Ukraine Crisis: యుద్ధానికి అధికార ముద్ర!

ఉక్రెయిన్‌పై పోరాటాన్ని ‘ప్రత్యేక సైనిక చర్య’గా చెబుతూ వస్తున్న రష్యా.. త్వరలోనే దీనిని అధికారికంగా యుద్ధంగా ప్రకటించబోతోందా? 1945 మే 9న నాజీలను ఓడించినందుకు గుర్తుగా ఏటా అదేరోజు జరిపే విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని

Updated : 04 May 2022 06:23 IST

9న ప్రకటించనున్న పుతిన్‌?
పాశ్చాత్య దేశాల అంచనా
మేరియుపొల్‌పై రష్యా మోహరింపు ముమ్మరం
ఉక్కు కర్మాగారంలోకి చొచ్చుకుపోతున్న సేనలు

మాస్కో, కీవ్‌: ఉక్రెయిన్‌పై పోరాటాన్ని ‘ప్రత్యేక సైనిక చర్య’గా చెబుతూ వస్తున్న రష్యా.. త్వరలోనే దీనిని అధికారికంగా యుద్ధంగా ప్రకటించబోతోందా? 1945 మే 9న నాజీలను ఓడించినందుకు గుర్తుగా ఏటా అదేరోజు జరిపే విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి ఈ ప్రకటన చేయబోతోందా?.. రిజర్వ్‌ బలగాలను పూర్తిస్థాయిలో బరిలో దించడానికి వీలు కల్పించే ఇలాంటి నిర్ణయాన్ని రష్యా తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అమెరికా సహా పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్‌ను గుప్పిట పట్టాలన్న ప్రయత్నంతో ఫిబ్రవరి 24న మొదలుపెట్టిన దాడి ఏకధాటిగా కొనసాగుతున్నా, ఇప్పటివరకు ఆశించిన ఫలితం రాకపోవడంతో రష్యా కొత్త వ్యూహానికి పదును పెడుతోంది. ఇప్పటికే చాలామంది సైనికుల్ని కోల్పోవాల్సి రావడంతో రిజర్వు బలగాలను రంగంలోకి దించాలంటే యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించడం అనివార్యమని తెలుస్తోంది. యుద్ధానికి అధికారిక ముద్ర వేయాలన్నది దానిలో భాగమే. సరిగ్గా 9వ తేదీనే ఏదైనా కీలక ప్రకటన చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భావిస్తున్నట్లు గత కొద్దిరోజులుగా అంచనాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై భారీ విజయం సాధించినట్లు గానీ, కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు గానీ ప్రకటన వెలువడవచ్చని ఆ అంచనాలు చెబుతున్నాయి. నాజీలపై యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ప్రజామద్దతును కూడగట్టాలనేది పుతిన్‌ యోచనగా చెబుతున్నారు. తమపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలకు ప్రతీకారం తీర్చుకునే చర్యల ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు.  

మూడు మార్గాల్లో నిప్పుల వర్షం

మేరియుపొల్‌ను స్వాధీనం చేసుకోవాలనే పంతంతో ఉన్న రష్యా సేనలు మంగళవారం అక్కడి కీలకమైన అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ప్రాంగణం చుట్టూ భారీ ఎత్తున మోహరించడం ప్రారంభించాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ సైనిక బలగాలు వెల్లడించాయి. కర్మాగారంలోకి చొచ్చుకుపోతూ.. త్రివిధ దళాలూ అక్కడ నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. ఆ ప్రాంగణంపై దాడి చేయవద్దనీ, అక్కడకు రాకపోకల్ని మాత్రం కట్టడి చేయాలని పుతిన్‌ సుమారు రెండువారాల క్రితం ఆదేశించిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితి చొరవతో ఉక్కు కర్మాగార ఆవరణ నుంచి ఎట్టకేలకు తరలింపులు మొదలు కాగా, మరోపక్క పుతిన్‌ సేనల కదలికలతో పెద్దస్థాయిలో దాడి ఏదో జరగబోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం మొదలయ్యాక ఇంతవరకు రెండు లక్షల మంది పిల్లలు సహా 10 లక్షల మందికిపైగా ప్రజలను ఉక్రెయిన్‌ నుంచి రష్యాకు తీసుకువెళ్లినట్లు రష్యా రక్షణశాఖ తెలిపిందని అధికారిక వార్తాసంస్థ ‘టాస్‌’ వెల్లడించింది. పుతిన్‌తో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ఫోన్లో మాట్లాడి.. ప్రజల తరలింపు కొనసాగేలా చూడాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని