ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆహార సంక్షోభం

ఉక్రెయిన్‌ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి కావాల్సిన ఆహార ధాన్యాలను రష్యా నిలువరిస్తుండడంపై జి-7 దేశాల కూటమి ఆందోళన వ్యక్తంచేసింది. అత్యవసర ప్రాతిపదికన నిల్వలను విడుదల చేసి, అక్కడి నుంచి రవాణాకు వీలు కల్పించని పక్షంలో ఆహార సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొంది. జర్మనీలోని వైసెన్‌హాస్‌లో మూడురోజులుగా జరుగుతున్న జి-7 దేశాధినేతల భేటీ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా జర్మనీ విదేశాంగ మంత్రి అనలీనా బేర్బాక్‌ మాట్లాడుతూ- ఈ యుద్ధంతో ప్రపంచ సంక్షోభం తలెత్తిందన్నారు. ప్రపంచంలో దాదాపు ఐదు కోట్ల మంది ప్రజలు..

Updated : 15 May 2022 06:13 IST

ఆపకపోతే 5 కోట్ల మందికి క్షుద్బాధ అనివార్యం
జి-7 శిఖరాగ్ర సమావేశంలో నేతల ఆందోళన
రష్యాకు సాయపడవద్దని చైనాకు సూచన
ఖర్కివ్‌ నుంచి పుతిన్‌ సేనల ఉపసంహరణ

వైసెన్‌హాస్‌ (జర్మనీ): ఉక్రెయిన్‌ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి కావాల్సిన ఆహార ధాన్యాలను రష్యా నిలువరిస్తుండడంపై జి-7 దేశాల కూటమి ఆందోళన వ్యక్తంచేసింది. అత్యవసర ప్రాతిపదికన నిల్వలను విడుదల చేసి, అక్కడి నుంచి రవాణాకు వీలు కల్పించని పక్షంలో ఆహార సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొంది. జర్మనీలోని వైసెన్‌హాస్‌లో మూడురోజులుగా జరుగుతున్న జి-7 దేశాధినేతల భేటీ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా జర్మనీ విదేశాంగ మంత్రి అనలీనా బేర్బాక్‌ మాట్లాడుతూ- ఈ యుద్ధంతో ప్రపంచ సంక్షోభం తలెత్తిందన్నారు. ప్రపంచంలో దాదాపు ఐదు కోట్ల మంది ప్రజలు.. రాబోయే నెలల్లో క్షుద్బాధ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రపంచంలో చాలా దేశాలకు ఉక్రెయిన్‌ ధాన్యాలే ఆధారమని, అవి అందని పక్షంలో ముఖ్యంగా ఆఫ్రికా, పశ్చిమాసియాలకు చెందినవారు ఆకలితో అలమటించాల్సి వస్తుందని వివరించారు. ప్రపంచంలో అత్యంత దుర్బల దేశాలకు మానవతా సాయాన్ని అందిస్తామని ఈ కూటమి దేశాధినేతలు ప్రతినబూనారు. అవసరమైతే తమ దేశ నౌకల్ని ఉక్రెయిన్‌కు పంపించి, ఆహారధాన్యాల రవాణాకు సాయపడేందుకు సిద్ధమేనని కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ ప్రకటించారు. ఉక్రెయిన్‌ విషయంలో రష్యాకు సాయపడవద్దని చైనాకు జి-7 విజ్ఞప్తి చేసింది. రష్యా చర్యల్ని సమర్థించవద్దనీ, అంతర్జాతీయ ఆంక్షల్ని నీరుగార్చవద్దని సూచించింది. రష్యా దురాక్రమణను సమర్థించే తప్పుడు సమాచార వ్యాప్తికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌కు చెందిన భూభాగాలను రష్యా తిరిగి ఆ దేశానికి అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. సైనిక చర్య ద్వారా మార్చాలనుకున్న సరిహద్దుల్ని తాము ఎప్పటికీ గుర్తించేది లేదంది. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ ఈ కూటమిలో ఉన్నాయి.   

ఒప్పందమే పుతిన్‌కు శరణ్యం: జర్మనీ

యుద్ధ లక్ష్యాన్ని చేరుకోవడంలో పుతిన్‌ వైఫల్యం చెందారని జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. అఫ్గాన్‌లో దశాబ్దానికి పైగా సాగించిన పోరుకంటే ఎక్కువమంది సైనికుల్ని ఈ యుద్ధంలో రష్యా కోల్పోయిందని చెప్పారు. ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడమే ఏకైక మార్గమనే విషయాన్ని పుతిన్‌ నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.

ఎంతకాలం సాగుతుందో ఎవరూ ఊహించలేరు: జెలెన్‌స్కీ

కీవ్‌: కొన్నివారాల పోరాటం తర్వాత ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖర్కివ్‌ నుంచి రష్యా సైనికుల ఉపసంహరణ మొదలైంది. సరఫరా మార్గాలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు శనివారం వెల్లడించాయి. తూర్పున ఉన్న దొనెట్స్క్‌ ప్రాంతంపై మాత్రం అన్ని రూపాల్లో దాడులు చేస్తోందని తెలిపాయి. ఖర్కివ్‌ను ఉక్రెయిన్‌ తిరిగి గెలుచుకున్నట్లేనని వాషింగ్టన్‌కు చెందిన యుద్ధ అధ్యయన సంస్థ తెలిపింది. ఆ మేరకు రష్యా సైనికుల్ని ఉక్రెయిన్‌ తరిమికొట్టిందని ప్రకటించింది. యుద్ధం ఎంతకాలం సాగుతుందో ఈరోజు ఎవరూ ఊహించలేరని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శుక్రవారం రాత్రి పొద్దుపోయాక వీడియో సందేశంలో చెప్పారు. చొరబాటుదారుల్ని తరిమికొట్టేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఐరోపా నుంచి అందే సాయంపైనే యుద్ధ ఫలితం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఒకరోజు వ్యవధిలో ఆరు పట్టణాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. యుద్ధంలో ఇక దీర్ఘకాలిక దశలోకి అడుగుపెడుతున్నామని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ చెప్పారు.

అమెరికా సెనేటర్ల సంఘీభావం

ఉక్రెయిన్‌కు సంఘీభావం ప్రకటించడానికి రిపబ్లికన్‌ నేత మిచ్‌ మికానెల్‌ నేతృత్వంలోని అమెరికా సెనేటర్ల బృందం ఆకస్మికంగా కీవ్‌కు వచ్చింది.  జెలెన్‌స్కీతో భేటీ అయింది. భారీగా సాయం అందించేందుకు అమెరికా నిర్ణయించిన నేపథ్యంలో ఈ పర్యటన చోటు చేసుకుంది.

రైలు వ్యాగన్లలో రష్యా సైనికుల మృతదేహాలు

యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యా సైనికుల మృతదేహాలను ఉక్రెయిన్‌ సైనికులు శీతలీకృత రైలు వ్యాగన్లలో భద్రపరుస్తున్నారు. కీవ్‌ సహా పలుచోట్ల ఇలా కొన్ని వందలమంది మృతదేహాలను ఉంచామనీ, రష్యాకు వాటిని అప్పగించడానికి సిద్ధమేనని కర్నల్‌ వొలొదిమిర్‌ లయామ్జిన్‌ తెలిపారు. దీనికి కావాల్సిన ఒప్పందం ఇంకా కుదరలేదన్నారు. బిలోహొరివ్కాలో నదిని దాటేందుకు రష్యా సైనికులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక వంతెనపై ఉక్రెయిన్‌ నిర్వహించి దాడిలో పుతిన్‌ సేనలు బాగా దెబ్బతిన్నాయని బ్రిటన్‌ ప్రకటించింది. ఒకేసారి వంతెన దాటాలని రష్యా సైనికులు ప్రయత్నించడానికి కారణం వారిపై ఉన్న ఒత్తిడేనని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని