన్నట్టు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఉక్రెయిన్‌ భరింపరాని గుండెకోతకు కేంద్రంగా మారిందని, ఇది తీవ్ర బాధాకరమని గుటెరస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ బృందం పర్యటిస్తుండగానే ఉక్రెయిన్‌లోని పౌరులపై రష్యా దాడులు చేయడాన్నీ, బుచా ప్రాంతంలో రష్యా సైనికులు సాగించిన హింసాకాండనూ ఆయన ఖండించారు. మాస్కో చర్యను జర్మనీ తదితర దేశాలు కూడా తప్పుపట్టాయి.

ఐరాసను అవమానపరిచే ప్రయత్నం: జెలెన్‌స్కీ

గుటెరస్‌ పర్యటన వేళ కీవ్‌పై దాడి చేయడం ద్వారా ఐరాసను రష్యా అవమానించేందుకు ప్రయత్నించిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. ‘‘ప్రపంచ సంస్థల పట్ల రష్యా వైఖరికి ఈ చర్య అద్దం పడుతోంది. దీనికి దీటైన సమాధానం ఇవ్వాల్సి ఉంది. రెండు నెలలుగా దాడులకు గురవుతున్న మేరియుపొల్‌ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఐరాసతో కలిసి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాం’’ అని జెలెన్‌స్కీ చెప్పారు. ‘‘కీవ్‌పై రష్యా తాజా దాడి... గుటెరస్‌కు పుతిన్‌ తన మధ్యవేలు చూపడమే’’ అని కీవ్‌ మేయర్‌ విటాలీ క్లిట్‌స్కో వ్యాఖ్యానించారు.

అతిపెద్ద రైల్వే హబ్‌పై దాడులు...

డాన్‌బాస్‌ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పుతిన్‌ సేనలు శుక్రవారమూ దాడులను కొనసాగించాయి. ఉక్రెయిన్‌లోని ఆర్టెన్‌ డిఫెన్స్‌ ఫ్యాక్టరీకి చెందిన ఉత్పత్తి భవనాలను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణశాఖ తెలిపింది. పశ్చిమాన పోలోన్‌, బెలారస్‌ సరిహద్దులోని చెర్నిహివ్‌, రాజధాని కీవ్‌ సమీపంలోని అదిపెద్ద రైల్వే హబ్‌ ప్రాంతమైన ఫస్టివ్‌లతో పాటు లైసిఛాన్స్క్‌, సెవెరోడోనెట్స్క్‌ పట్టణాల్లోనూ దాడులు జరిగాయి. ఇజియుం నుంచి దక్షిణ ప్రాంతం స్లోవ్యాన్స్క్‌ వైపు వెళ్లేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నట్టు బ్రిటన్‌ రక్షణశాఖ తెలిపింది. పుతిన్‌ సేనలను ఉక్రెయిన్‌ దీటుగా అడ్డుకుంటున్నట్టు వివరించింది.

10 వేల మంది సైనికులతో నాటో విన్యాసాలు

రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్న క్రమంలో- నాటో సహా ఫిన్లాండ్‌, స్వీడన్‌లకు చెందిన పదివేల మంది సైనికులు త్వరలో ఐరోపా వ్యాప్తంగా సైనిక విన్యాసాలు చేపట్టనున్నారు. యుద్ధ విమానాలు, ట్యాంకులు, ఫిరంగులు వంటి వాటితో... ఫిన్లాండ్‌, పోలాండ్‌, నార్త్‌ మాసిడోనియా, ఎస్తోనియా-లాట్వియా సరిహద్దుల్లో విన్యాసాలు ప్రదర్శిస్తారు. ఫిన్లాండ్‌, స్వీడన్‌లు త్వరగా తమ కూటమిలో చేరవచ్చని నాటో వ్యాఖ్యానించింది.

* రష్యాతో పోరాడేందుకు వీలుగా ఉక్రెయిన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు సత్వరం పరికరాలను అందించేందుకు అమెరికా తన కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా- రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ‘సైనిక రుణ లీజు కార్యక్రమం క్రమబద్ధీకరణ’కు చట్టసభ తుది ఆమోదం తెలిపింది. ఇక అధ్యక్షుడు బైడెన్‌ ఆమోదముద్ర వేయడమే తరువాయి. ఉక్రెయిన్‌లో సైనిక, మానవతాసాయం నిమిత్తం అదనంగా సుమారు 2.54 లక్షల కోట్లు (33 బిలియన్‌ డాలర్లు) వెచ్చించేందుకు అమెరికా పార్లమెంటు ఆమోదం తెలిపింది.

అమెరికా మాజీ మెరైన్‌ మృతి

ఉక్రెయిన్‌ బలగాలతో కలిసి అక్కడ రష్యా సైనికులతో పోరాడుతున్న అమెరికా మాజీ మెరైన్‌ విల్లీ జోసెఫ్‌ కాన్సెల్‌(22)... సోమవారం జరిగిన దాడుల్లో మృతిచెందినట్టు అతని తల్లి రెబెక్కా కాబ్రెరా వెల్లడించారు. యుద్ధ ఆరంభంలోనే జోసెఫ్‌ ప్రైవేటు మిలిటరీ సంస్థలో చేరి, ఉక్రెయిన్‌లో పోరాడేందుకు సమ్మతించినట్టు ఆమె తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా పౌరుడి మరణం అధికారికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

యుద్ధ నేరాలపై బ్రిటన్‌ నిపుణుల విచారణ

రష్యా సైనికుల లైంగిక, హింసాత్మక దాడుల్ని, యుద్ధ నేరాలను మదింపు వేసేందుకు బ్రిటన్‌ తన నిపుణుల బృందాన్ని ఉక్రెయిన్‌కు పంపుతోంది. పోలండ్‌ సరిహద్దుల్లో మే1న తమ బృందం ప్రతినిధులు... అంతర్జాతీయ, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులతోనూ, శరణార్థులతోనూ సమావేశమవుతారని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ తెలిపారు.


జి-20 సదస్సులో పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీ!

 హాజరయ్యేందుకు అంగీకారం

జకార్తా: బాలిలో ఈ ఏడాది నవంబరులో జరిగే జి-20 సదస్సుకు హాజరయ్యేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీలు అంగీకరించినట్టు ఇండొనేసియా అధ్యక్షుడు జోకో విడోడో వెల్లడించారు. జి-20 కూటమికి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న విడోడో... కొద్దిరోజుల కిందటే నేతలిద్దరితో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని