Ukraine Crisis: అనివార్యమై దండెత్తాం

తమ సరిహద్దు పక్కనే ముప్పు ఉండడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనీ, అది రోజురోజుకీ పెరుగుతుండడం వల్లనే ఉక్రెయిన్‌పై చర్య చేపట్టాల్సి వచ్చిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమర్థించుకున్నారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో

Updated : 10 May 2022 06:04 IST

సరిహద్దు పక్కనే ముప్పు.. ఆమోదయోగ్యం కాదు
మాపై దాడికి ఉక్రెయిన్‌ ప్రయత్నించింది
దానిని తిప్పికొట్టడానికే చర్య చేపట్టాం: పుతిన్‌

మాస్కో: తమ సరిహద్దు పక్కనే ముప్పు ఉండడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనీ, అది రోజురోజుకీ పెరుగుతుండడం వల్లనే ఉక్రెయిన్‌పై చర్య చేపట్టాల్సి వచ్చిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమర్థించుకున్నారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సాధించిన విజయానికి గుర్తుగా ఏటా మే 9న నిర్వహించే విజయోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మాస్కోలోని రెడ్‌స్క్వేర్‌లో సైనికులు పెద్దఎత్తున కవాతు చేశారు. ఈ సందర్భంగా పుతిన్‌ ప్రసంగించారు. ‘మాపై దాడికి ఉక్రెయిన్‌ ప్రయత్నించింది. ముందస్తు చర్యలతో దానిని తిప్పికొట్టాం. మాకు భద్రతపరమైన హామీలిచ్చే విషయంలో పశ్చిమ దేశాలు విఫలమయ్యాయి. నాటో విస్తరణ ప్రణాళికల నుంచి వెనక్కి తగ్గాలని మేం కోరినా వినిపించుకోలేదు. గత్యంతరం లేక దండెత్తాల్సి వచ్చింది’ అని వివరించారు. పోరులో తదుపరి దశ ఏమిటనేది గానీ, ఉక్రెయిన్‌లోని మేరియుపొల్‌ను కైవసం చేసుకున్నట్లు గానీ పుతిన్‌ ప్రకటించలేదు. విజయోత్సవాల సందర్భంగా సైనికులు తమ సత్తాను, ఆయుధాలను ప్రదర్శించారు.

మాకు 2 విజయ దినోత్సవాలు: జెలెన్‌స్కీ

కీవ్‌: తమకు ఏటా రెండు విజయ దినోత్సవాలు ఉంటాయని, కొంతమందికి ఒక్కటీ ఉండదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ చెప్పారు. ‘రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీని ఓడించడం ఒక విజయమైతే, త్వరలో రెండో విజయాన్ని సాధించబోతున్నాం. ఆ యుద్ధంలో మా పూర్వీకులకు ఏమైందో మేం ఎన్నటికీ మర్చిపోలేం. దానిలో 80 లక్షల మంది ఉక్రెయిన్‌ ప్రజలు మరణించారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఇళ్లకు చేరలేదు. ప్రపంచయుద్ధంలో మొత్తంగా ఐదుకోట్ల మంది బలైపోయారు. ఇప్పుడు అది పునరావృతం అవుతుందని మేం చెప్పడం లేదు. కాకపోతే అప్పుడూ మేం గెలిచాం.. ఇప్పుడూ గెలవబోతున్నాం’ అని వీడియో సందేశం వెలువరించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts