అమెరికాలో జాతి విద్వేషం

అమెరికాలో సైనికుడి మాదిరి దుస్తులు ధరించి, శిరస్త్రాణానికి కెమెరా అమర్చుకుని ఓ సూపర్‌మార్కెట్లో ప్రవేశించిన వ్యక్తి శనివారం ఎడాపెడా కాల్పులు జరుపుతూ 10 మంది ప్రాణాలు తీశాడు. జాతి విద్వేషంతోనే ఈ ఘటన జరిగిందనీ, మొత్తం 11 మంది...

Published : 16 May 2022 06:16 IST

నల్ల జాతీయులే లక్ష్యంగా సూపర్‌ మార్కెట్లో కాల్పులు  
బఫెలో నగరంలో ఘటన... 10 మంది మృతి

బఫెలో: అమెరికాలో సైనికుడి మాదిరి దుస్తులు ధరించి, శిరస్త్రాణానికి కెమెరా అమర్చుకుని ఓ సూపర్‌మార్కెట్లో ప్రవేశించిన వ్యక్తి శనివారం ఎడాపెడా కాల్పులు జరుపుతూ 10 మంది ప్రాణాలు తీశాడు. జాతి విద్వేషంతోనే ఈ ఘటన జరిగిందనీ, మొత్తం 11 మంది నల్ల జాతీయుల్ని, ఇద్దరు శ్వేత జాతీయుల్ని 18 ఏళ్ల నిందితుడు కాల్చి, తర్వాత తమకు లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. నిందితుడు న్యూయార్క్‌లోని కొంక్లిన్‌కు చెందిన పేటన్‌ జెండ్రాన్‌గా గుర్తించినట్లు చెప్పారు. కొనుగోలుదారుల్లో ప్రధానంగా నల్ల జాతీయులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడమే కాకుండా రెండు నిమిషాల పాటు ఆ ఘటనను ‘ట్విచ్‌’ వేదిక ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చేశాడనీ, ఆ తర్వాత ఆ సంస్థ దానిని నిలిపివేసిందని వివరించారు. అమాయక ప్రజలపై విరుచుకుపడి ప్రాణాలు బలి తీసుకున్న నిందితుడు జీవితాంతం కటకటాల వెనక ఉండడం ఖాయమని గవర్నర్‌ కాథే హోకల్‌ చెప్పారు. కాల్పులు జరపడానికి 320 కి.మీ. దూరం ప్రయాణించి, బఫెలోకు ఎందుకు వచ్చాడనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. సూపర్‌మార్కెట్లో భద్రత విధుల్లో ఉన్న విశ్రాంత పోలీసు అధికారి ఒకరు ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ పేటన్‌పై కాల్పులు జరిపారు. నిందితుడు తూటా రక్షక కవచాన్ని ధరించడంతో ఉపయోగం కనిపించలేదు. కాల్పుల్లో ఆ విశ్రాంత అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులో తీసుకున్నారు. ఆ సమయంలో నిందితుడు తన మెడకు తుపాకీని గురిపెట్టుకోగా పోలీసులు మాట్లాడి, కాల్చుకోకుండా నిలువరించారు. గత ఏడాది మార్చిలో కొలరాడోలో సూపర్‌ మార్కెట్‌పై జరిగిన కాల్పుల్లోనూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని