Ukraine Crisis: తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు

తూర్పు ఉక్రెయిన్‌ భూభాగాలపై రష్యా సైనికులు గురువారం పెద్దఎత్తున దాడులకు పాల్పడ్డారు. మేరియుపొల్‌ హస్తగతానికి, ఇతర నగరాల్లో ఇంకా చొచ్చుకుపోయేందుకు మరింతగా ప్రయత్నించారు. అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ఆవరణలోని బంకర్లలో క్షతగాత్రులుగా ఉన్న తమ సైనికులను సురక్షితంగా

Updated : 13 May 2022 06:15 IST

 సురక్షిత తరలింపు మార్గాల మూసివేత
 ఆంక్షలతో ప్రపంచంపై ప్రభావం ఉంటుందన్న పుతిన్‌  
 నాటోలో చేరడానికి ఫిన్లాండ్‌ మొగ్గు

కీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌ భూభాగాలపై రష్యా సైనికులు గురువారం పెద్దఎత్తున దాడులకు పాల్పడ్డారు. మేరియుపొల్‌ హస్తగతానికి, ఇతర నగరాల్లో ఇంకా చొచ్చుకుపోయేందుకు మరింతగా ప్రయత్నించారు. అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ఆవరణలోని బంకర్లలో క్షతగాత్రులుగా ఉన్న తమ సైనికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహకరిస్తే దానికి బదులుగా.. తమవద్ద యుద్ధ ఖైదీలుగా ఉన్న రష్యా సైనికులను విడుదల చేస్తామని ఉక్రెయిన్‌ ప్రతిపాదించింది. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంగణం మినహా మేరియుపొల్‌లోని మిగతా ప్రాంతాలు రష్యా నియంత్రణలోకి వెళ్లడంతో ఆహారం, తాగునీరు, మందులు అందక ప్రజలు అల్లాడిపోతున్నారు. దాడులకు భయపడి తమ నగరాలను వీడుతున్నవారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఖర్కివ్‌, చెర్నిహైవ్‌, సుమీ తదితర ప్రాంతాల్లో దాడులు ముమ్మరంగా కొనసాగాయి.

ఆ ప్రాంతాలు ఎప్పటికీ ఉక్రెయిన్‌ చేతికి వెళ్లవు: పుతిన్‌
సురక్షిత తరలింపు మార్గాలనూ రష్యా మూసివేసింది. డాన్‌బాస్‌ ప్రాంతంలో రష్యా పాక్షిక విజయం సాధించిందని ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు గుర్తించాయి. రష్యా చేసిన తొమ్మిది దాడులను తిప్పికొట్టి, అనేక డ్రోన్లను, సైనిక వాహనాలను తాము నాశనం చేశామని ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. రష్యా దాడుల్లో పలుచోట్ల పాఠశాల భవనాలు, వసతి సముదాయాలు, కార్యాలయాలు దెబ్బతిన్నాయి. వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్న లుహాన్స్క్‌ ఎప్పటికీ ఉక్రెయిన్‌ చేతికి చేరకుండా చూస్తామంటూ ఆ ప్రాంత స్వయంప్రకటిత రిపబ్లిక్‌ అధినేతకు పంపిన సందేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భరోసా ఇచ్చారు. తమపై విధిస్తున్న ఆంక్షల ప్రభావం ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మరింత పెంచుతోందని ఆయన ఒక సమావేశంలో చెప్పారు. ‘‘రసోఫోబియా’’తోనే ఈ ఆంక్షల్ని తమపై విధించి సొంత ఆర్థిక వ్యవస్థల్ని అవి దెబ్బతీసుకుంటున్నాయని విమర్శించారు. ఆంక్షల ప్రభావాన్ని రష్యా ఆర్థిక వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కొందని చెప్పారు.

యుద్ధనేరాలపై విచారణ
నిరాయుధురాలైన 62 ఏళ్ల మహిళలను తుపాకీతో కాల్చి చంపినందుకు రష్యా సార్జెంట్‌ వాదిన్‌ షిషిమారిన్‌పై యుద్ధనేరాల కింద విచారణ ప్రారంభించడానికి ఉక్రెయిన్‌ సన్నద్ధమయింది. ఈ యుద్ధంలో ఇలాంటి విచారణ చేపట్టనుండడం ఇదే తొలిసారి. పుతిన్‌ సేనలు 10,700కి పైగా యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని, కారకులైనవారిలో 600 మంది అనుమానితుల్ని గుర్తించామని ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం తెలిపింది. పిల్లల్ని సయితం రష్యా సైనికులు ఎలా హతమార్చిందీ పలువురు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. కీలకమైన ఖేర్సన్‌ ప్రాంతానికి రష్యా సేనలు సాధ్యమైనంత త్వరగా రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నట్లు ఆ దేశ అనుకూల వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఆ నగరంపై రష్యా తన దూకుడు పెంచుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖేర్సన్‌ నగరం ఇప్పటికే తమ వశమైందని రష్యా నియమించిన అధికారి ఒకరు తెలిపారు. రష్యా ఆక్రమణను వ్యతిరేకిస్తూ అక్కడ పలువురు ప్రజలు వీధుల్లో నిరసన తెలిపారు.

కూటమిపై ఫిన్లాండ్‌, స్వీడన్‌ ఆసక్తి
ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో)లో ఉక్రెయిన్‌ చేరాలన్న ప్రయత్నం రష్యా ప్రధాన ఆగ్రహానికి కారణం కాగా తాజాగా ఫిన్లాండ్‌ ఆ కూటమిలో సభ్యత్వానికి మొగ్గు చూపడం గమనార్హం. దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న తటస్థ వైఖరిని విడనాడి, ఎలాంటి కాలహరణం లేకుండా ఈ పని పూర్తిచేయాలని ఆ దేశాధినేతలు నిర్ణయించారు. రష్యాను ఎదుర్కొనేలా పాశ్చాత్య దేశాలతో కలవాలని ఫిన్లాండ్‌ నిర్ణయించుకుంది. ఆ దేశానికి పొరుగున ఉండే స్వీడన్‌ కూడా కొద్దిరోజుల్లోనే ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకోనుంది. నాటోలో ఫిన్లాండ్‌ చేరితే అది రష్యా-ఫిన్లాండ్‌ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని పుతిన్‌ సర్కారు హెచ్చరించింది. రష్యాతో ఫిన్లాండ్‌కు 1,340 కి.మీ. సరిహద్దు ఉంది.

చర్చించనున్న జి-7 విదేశాంగ మంత్రులు
బెర్లిన్‌: ప్రస్తుతం ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధం గురించి జి-7 దేశాల విదేశాంగ మంత్రులు చర్చించనున్నారు. ఉత్తర జర్మనీలో దీని నిమిత్తం వారంతా సమావేశమయ్యారు. ఇది మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఉక్రెయిన్‌, మాల్దోవా మంత్రులనూ దీనికి ఆహ్వానించారు. మరోవైపు.. గోధుమలు, ఇతర ఆహారధాన్యాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి కావడంలో ఉక్రెయిన్‌కు సహకరించాలని ఐరోపా కమిషన్‌ ప్రతిపాదించింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాటిని తరలించేలా చూడాలని భావిస్తోంది. మూడు నెలల్లోగా 2 కోట్ల టన్నుల సరకును ఉక్రెయిన్‌ నుంచి తరలించాల్సి ఉందని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని