కోలుకొని రెండేళ్లయినా తొలగని కొవిడ్‌ పీడ

ఆరోగ్యంపై కరోనా మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావాల గురించి తాజా అధ్యయనమొకటి చేదు వాస్తవాలను బయటపెట్టింది. కొవిడ్‌తో ఆసుపత్రిపాలై కోలుకున్నవారిలో సగానికి పైగా వ్యక్తులు.. రెండేళ్ల తర్వాత కూడా అలసట, కండరాల బలహీనత వంటి ఏదో ఒక కరోనా లక్షణంతో బాధపడుతున్నట్లు నిర్ధారించింది.

Published : 13 May 2022 06:11 IST

బీజింగ్‌: ఆరోగ్యంపై కరోనా మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావాల గురించి తాజా అధ్యయనమొకటి చేదు వాస్తవాలను బయటపెట్టింది. కొవిడ్‌తో ఆసుపత్రిపాలై కోలుకున్నవారిలో సగానికి పైగా వ్యక్తులు.. రెండేళ్ల తర్వాత కూడా అలసట, కండరాల బలహీనత వంటి ఏదో ఒక కరోనా లక్షణంతో బాధపడుతున్నట్లు నిర్ధారించింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వారి జీవన నాణ్యత దెబ్బతింటున్నట్లు తెలిపింది. చైనాలో కొవిడ్‌ మొదటి ఉద్ధృతి సమయంలో వుహాన్‌లోని జిన్‌ యిన్‌-టాన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందిన 1,192 మందిపై ఈ సుదీర్ఘ అధ్యయనాన్ని నిర్వహించారు. వారందరి సగటు వయసు 57 ఏళ్లు.

అధ్యయనంలో గుర్తించిన ముఖ్యాంశాలివీ..
* కరోనా నుంచి కోలుకున్న 6 నెలల తర్వాత కూడా 68% మందిని అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల బలహీనత, నిద్రలేమి వంటి ఏదో ఒక ఇబ్బంది పీడిస్తూనే ఉంది.
* వైరస్‌ సోకిన రెండేళ్ల తర్వాత పరిశీలిస్తే.. 55 శాతం మంది బాధితుల్లో కనీసం ఒక కొవిడ్‌ లక్షణం కనిపించింది.
*అత్యధికులు తాము అలసట, కండరాల బలహీనతతో బాధపడినట్లు తెలిపారు. ఈ రెండు లక్షణాలు.. మహమ్మారి నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత 52% మందిలో, రెండేళ్ల తర్వాత 30% మందిలో కనిపించాయి.
* తొలిసారి కరోనా బారిన పడినప్పుడు వ్యాధి తీవ్రత ఎంతగా ఉందన్నదానితో సంబంధం లేకుండా.. 89% మంది రెండేళ్లలో తిరిగి తమ ఉద్యోగాల్లో/పనుల్లో చేరారు.
* మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో 31% మంది రెండేళ్ల తర్వాత కూడా నిద్రలేమి వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
*సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. కరోనా బారినపడి కోలుకున్న వారిలో కళ్లు తిరగడం, గుండెదడ, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి ఇబ్బందులూ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని