Published : 01 May 2022 05:10 IST

రష్యా దూకుడుకు బ్రేక్‌

ముందడుగు వేయకుండా అడ్డుపడిన ఉక్రెయిన్‌

క్షిపణి దాడుల్లో 120 మందిని హతమార్చామన్న పుతిన్‌ సైన్యం

ఖర్కివ్‌: తమపై దురాక్రమణకు దిగిన రష్యాను ఎలాగైనా నిలువరించాలని ఉక్రెయిన్‌ దళాలు శనివారం గట్టిగా ప్రయత్నించాయి. దీంతో రష్యా సేనలు ఉక్రెయిన్‌ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ముందడుగు వేయలేకపోయాయి. లుహాన్స్క్‌లో రష్యా గగనతల దాడుల్ని ఉక్రెయిన్‌ సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో రష్యా దళంలో ఏడుగురు మాత్రమే సజీవంగా మిగిలారనీ, ఆ యూనిట్‌లో మిగిలినవారిని తమ సైనికులు హతమార్చారని గవర్నర్‌ తెలిపారు. పుతిన్‌ సేనలు అనుకున్నదానికంటే నెమ్మదిగా వెళ్తున్నాయని అమెరికా సైన్యాధికారి ఒకరు విశ్లేషించారు. గగనతలం నుంచి మద్దతు అందకపోవడం, నైతికత దెబ్బతినడం, యూనిట్‌ స్థాయిలో నైపుణ్యం లేకపోవడం వంటి కారణాల వల్ల రష్యా సైనికులు దెబ్బలు తింటున్నారని బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా అభిప్రాయపడుతోంది. ఎదురుదెబ్బల కారణంగా వీరు తమ బలగాలను పునర్వ్యవస్థీకరించుకోవాల్సి వస్తోందని ఈ శాఖ ట్వీట్‌ చేసింది. రష్యా మాత్రం దీనికి భిన్నమైన ప్రకటన చేసింది. క్షిపణి దాడుల్లో మందుగుండు సామగ్రిని, ఇంధన డిపోలను ధ్వంసం చేశామనీ, దీనిలో 120 మంది వరకు ఉక్రెయిన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. నాలుగు యుద్ధ ట్యాంకులు, ఆరు సాయుధ శకటాలను, 18 డ్రోన్లను దెబ్బతీసినట్లు ప్రకటించింది.

అక్కడి నుంచి సైనికుల్నీ తరలించాలి

మేరియుపొల్‌లోని ఉక్కు కర్మాగారంలో తలదాచుకున్న పౌరుల పరిస్థితి దయనీయంగా ఉందని, తమను రక్షించాల్సిందిగా వారు ప్రాధేయపడుతున్నారని అక్కడి మేయర్‌ చెప్పారు. పౌరులతో పాటు సైనికులనూ అక్కడి నుంచి తరలించాలని అజోవ్‌ రెజిమెంట్‌కు చెందిన కొందరు సైనికుల భార్యలు కోరారు. వారిని అక్కడ వదిలేస్తే రష్యా దళాలు పట్టుకుని, వేధింపులకు పాల్పడి ప్రాణాలు తీసేస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. కల్లోలిత ప్రాంతాల నుంచి పౌరుల తరలింపు నిమిత్తం రష్యా, ఉక్రెయిన్‌లతో సంప్రదిస్తున్నట్లు ఐరాస ప్రతినిధి తెలిపారు. ఖర్కివ్‌ సమీపంలోని ఒక గ్రామాన్ని రష్యా నుంచి ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకుంది. అక్కడి నుంచి వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేరే ఘటనలో.. ఉక్రెయిన్‌ బలగాలతో కలిసి పోరాడుతున్న అమెరికా పౌరుడొకరు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం మొదలయ్యాక అమెరికా తరఫున తొలి మరణం ఇది.


ఖర్కివ్‌లో నిర్బంధంలోకి 400 మంది

రష్యాకు సాయం చేస్తున్నవారికి కళ్లెం వేయడంపై ఉక్రెయిన్‌ దృష్టి సారించింది. ఒక్క ఖర్కివ్‌ ప్రాంతంలోనే దాదాపు 400 మందిని నిర్బంధంలో తీసుకుంది. యుద్ధ వార్తలను అందించే విలేకరులపైనా ఇరు దేశాలూ పలు రకాలుగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఎటు వెళ్లాలన్నా అడ్డంకులో, ఆంక్షలో ఉండడంతో క్షేత్రస్థాయి సమాచార సేకరణ కష్టతరంగా మారింది. మేరియుపొల్‌ను సర్వనాశనం చేసిన రీతిలోనే డాన్‌బాస్‌ను, అక్కడి ప్రజల్ని పూర్తిగా నిర్మూలించడానికి రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. యుద్ధంలో ఉక్రెయిన్‌ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ స్పెయిన్‌ రాణి లెటీసియా తన చేతిరాతతో కూడిన సందేశాన్ని, ఒక నౌక నిండా గ్రెనేడ్లను పంపించారు. ఉక్రెయిన్‌కు నిరంతర సాయం అందిస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ స్పష్టంచేశారు. జెలెన్‌స్కీతో ఆయన శనివారం దాదాపు గంటసేపు ఫోన్లో మాట్లాడారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని