Mount Everest: 26వ సారి ఎవరెస్టు శిఖరానికి.. సొంత రికార్డు బద్దలు

తన రికార్డును తానే బద్దలుగొడుతూ 52 ఏళ్ల నేపాలీ షెర్పా కామీ రీటా 26వ సారి ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.

Updated : 09 May 2022 08:31 IST

కాఠ్‌మాండూ: తన రికార్డును తానే బద్దలుగొడుతూ 52 ఏళ్ల నేపాలీ షెర్పా కామీ రీటా 26వ సారి ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఇంతవరకు అత్యధిక సార్లు ఈ శిఖరం పైకి చేరుకున్న రికార్డు ఆయనదే కాగా దాన్ని మళ్లీ అధిగమించడం విశేషం. ఈమేరకు కామీ రీటా నేతృత్వంలోని 11 మంది షెర్పా గైడ్ల బృందం 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరానికి శనివారం సాయంత్రం చేరుకున్నట్లు నేపాల్‌ పర్యాటక విభాగం ఉన్నతాధికారి ఒకరు ఆదివారం తెలిపారు. శిఖరాలను అధిరోహించే సీజన్‌ మే నెలతో ప్రారంభమవుతుండగా యాత్రికులకు సహాయ పడేందుకు షెర్పాలు ట్రెక్కింగ్‌ మార్గంలో తాళ్లు కట్టి పైకి వెళుతుంటారు. 1953లో తొలిసారి ఎవరెస్టును అధిరోహించినవారుగా న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్‌ హిల్లరీ, నేపాలీ షెర్పా టెన్జింగ్‌ నార్గేలు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. వారు ఏర్పరిచిన సంప్రదాయ మార్గంలోనే తాజాగా కామీ రీటా బృందం కూడా శిఖరం పైకి చేరుకుంది. ఈ ఏడాది నేపాల్‌ పర్యాటక శాఖ ఎవరెస్టును అధిరోహించడానికి 316 పర్మిట్లు జారీ చేసింది. కామీ రీటా 1994 మే 13న తొలిసారిగా ఈ శిఖరం పైకి చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని