గర్భిణులు, చిన్నారుల్లో శిలీంధ్రనాశని ఆనవాళ్లు

సాధారణంగా ఉపయోగించే శిలీంధ్రనాశని (ఫంగిసైడ్‌) అజోక్సిస్ట్రోబిన్‌ (ఏజడ్‌)ను గర్భిణులు, చిన్నారుల మూత్ర నమూనాల్లో గుర్తించినట్లు అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. మూడున్నరేళ్ల నుంచి

Published : 14 May 2022 05:15 IST

చాపెల్‌హిల్‌: సాధారణంగా ఉపయోగించే శిలీంధ్రనాశని (ఫంగిసైడ్‌) అజోక్సిస్ట్రోబిన్‌ (ఏజడ్‌)ను గర్భిణులు, చిన్నారుల మూత్ర నమూనాల్లో గుర్తించినట్లు అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. మూడున్నరేళ్ల నుంచి ఏడేళ్ల వయసు పిల్లల్లో దీని ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది తల్లి ద్వారా గర్భస్థ పిండంలోకీ ప్రవేశించే వీలున్నట్లు ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైందన్నారు. పిండంలోని మెదడుకూ అది పాకినట్లు తేలింది. దీనివల్ల కొన్ని కార్టికల్‌ న్యూరాన్లు చనిపోతున్నట్లు వెల్లడైంది. అమెరికాలోని నార్త్‌ కరోలైనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. గర్భిణులకు ప్రధానంగా ఆహారం ద్వారానే ఏజడ్‌ చేరుతోందని పరిశోధనలో పాలుపంచుకున్న మార్క్‌ జిల్కా పేర్కొన్నారు. మెదడు కణాలపై ఈ మందు చూపే ప్రభావంపై ఆయన కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఏజడ్‌ వల్ల జన్యు వ్యక్తీకరణల్లో మార్పులు సంభవిస్తుతున్నట్లు వెల్లడించారు. అవి మెదడులో ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తాయని తెలిపారు. ఆటిజమ్, వయసు మీదపడటం వల్ల విషయ గ్రహణ సామర్థ్యం లోపించినవారిలోనూ ఇలాంటి మార్పులు కనిపిస్తుంటాయని చెప్పారు. ఈ రసాయనం.. శరీరంలో ఫ్రీ ర్యాడికల్‌ ఉత్పత్తిని ప్రేరేపించి, నాడీ కణాల్లో కీలకమైన మైక్రోట్యూబ్యూల్స్‌ను విచ్ఛిన్నం చేస్తుందన్నారు. 1990ల నుంచి ఏజడ్, దానితో ముడిపడిన స్ట్రోబిలురిన్‌ తరగతి శిలీంధ్రనాశనులను వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారని చెప్పారు. క్రమంగా వాటి వాడకం పెరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. తల్లిపాల ద్వారా అవి శిశువులోకి చేరే ప్రమాదం ఉందని మూషికాలపై జరిగిన పరిశోధనలు సూచిస్తున్నాయన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని