Updated : 12 May 2022 05:51 IST

Sri Lanka Crisis: సైనిక పహారాలో లంక

వీధుల్లో మిలిటరీ వాహనాల సంచారం
సంక్షోభ పరిష్కారానికి గొటబాయ ప్రయత్నాలు

కొలంబో: శ్రీలంకలో పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు. రాజధాని నగరం కొలంబో సహా పలు ప్రాంతాల్లో సోమవారం చోటుచేసుకున్న ఘర్షణల తాలూకు గంభీర వాతావరణం బుధవారం కూడా దేశవ్యాప్తంగా కనిపించింది. భద్రతా పరిస్థితులను పర్యవేక్షిస్తూ వీధుల్లో బలగాలు గస్తీ తిరుగుతున్నాయి. ఎక్కడచూసినా మిలిటరీ వాహనాలు దర్శనమిస్తున్నాయి. కర్ఫ్యూ అమలులో ఉండటంతోపాటు.. ప్రభుత్వ ఆస్తుల లూటీకి పాల్పడినా, ఇతరులకు హాని తలపెట్టినా కాల్పులు జరుపుతామంటూ సైన్యం హెచ్చరికలు జారీచేయడంతో బుధవారం ఎక్కడా తీవ్రస్థాయి ఘర్షణలు చోటుచేసుకోలేదు. ఈ వారంలోనే తాను నూతన ప్రధానమంత్రిని, కేబినెట్‌ను నియమించనున్నట్లు దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రకటించారు. కొత్త మంత్రివర్గంలో తమ కుటుంబీకులెవరూ ఉండబోరని స్పష్టంచేశారు. తాజా మాజీ ప్రధానమంత్రి మహీంద రాజపక్స ట్రింకోమలీ నౌకాదళ స్థావరంలో ఆశ్రయం పొందుతున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి జనరల్‌(విశ్రాంత) కమల్‌ గుణరత్నె నిర్ధారించారు. పరిస్థితులు కుదుటపడ్డాక మహీందను ఆయన కోరుకున్న చోటుకు చేరుస్తామని పేర్కొన్నారు. లంకలో సైనిక పాలన ఉండబోదని స్పష్టంచేశారు. సోమవారం నాటి ఘర్షణల్లో మృత్యువాతపడ్డవారి సంఖ్య 9కి పెరిగింది.

కొనసాగుతున్న చర్చలు

లంకలో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా గొటబాయ రాజపక్స ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ‘సమాగి జన బలవేగయా (ఎస్‌జేబీ)’ నేతలతోపాటు అధికార పక్షమైన శ్రీలంక పొడుజానా పెరమున(ఎస్‌ఎల్‌పీపీ) అసమ్మతి నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. గొటబాయ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తాను తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోనని ఎస్‌జేబీ నేత సాజిత్‌ ప్రేమదాస స్పష్టంచేసినట్లు సమాచారం.

యువ కేబినెట్‌ను ఏర్పాటుచేస్తా: గొటబాయ

ఆర్థిక, సామాజిక, రాజకీయ సవాళ్లను అధిగమించేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదామని లంకేయులకు గొటబాయ పిలుపునిచ్చారు. విద్రోహ ప్రయత్నాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కొత్త ప్రధాని, ప్రభుత్వం వచ్చాక.. పార్లమెంటుకు మరిన్ని అధికారాలు కల్పించేలా రాజ్యాంగ సంస్కరణలు చేపడతామన్నారు. యువ కేబినెట్‌ను ఏర్పాటుచేస్తానని, అందులో తమ కుటుంబ సభ్యులెవరూ ఉండబోరని పేర్కొన్నారు.

గుటెరస్‌ ఆందోళన

కొలంబోలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై దాడులు చోటుచేసుకోవడంపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌, ఐరాస మానవహక్కుల హైకమిషనర్‌ మిషెల్‌ బష్లే ఆందోళన వ్యక్తంచేశారు. ఈ దాడులపై పారదర్శక విధానంలో దర్యాప్తు జరిపించాలని పిలుపునిచ్చారు. లంకలో పరిణామాలపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఆందోళన వెలిబుచ్చింది.

బలగాలను పంపట్లేదు: భారత్‌

శ్రీలంకలో పరిస్థితులను నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు భారత్‌ బలగాలను పంపించనుందంటూ వస్తున్న వార్తలన్నీ కల్పితమైనవేనని కొలంబోలోని భారత హైకమిషన్‌ స్పష్టంచేసింది. మహీంద రాజపక్స, ఆయన కుటుంబ సభ్యులు భారత్‌కు పారిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్నీ ఖండించింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts