Updated : 03 May 2022 06:07 IST

PM Modi: విజేతల్లేని యుద్ధం ఇది!

కష్టాలు, నష్టాలు అందరివీ
రష్యా-ఉక్రెయిన్‌ ఘర్షణపై నరేంద్ర మోదీ వ్యాఖ్య
భారత్‌ శాంతి పక్షాన్నే నిలుస్తుందని ఉద్ఘాటన
జర్మనీ ఛాన్స్‌లర్‌తో కలిసి బెర్లిన్‌లో విలేకరుల సమావేశం
వ్యవసాయం-పర్యావరణంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం

బెర్లిన్‌: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఏ దేశమూ విజయం సాధించలేదని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్పష్టం చేశారు. విజేతలు ఉండని ఈ రణంలో చివరకు మిగిలేది పెను విషాదం, విధ్వంసం మాత్రమేనని, దాని వల్ల కలిగే కష్టనష్టాలను మాత్రం అందరూ అనుభవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ఐరోపా పర్యటనలో భాగంగా సోమవారం జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చలు, అంతర్‌ ప్రభుత్వ సంప్రదింపుల అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు తక్షణమే వైరాన్ని వీడాల్సిన అవసరం ఉందని తెలిపారు. పరస్పర దాడుల వల్ల కలుగుతున్న ప్రాణ నష్టం, ఆస్తుల విధ్వంసంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి సామరస్యాలను పాటిస్తూ పరస్పర చర్చలతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆ రెండు దేశాలకు భారత్‌ తొలి నుంచీ చెబుతోందని గుర్తు చేశారు. ఉక్రెయిన్‌పై దాడి ద్వారా అంతర్జాతీయ న్యాయ నిబంధనల ఉల్లంఘనలకు రష్యా పాల్పడుతోందని జర్మనీ ఛాన్స్‌లర్‌ ఆరోపించారు. అనంతరం వెలువడిన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దళాలు కొనసాగిస్తున్న అన్యాయపు దాడిని జర్మనీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభంలో కలుగుతున్న భారీ ప్రాణ నష్టంపై భారత్‌, జర్మనీలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయని తెలిపారు. ఉక్రెయిన్‌లో అమాయక పౌరుల మరణాలను ఖండించారు. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందని సంయుక్త ప్రకటన అభిప్రాయపడింది. ఉగ్రవాద నిర్మూలనకు కలిసికట్టుగా కృషిచేయాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చింది.

ప్రపంచ పరిణామాలపై చర్చ

ప్రధాని మోదీ జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో తొలుత ముఖాముఖీ చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇరు దేశాల ప్రతినిధుల సంప్రదింపులు కొనసాగాయి. అంతకుముందు బెర్లిన్‌లోని ఫెడరల్‌ ఛాన్సెలరీ వద్దకు చేరుకున్న మోదీకి ఒలాఫ్‌ షోల్జ్‌ సాదర స్వాగతం పలికారు. 2021 డిసెంబరులో జర్మన్‌ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టిన షోల్జ్‌తో మోదీ తొలి భేటీ ఇది. ఆరో దఫా అంతర్‌ ప్రభుత్వ సంప్రదింపుల(ఐజీసీ) సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డోభాల్‌ హాజరయ్యారు. ఎస్‌.జైశంకర్‌ జర్మనీకి చెందిన మంత్రి అనలేనా బెయిర్‌బాంక్‌తో విడిగా సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరిస్థితులపై చర్చించుకున్నారు. మోదీని జర్మనీలో జరిగే జి-7 సదస్సుకు ఆహ్వానించినట్లు ఒలాఫ్‌ షోల్జ్‌ తెలిపారు.

అటవీ విస్తీర్ణం పెంపుపై ఒప్పందం

పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవటానికి సంబంధించిన సంయుక్త ప్రకటనపై భారత్‌, జర్మనీలు సోమవారం సంతకాలు చేశాయి. అటవీ విస్తీర్ణం పెంపులో సహకారానికి ఉద్దేశించిన ఈ అవగాహనపై రెండు దేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు వర్చువల్‌ విధానంలో ఆమోదం తెలిపారు.
* 2030 నాటికి సాధించాల్సిన పర్యావరణ లక్ష్యాల కోసం భారత్‌కు సుమారు రూ.80,430 కోట్ల(1000 కోట్ల యూరోలు) మేర సహాయాన్ని అదనంగా అందజేయనున్నట్లు జర్మనీ తెలిపింది. ఈ మొత్తాల్లో 50 శాతం నిధులను పునరుత్పాదక ఇంధనాలకు కేటాయిస్తారు.
* వ్యవసాయ-పర్యావరణం, ప్రకృతి వనరుల సుస్థిర నిర్వహణకు సంబంధించి  సుమారు రూ.2412 కోట్ల(యూరోలు 30కోట్లు) మేర రుణాలను రాయితీతో భారత్‌కు అందించే ఒప్పందంపైనా ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

మోదీకి ఎన్నారైల ఘన స్వాగతం

ప్రధాని మోదీ సోమవారం వేకువజామున బెర్లిన్‌ విమానాశ్రయంలో దిగారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో వేచియున్న ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం తెలిపారు. స్థానిక బ్రాండెన్‌బర్గ్‌ గేట్‌ వద్ద భారీ స్థాయిలో స్వాగత అలంకరణలు చేశారు. సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలనూ ఏర్పాటు చేశారు. అనంతరం హోటల్‌ అడ్లాన్‌ కెంపిన్స్కీలో నిర్వహించిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ఇద్దరు చిన్నారులు మోదీ మనసు గెలుచుకున్నారు. అశుతోష్‌ అనే బాలుడు శ్రావ్యంగా దేశభక్తి గీతం ఆలపించగా ముగ్ధుడైన మోదీ ఆ చిన్నారిని శెభాష్‌ అంటూ అభినందించారు. చిన్నారి బాలిక మన్య.. తాను గీసిన చిత్రపటాన్ని మోదీకి బహూకరించింది. ప్రధాని ఆ బాలికతో ఫొటో దిగారు. ఆమె చిత్రపటంపై ఆటోగ్రాఫ్‌ చేసి ఇచ్చారు.
‘యుద్ధం వల్ల సాధించేది ఏమీ ఉండదని భారత్‌ భావిస్తుంది. మా దేశం ఎల్లప్పుడూ శాంతి పక్షమే వహిస్తుంది. ఉక్రెయిన్‌ సంక్షోభం వల్ల చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆహారం, ఎరువుల కొరతల ప్రభావంతో ప్రపంచంలోని ప్రతి కుటుంబంపై అదనపు భారంపడుతోంది’
- భారత ప్రధాని నరేంద్ర మోదీ

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని