Ukraine Crisis: విదేశీ సాయంపై రష్యా కన్నెర్ర

ఉక్రెయిన్‌లోని వేర్వేరు ప్రాంతాలను లక్ష్యాలుగా చేసుకుని రష్యా సైనికులు బుధవారం దాడులు ముమ్మరం చేశారు. తూర్పు ప్రాంతంపై మరింత పట్టు బిగించేందుకు ప్రయత్నించారు. విదేశీ ఆయుధాలను, ముఖ్యంగా నాటో కూటమి నుంచి వస్తున్నవాటిని అడ్డుకునే ఉద్దేశంతో పశ్చిమ భూభాగంలోని ఆయా సరఫరా వ్యవస్థలపై బాంబులు, రాకెట్లతో విరుచుకుపడ్డారు. ఆయుధాలు పంపించే ప్రయత్నం చేయవద్దని నాటోను హెచ్చరించారు.

Published : 05 May 2022 06:28 IST

సరఫరా వ్యవస్థల మీద దాడులు ముమ్మరం
ఆంక్షల్ని తీవ్రతరం చేయనున్న ఈయూ
చమురు, ఆర్థిక లావాదేవీలపై నియంత్రణ!
కన్సల్టెన్సీ సేవల్ని నిలిపివేస్తామన్న బ్రిటన్‌

కీవ్‌: ఉక్రెయిన్‌లోని వేర్వేరు ప్రాంతాలను లక్ష్యాలుగా చేసుకుని రష్యా సైనికులు బుధవారం దాడులు ముమ్మరం చేశారు. తూర్పు ప్రాంతంపై మరింత పట్టు బిగించేందుకు ప్రయత్నించారు. విదేశీ ఆయుధాలను, ముఖ్యంగా నాటో కూటమి నుంచి వస్తున్నవాటిని అడ్డుకునే ఉద్దేశంతో పశ్చిమ భూభాగంలోని ఆయా సరఫరా వ్యవస్థలపై బాంబులు, రాకెట్లతో విరుచుకుపడ్డారు. ఆయుధాలు పంపించే ప్రయత్నం చేయవద్దని నాటోను హెచ్చరించారు. ఉక్రెయిన్‌ సైన్యానికి అందించడం కోసం ఆయుధాలు, లేదా పరికరాలను పంపిస్తే అవి కచ్చితంగా తాము ‘ధ్వంసం చేయదగ్గ లక్ష్యాలు’ అవుతాయని రష్యా రక్షణ మంత్రి సెర్గే షొయిగు స్పష్టీకరించారు.

విద్యుత్తు సరఫరా వ్యవస్థ ధ్వంసం

కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే క్షిపణుల్ని యుద్ధనౌకలు, యుద్ధ విమానాల ద్వారా ఉపయోగించి ఉక్రెయిన్‌లోని ఐదు రైల్వేస్టేషన్లలో విద్యుత్తు సరఫరా వ్యవస్థల్ని ధ్వంసం చేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. చమురు, ఆయుధ డిపోలపైనా పదాతిదళాలు దాడి చేసినట్లు తెలిపింది. మేరియుపొల్‌లోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ప్రాంగణాన్ని దిగ్బంధం చేశామంది. గాయాలపాలై చికిత్స పొందుతున్నవారు దాదాపు 500 మంది అందులోనే ఉన్నారని, వారిలో 200 మంది పరిస్థితి విషమంగా ఉందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తూర్పు డాన్‌బాస్‌ ప్రాంతంలో రష్యా చేసిన దాడుల్లో 21 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి.

బెలారస్‌లో విన్యాసాలు

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఈ నెల 9న అధికారికంగా రష్యా ప్రకటిస్తుందన్న ప్రచారాన్ని క్రెమ్లిన్‌ వర్గాలు తోసిపుచ్చాయి. అలాంటి ఆలోచన లేదని తెలిపాయి. యుద్ధానికి స్థావరంగా రష్యా వినియోగించుకుంటున్న బెలారస్‌లో సైనిక విన్యాసాలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు ఇప్పటికే ప్రకటించిన ఆయుధాలకు అదనంగా హోవిట్జర్లను, జెపార్డ్‌ తుపాకుల్ని ఇస్తామని జర్మనీ ప్రకటించింది.

రష్యా చమురు వాడొద్దు: ఈయూ

బ్రసెల్స్‌: రష్యా మీద అమెరికా, ఐరోపా దేశాలు మరింతగా ఆంక్షల పదును పెంచుతున్నాయి. ఆరో విడత ఆంక్షలను విధించేందుకు ఐరోపా సమాఖ్య సిద్ధమైంది. రష్యా చమురు దిగుమతులపై దశలవారీ ఆంక్షలతో పాటు, మాస్కో సైన్యాధికారులు, రష్యా టీవీ ఛానళ్లపై చర్యలు వంటివి ఆంక్షల ప్రణాళికలో ఉన్నాయి. ఆంక్షల జాబితాను సిద్ధం చేసిన ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ దానిని ఐరోపా పార్లమెంటుకు సమర్పించారు. రష్యా అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్బర్‌ బ్యాంకును అంతర్జాతీయ స్విఫ్ట్‌ చెల్లింపుల వ్యవస్థ నుంచి తొలగించడం వంటి ప్రతిపాదనలు జాబితాలో ఉన్నాయి.

ఇక సేవల ఎగుమతులకు సెలవు

రష్యాకు తమ దేశం నుంచి ఏ విధమైన సేవల ఎగుమతులు ఉండబోవని బ్రిటన్‌ ప్రకటించింది. మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ, అకౌంటెన్సీ, ప్రజా సంబంధాల పరంగా ఈ నిషేధం ఉంటుందని తెలిపింది. రష్యాతో వ్యాపారం చేయడమంటే అది ఉక్రెయిన్‌పై యుద్ధానికి నిధులు ఇవ్వడమేనని వ్యాఖ్యానించింది. 34 మంది ఉక్రెయిన్‌ వేర్పాటువాదులపై ఆర్థిక ఆంక్షలతో పాటు, ప్రయాణ నిషేధాన్ని విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. రష్యాపై చమురు ఆంక్షల్లో తాము పాలు పంచుకోబోమని హంగరీ, స్లొవేకియా తేల్చిచెప్పాయి.

ఆనాటి ఘటనలో మృతులు 600

మేరియుపొల్‌లోని ఒక డ్రామా థియేటర్‌పై మార్చి 16న జరిగిన దాడిలో దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారని ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌’ వార్తాసంస్థ అంచనా వేసింది. ఈ మేరకు ఆధారాలు లభ్యమైనట్లు తెలిపింది. దాడి జరిగిన సమయంలో దాదాపు 1,200 మంది దానిలో తలదాచుకున్నారు. మేరియుపొల్‌ నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నాలుగైదు రోజులుగా జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఆ కర్మాగారంలోపల ఉన్న సైనికులతో సంబంధాలు తెగిపోయాయని, వారి క్షేమ సమాచారం తెలియడం లేదని మేరియుపొల్‌ మేయర్‌ చెప్పారు. రష్యా సేనలు భారీగా అక్కడ దాడులు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని