Updated : 09 May 2022 06:17 IST

Ukraine Crisis: ఉక్రెయిన్‌లో జిల్‌ బైడెన్‌, జస్టిన్‌ ట్రుడో

వేర్వేరుగా పర్యటించిన ప్రముఖులు  
జెలెన్‌స్కీ సతీమణితో అమెరికా ప్రథమ మహిళ భేటీ

కీవ్‌: యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌లో తాజాగా ఇద్దరు విదేశీ ప్రముఖులు పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌, కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రుడో ఆదివారం ఆ దేశానికి ఆకస్మికంగా విచ్చేశారు. అక్కడి పరిస్థితులను  కళ్లారా చూశారు. వీరిద్దరి పర్యటన వేర్వేరుగా సాగింది. స్లొవేకియా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉఝొరొడ్‌ నగరానికి (పశ్చిమ ఉక్రెయిన్‌) విచ్చేసిన జిల్‌.. అక్కడ దాదాపు రెండు గంటల పాటు గడిపారు. ఓ చిన్న తరగతి గదిలో ఉక్రెయిన్‌ ప్రథమ మహిళ ఒలేనా జెలెన్‌స్కా(దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య)తో భేటీ అయ్యారు. చాలాసేపు ఏకాంతంగా మాట్లాడారు. ఉక్రెయిన్‌ తల్లులకు సంఘీభావం తెలిపేందుకే ప్రత్యేకంగా మాతృ దినోత్సవం రోజున తాను అక్కడికి వచ్చినట్లు జిల్‌ తెలిపారు. జెలెన్‌స్కాతో ఆమె చర్చల వివరాలేవీ బయటకు రాలేదు. తూర్పు ఐరోపాలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జిల్‌ శుక్ర, శనివారాల్లో రొమేనియాలో ఉన్న సంగతి గమనార్హం. మరోవైపు- కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో ఉక్రెయిన్‌లోని ఇర్పిన్‌ నగరంలో పర్యటించారు. కీవ్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా రష్యా బలగాలు ఆ నగరాన్ని ఎంతగా ధ్వంసం చేశాయో పరిశీలించారు.


రష్యా చమురును వదిలించుకుందాం

జి-7 దేశాల నేతల నిర్ణయం

లండన్‌: ఆంక్షల్లో భాగంగా రష్యా నుంచి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకోవడమో, పూర్తిగా నిషేధించడమో చేయాలని జి-7 దేశాధినేతలు నిర్ణయించారు. ఆదివారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఆన్‌లైన్‌లో భేటీ సందర్భంగా వారు ఈ మేరకు ఉక్రెయిన్‌కు సంఘీభావం ప్రకటించారు. రష్యాపై ఆర్థికంగా వేటు వేయాలంటే చమురుపైనే దెబ్బ కొట్టాలని భావిస్తున్నట్లు కూటమిలో సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్‌, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ప్రత్యామ్నాయ సరఫరాలను చూసుకునేలా తగిన సమయం ఇస్తూ రష్యా చమురును వదిలించుకుంటామని వెల్లడించాయి.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts