Ukraine Crisis: చేజిక్కించుకునేదెవరు?

ఉక్రెయిన్‌లోని అత్యంత వ్యూహాత్మక ఓడరేవు నగరం మేరియుపొల్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకునేందుకు పుతిన్‌ సేనలు శతథా ప్రయత్నిస్తున్నాయి. అక్కడి అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారం వద్ద మాస్కో బలగాలు,

Updated : 07 May 2022 05:57 IST

 మేరియుపొల్‌ లక్ష్యంగా పుతిన్‌ సేనల దాడులు

‘ఉక్కు’ సంకల్పంతో ఢీ కొడుతున్న ఉక్రెయిన్‌ దళాలు

‘విక్టరీ డే’పై నెలకొన్న ఉత్కంఠ

నేడూ, రేపూ పోరు భీకరం..!

లెవీవ్‌: ఉక్రెయిన్‌లోని అత్యంత వ్యూహాత్మక ఓడరేవు నగరం మేరియుపొల్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకునేందుకు పుతిన్‌ సేనలు శతథా ప్రయత్నిస్తున్నాయి. అక్కడి అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారం వద్ద మాస్కో బలగాలు, ఉక్రెయిన్‌ సైనికుల నడుమ శుక్రవారం భీకర పోరు నడిచింది. నాజీ జర్మనీపై సోవియట్‌ యూనియన్‌ విజయం సాధించినందుకు గుర్తుగా రష్యా సోమవారం ‘విక్టరీ డే’ జరుపుకొంటోంది. అధ్యక్షుడు పుతిన్‌ ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మరింత ముమ్మరం చేస్తామనో, విజయం సాధించామనో ప్రకటిస్తారని బలంగా వినిపిస్తోంది. సోమవారం నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మేరియుపొల్‌ను, అక్కడి ఉక్కు పరిశ్రమను చేజిక్కించుకోవాల్సిందేనన్న లక్ష్యంతో రష్యా ఆది, సోమ వారాల్లో దాడులను మరింత తీవ్రతరం చేయనుందని బ్రిటన్‌ రక్షణశాఖ పేర్కొంది. సుమారు 2 వేల మంది ఉక్రెయిన్‌ సైనికులు ఉక్కు పరిశ్రమను ఎట్టిపరిస్థితుల్లోనూ జారవిడుచుకోమని, చివరి నిమిషం వరకూ యథాశక్తిగా పోరాడాలన్న సంకల్పంతో ఉన్నారు. తాజా దాడులతో ఉక్కు కర్మాగారం బేస్మెంటులో తలదాచుకున్న పౌరుల తరలింపు ప్రక్రియ నిలిచిపోయిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోతే, అక్కడున్న పౌరులను సురక్షితంగా తరలించేందుకు అంగీకరిస్తామని పుతిన్‌ బలగాలు మెలిక పెడుతున్నట్టు తెలిసింది. ఇన్నాళ్లూ కర్మాగారం వెలుపల మాత్రమే ఉన్న రష్యా సైనికులు... ఆ ప్లాంట్‌ లేఅవుట్‌ గురించి బాగా తెలిసిన ఒక ఎలక్ట్రీషియన్‌ సహకారంతో రహస్య మార్గాల ద్వారా లోనికి చొచ్చుకువచ్చినట్టు ఉక్రెయిన్‌ అంతర్గత వ్యవహారాలశాఖ శుక్రవారం తెలిపింది! మేరియుపొల్‌ రేవు ప్రాంతాన్ని రష్యా హస్తగతం చేసుకుంటే... 2014లో ఆ దేశం స్వాధీనం చేసుకున్న క్రిమియాకు భూమార్గం ఏర్పడుతుంది. అందుకే సైనిక చర్య ఆరంభం నుంచే మాస్కో సేనలు మేరియుపొల్‌ను చుట్టుముట్టి సుమారు రెండు నెలలుగా ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తున్నాయి. కాగా- విజయం తమదేనని విక్టరీ డే రోజు ప్రకటించేందుకు పుతిన్‌ ప్రయత్నిస్తున్నారని, అందుకే క్షిపణుల వినియోగాన్ని రష్యా భారీగా పెంచిందని బ్రిటన్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ టోనీ రాడాకిన్‌ పేర్కొన్నారు.

సైనిక స్థావరాలపై దాడులు...

గత 24 గంటల వ్యవధిలో ఉక్రెయిన్‌లోని డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తమ సేనలు దాడులు చేసినట్టు రష్యా రక్షణశాఖ ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఇగోర్‌ కొనషెంకో పేర్కొన్నారు. మాస్కో బలగాలు పాఠశాలలు, ఆసుపత్రులు, అపార్టుమెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని, ఈ ధాటికి తాజాగా అయిదుగురు వ్యక్తులు మరణించగా, డజన్లకొద్దీ ప్రజలు గాయపడ్డారని అధికారులు తలిపారు.

రష్యా యుద్ధనౌక ధ్వంసం!

నల్ల సముద్రంలో రష్యా మరోసారి భారీ మూల్యం చెల్లించుకున్నట్టే కనిపిస్తోంది. కొద్దిరోజుల కిందటే ఇక్కడ కీలక యుద్ధనౌక ‘మస్కావా’ను కోల్పోయిన రష్యా... తాజాగా ఒడెస్సా తీరాన మోహరించిన ‘మకరోవ్‌’నూ చేజార్చుకునే పరిస్థితులు తలెత్తినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ తన నెఫ్ట్యూన్‌ క్షిపణితో ఈ నౌకను భారీగా దెబ్బతీసినట్టు స్థానిక వెబ్‌సైట్‌ తెలిపింది. అయితే, ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని మాస్కో వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, రష్యా ఆధీనంలోకి వెళ్లిన పలు ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకున్నట్టు ఉక్రెయిన్‌ అధికారులు ప్రకటించారు. కాగా- ఖేర్సన్‌, మైకోలైవ్‌ తదితర 11 ప్రాంతాల్లో తాము పైచేయి సాధించామనీ; దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, డాన్‌బాస్‌ ప్రాంతాల్లో రష్యా దాడులను దీటుగా తిప్పికొట్టామని ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు ముందుకు వెళ్లకుండా ఉక్రెయిన్‌ సమర్థంగా అడ్డుకుంటోందని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ది స్టడీ ఆఫ్‌ వార్‌’ సంస్థ తెలిపింది.

ఏ పక్షమూ విజయం సాధించలేదు: భారత్‌

ఉక్రెయిన్‌లో పౌరులకూ, మౌలిక వసతులకు రక్షణ కల్పించే అంశంపై ఐరాస భద్రతామండలిలో శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఐరాసలో భారత శాశ్వత రాయబారి టి.ఎస్‌.తిరుమూర్తి మాట్లాడారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తాము మొదట్నుంచి రష్యా, ఉక్రెయిన్‌లను కోరుతున్నామన్నారు. ఈ యుద్ధంలో ఏ పక్షమూ విజయం సాధించబోదని చెప్పారు. యుద్ధబాధిత ప్రాంతాల నుంచి అమాయక పౌరులను తక్షణమే తరలించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

యుద్ధ నేరాలకు రష్యా బాధ్యత వహించక తప్పదు: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ శివార్లతో పాటు పలు చోట్ల రష్యా బలగాలు యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. ఇళ్లను ధ్వంసం చేసి... అమాయక పౌరులను ఉద్దేశపూర్వకంగా వేధించి, హత్య చేశాయని మండిపడింది. ఇందుకు సంబంధించి తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాడతామని... రష్యా తాను సాగించిన దురాగతాలకు తప్పకుండా బాధ్యత వహించాల్సి వస్తుందని ‘ఆమ్నెస్టీ’ సెక్రటరీ జనరల్‌ ఆగ్నెస్‌ కలమార్డ్‌ పేర్కొన్నారు.

పునర్నిర్మాణానికి... ‘యునైటెడ్‌-24’: జెలెన్‌స్కీ

యుద్ధానంతరం ఉక్రెయిన్‌ పునర్నిర్మాణం చేపట్టేందుకు ‘యునైటెడ్‌-24’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా నిధుల సమీకరణ చేపట్టనున్నట్టు జెలెన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌లో మానవతా సాయం అందంచేందుకు పోలండ్‌ ‘అంతర్జాతీయ దాతల సదస్సు’ నిర్వహించిందని... ఐరోపా దేశాలకు చెందిన ప్రతినిధులు, రాయబారులు పెద్దసంఖ్యలో హాజరై సుమారు రూ.43,096 కోట్ల నిధులను సమకూర్చారని చెబుతున్నారు. రష్యాతో తాను ఇప్పటికీ చర్చలకు సిద్ధమని జెలెన్‌స్కీ చెప్పారు. అయితే, సైనిక చర్యకు ముందు దొనెట్స్క్‌, లుహాన్స్క్‌లలో మోహరించిన దళాలను ఉపసంహరించుకోవాలని షరతు పెట్టారు.

* రష్యా చమురుపై ఐరోపా నేతలు ఆంక్షలు విధించడం తమకు తీవ్ర నష్టం కలిగించే అంశమని, తమ దేశంపై అణుబాంబు వేయడంతో ఇది సమానమని హంగరీ ప్రధాని విక్టర్‌ ఓర్బన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

* బాల్టిక్‌ దేశాలైన లాట్వియా, ఎస్టోనియా, లిథుయేనియా విదేశాంగ శాఖల మంత్రులు శుక్రవారం కీవ్‌లో పర్యటించి, జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు.

* ఖర్కివ్‌ నుంచి రష్యా సేనలను తరిమివేసేందుకు ప్రయత్నించనున్నట్టు ఉక్రెయిన్‌ సైనికాధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో రష్యా బలగాలను ఉక్రెయిన్‌ సైనికులు ఇటీవల 40 కిలోమీటర్ల మేర వెనక్కు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని