కరోనా కట్టడికి ‘జీరో-కొవిడ్‌’ సరికాదు!

ఒమిక్రాన్‌ వేరియంట్‌కు తీవ్ర సాంక్రమిక స్వభావం ఉన్న నేపథ్యంలో.. కరోనావైరస్‌ కట్టడికి చైనా అవలంబిస్తున్న కఠిన జీరో-కొవిడ్‌ విధానం సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అభిప్రాయపడింది. అయితే ఎలాంటి విధానాలను

Published : 18 May 2022 05:23 IST

చైనా విధానంపై డబ్ల్యూహెచ్‌వో సూచన

జెనీవా: ఒమిక్రాన్‌ వేరియంట్‌కు తీవ్ర సాంక్రమిక స్వభావం ఉన్న నేపథ్యంలో.. కరోనావైరస్‌ కట్టడికి చైనా అవలంబిస్తున్న కఠిన జీరో-కొవిడ్‌ విధానం సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అభిప్రాయపడింది. అయితే ఎలాంటి విధానాలను పాటించాలన్నది ఆయా దేశాలే నిర్ణయించుకుంటాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘వైరస్‌ గురించి మరింత మెరుగ్గా అవగతమైంది. కట్టడికి వ్యాక్సిన్లు సహా మెరుగైన సాధనాలున్నాయి. అందువల్ల కొవిడ్‌ నియంత్రణకు గాను.. మహమ్మారి ప్రారంభంలో చేపట్టిన కంటే భిన్నమైన విధానాలను అనుసరించాలి’’ అని పేర్కొన్నారు. 2019లో వుహాన్‌లో గుర్తించిన కరోనా వైరస్‌ గణనీయ మార్పులకు లోనైందన్నారు. ఒక్క కొత్త కేసూ నమోదు కాకూడదన్న లక్ష్యంతో కొవిడ్‌ కట్టడికి చైనా అవలంబిస్తున్న విధానంపై పదేపదే సూచనలు చేసినట్లు చెప్పారు. ఉత్తర కొరియా, ఎరిత్రియాల్లోనూ వైరస్‌ విజృంభిస్తుండటం పట్ల డబ్ల్యూహెచ్‌వో ఆందోళన చెందుతోందని, అక్కడి పరిస్థితులు, మహమ్మారి ముప్పుపై సూచనలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్‌ ఉద్ధృతిపై మరింత డేటా కోరినప్పటికీ ఉత్తర కొరియా నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదన్నారు. రెండు దేశాలకూ టీకాలు, ఔషధాలు, పరీక్షలకు సంబంధించిన సాంకేతిక సహకారం వంటివి అందించడానికి డబ్ల్యూహెచ్‌వో సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ దేశాల నుంచి స్పందన రాలేదని పేర్కొన్నారు. కొవిడ్‌ విజృంభణతో చైనా ఇటీవల ఇబ్బందులు పడుతున్న విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో గుర్తించినట్లు అత్యవసర సేవల విభాగం అధిపతి డాక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ తెలిపారు. ఏ దేశం నుంచైనా మహమ్మారిని పారదోలాలంటే వైరస్‌ అణచివేత విధానమొక్కటే సరైన మార్గం కాదని అన్నారు. ఉత్తర కొరియాలో పరీక్షలకు చిక్కకుండా వైరస్‌ వ్యాప్తి చెందితే అది కొత్త వేరియంట్లకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయా దేశాలు సహాయాన్ని అంగీకరిస్తే తప్ప డబ్ల్యూహెచ్‌వో నిశ్చేష్టంగా ఉండిపోవాల్సిందేనని అన్నారు.


చైనాలో పెరుగుతున్న అసంతృప్తి

బీజింగ్‌: కరోనా వైరస్‌ కట్టడికి చైనా అవలంబిస్తున్న ‘జీరో-కొవిడ్‌’ విధానంపై దేశవ్యాప్తంగా అసంతృప్తి పెరుగుతోంది. విద్యార్థుల్లో నిరసన వ్యక్తమవుతోంది. బీజింగ్‌ యూనివర్సిటీ, పెకింగ్‌ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఇటీవల నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో కఠిన ఆంక్షలు విధించాలన్న నిర్ణయం నుంచి అధికారులు వెనక్కి తగ్గారు. షాంఘైలో స్థానికులు పోలీసులు, వాలంటీర్లతోనూ ఘర్షణలకు దిగుతున్నారు. ఈ నగరమంతటా కఠిన లాక్‌డౌన్‌ అమలు, బీజింగ్‌లో ఆంక్షలు పెంచడంతో ఆర్థికంగాను, మానవ వనరుల పరంగానూ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ ఆంక్షల ఫలితంగా ఇతర దేశాల కంటే మరణాలను నిలువరించగలిగినట్లు అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని