Ukraine Crisis: ఒడెసాపై హైపర్‌సోనిక్‌ క్షిపణులు

పట్టు వదలకుండా యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యా.. మంగళవారం ఉక్రెయిన్‌లోని ఒడెసాపై హైపర్‌సోనిక్‌ క్షిపణుల్ని ప్రయోగించింది. ఇవి ధ్వని కంటే ఐదు రెట్ల వేగంతో దూసుకువెళ్తాయి. రష్యాలో సోమవారం జరిగిన ‘రెండో ప్రపంచ యుద్ధ విజయోత్సవం’ సందర్భంగా

Updated : 11 May 2022 06:05 IST

ఓడరేవు లక్ష్యంగా ప్రయోగించిన రష్యా  
ముమ్మరంగా కొనసాగిన దాడులు  
లిజియుంలో బయటపడ్డ 44 మృతదేహాలు

జపోరిజిజియా (ఉక్రెయిన్‌): పట్టు వదలకుండా యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యా.. మంగళవారం ఉక్రెయిన్‌లోని ఒడెసాపై హైపర్‌సోనిక్‌ క్షిపణుల్ని ప్రయోగించింది. ఇవి ధ్వని కంటే ఐదు రెట్ల వేగంతో దూసుకువెళ్తాయి. రష్యాలో సోమవారం జరిగిన ‘రెండో ప్రపంచ యుద్ధ విజయోత్సవం’ సందర్భంగా ఉక్రెయిన్‌ యుద్ధంలో ఒకరోజు కాస్త విరామం లభించినా మళ్లీ దాడులు ఊపందుకున్నాయి. ఒడెసాలోని ఓడరేవు, మేరియుపొల్‌లోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ప్రాంగణాలు లక్ష్యంగా యుద్ధం కొనసాగింది. ఒక వాణిజ్య సముదాయంపై, మరో గిడ్డంగిపైనా క్షిపణులు విరుచుకుపడ్డాయి. సరఫరా వ్యవస్థల్ని, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల నుంచి నౌకల్లో తరలి వస్తున్న ఆయుధాలను అడ్డుకునేలా రష్యా ప్రయత్నాలు చేసింది. సముద్ర మార్గాలను మూసివేయడం తమ విజయానికి అత్యంత అవసరమని పుతిన్‌ సేనలు భావిస్తున్నాయి. ఆహారధాన్యాల ఎగుమతిలో ఒడెసా ఓడరేవుది కీలక పాత్ర. దానిని రష్యా దిగ్బంధం చేయడంతో ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఆహారధాన్యాల సరఫరా పరంగా ప్రకంపనలు రేకెత్తాయి. కచ్చితంగా లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న కింఝాల్‌, డాగర్‌ వంటి హైపర్‌సోనిక్‌ క్షిపణుల్ని రష్యా ఎడాపెడా ఉపయోగిస్తోందని ‘రక్షణ వ్యూహాల అధ్యయన కేంద్రం’ తెలిపింది. ఈ వైఖరి వల్ల.. మున్ముందు అంతగా కచ్చితత్వం లేని రాకెట్లను ఆ దేశం ప్రయోగించే ప్రమాదం ఉందని ఉక్రెయిన్‌తో పాటు బ్రిటన్‌, అమెరికా కూడా భావిస్తున్నాయి.

24 గంటలు.. 34 దాడులు
11 చదరపు కి.మీ. మేర విస్తరించిన అజోవ్‌స్తల్‌ ఉక్కు ప్రాంగణం నుంచి చాలామందిని తరలించినా మరో 100 మంది ప్రజలు ఇంకా అక్కడే తలదాచుకుని ఉంటారని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ ప్రాంగణంపై 24 గంటల వ్యవధిలో 34 సార్లు వైమానిక దాడులు జరిగాయి. కర్మాగారాన్ని దిగ్బంధం చేసే ప్రయత్నాలను రష్యా కొనసాగించింది. రసాయన పరిశ్రమలపైనా రష్యా దాడి చేసేలా ఉందని ఉక్రెయిన్‌ అనుమానం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 24న తమపై దండయాత్ర మొదలయ్యే ముందు రష్యా సేనలు ఏయే ప్రాంతాల్లో ఉండేవో అక్కడకు వాటిని తిప్పికొట్టడంతో పాటు తమకు వాటిల్లిన నష్టానికి పరిహారం రాబట్టడం సహా మరిన్ని లక్ష్యాలు తమకు ఉన్నాయని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా తెలిపారు. క్రిమియాను, రష్యా అనుకూల వేర్పాటువాదుల గుప్పిట్లో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం తమ లక్ష్యమని పరోక్షంగా చెప్పారు. లిజియుమ్‌లో మార్చి నెలలో రష్యా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఐదంతస్తుల భవంతి శిథిలాల్లో 44 మంది మృతదేహాలను గుర్తించినట్లు సైన్యం తెలిపింది.

ఐరాస మానవ హక్కుల మండలిలో రష్యా బదులు చెక్‌
ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల మండలిలో రష్యా బదులు చెక్‌ రిపబ్లిక్‌ను తీసుకునేందుకు ఐరాస సర్వప్రతినిధి సభ తీర్మానించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయ్యాక రష్యాను ఈ స్థానం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. 193 సభ్య దేశాల్లో 180 దేశాలు మంగళవారం రహస్య బ్యాలెట్‌లో పాల్గొనగా, చెక్‌కు అనుకూలంగా 157 ఓట్లు వచ్చాయి.
* ఉక్రెయిన్‌కు 40 బిలియన్‌ డాలర్ల సాయం అందించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. రణక్షేత్రంలో ఉక్రెయిన్‌ విజయం సాధించాలంటే ఈ సాయం చాలా కీలకమని ఆయన చెప్పారు.

జర్మనీ బాసట
కీవ్‌ శివార్లలోని బుచాలో జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బెర్బాక్‌ పర్యటించారు. మృతులకు నివాళులర్పించడమే కాకుండా మరణాలకు కారకులైనవారిని జవాబుదారీ చేయడం తమ ఉద్దేశమని చెప్పారు. కీవ్‌లో జర్మనీ రాయబార కార్యాలయాన్ని ఆమె పునఃప్రారంభించారు. బుచాలో 300 మందికి పైగా ప్రజల్ని చట్టవిరుద్ధంగా మట్టుబెట్టినట్లు నివేదికలు అందాయని ఉక్రెయిన్‌లోని ‘ఐరాస మానవ హక్కుల పర్యవేక్షక మిషన్‌’ అధిపతి మటిల్దా బొగ్నెర్‌ తెలిపారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 3,381 మంది ప్రజలు ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని