Ukraine Crisis: రష్యా గ్యాస్‌కు బ్రేకు

పశ్చిమ ఐరోపా దేశాలకు రష్యా నుంచి సహజవాయువును సరఫరా చేసే కీలక వ్యవస్థను ఉక్రెయిన్‌ అడ్డుకుంది. రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదుల నియంత్రణలోని నోవోప్‌స్కోవ్‌ వద్ద ఉక్రెయిన్‌ సైన్యం ఈ చర్య చేపట్టింది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి

Updated : 12 May 2022 05:53 IST

సహజవాయువు సరఫరాను అడ్డుకున్న ఉక్రెయిన్‌
ఖర్కివ్‌ సమీపం నుంచి పుతిన్‌ సేనలు వెనక్కి

కీవ్‌: పశ్చిమ ఐరోపా దేశాలకు రష్యా నుంచి సహజవాయువును సరఫరా చేసే కీలక వ్యవస్థను ఉక్రెయిన్‌ అడ్డుకుంది. రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదుల నియంత్రణలోని నోవోప్‌స్కోవ్‌ వద్ద ఉక్రెయిన్‌ సైన్యం ఈ చర్య చేపట్టింది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి సహజవాయువు సరఫరాపై ప్రభావం పడినట్లయింది. పశ్చిమ ఐరోపాకు మూడోవంతు గ్యాస్‌ ఈ హబ్‌ ద్వారానే సరఫరా అవుతోంది. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయాన్ని వెతకడం మాత్రం సాంకేతికంగా అసాధ్యమని సంబంధిత వర్గాలు తెలిపాయి.  

తరిమికొడుతున్నాం: జెలెన్‌స్కీ

ఖర్కివ్‌లోని పలు ప్రాంతాల నుంచి రష్యా బలగాలను తమ సేనలు క్రమంగా తరిమి కొడుతున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. నాలుగు గ్రామాల నుంచి మాస్కో బలగాలు వెనక్కి వెళ్లిపోయినట్లు చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో యుద్ధానికి ముందున్న పరిస్థితికి చేరుకుంటామన్న విశ్వాసం కలుగుతోందని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా చెప్పారు. డాన్‌బాస్‌లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇది యుద్ధ గతిని మారుస్తుందన్నారు. నల్ల సముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌లో రష్యా ప్రాబల్యం విస్తరించకుండా ఆ దేశ బలగాలపై ఉక్రెయిన్‌ దృష్టి సారించింది.  

మమ్మల్ని తరలించండి..

యుద్ధంలో గాయాలపాలై, తెగిపడ్డ అవయవాలతో ఉన్న సహచరుల ఛాయాచిత్రాలను అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ప్రాంగణంలో తలదాచుకున్న అజోవ్‌ రెజిమెంట్‌ బలగాలు విడుదల చేశాయి. అపారిశుద్ధ్య వాతావరణంలో సరైన మందులు, బ్యాండేజి వంటివి లేకుండా వారు బాధలు పడుతున్నట్లు వాటి ద్వారా తెలుస్తోంది. ఉక్రెయిన్‌ నియంత్రణలోని ప్రాంతాలకు తమను తరలించాలని ఐరాస, రెడ్‌క్రాస్‌ సంస్థలకు వారు విజ్ఞప్తి చేశారు. యుద్ధం వల్ల ఏప్రిల్‌ నెలాఖరు వరకు 1.40 కోట్ల మంది తమ ఇళ్లను వీడాల్సి వచ్చిందని, వీరిలో 59 లక్షల మంది వేరే దేశాలకు వెళ్లారని ఐరాస తెలిపింది. ఉక్రెయిన్‌కు 4,000 కోట్ల డాలర్ల సాయాన్ని అందించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన ప్రతిపాదనకు అక్కడి చట్టసభలు ఆమోదం తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని