Updated : 18 May 2022 06:04 IST

Green Card: 6 నెలల్లోగా గ్రీన్‌కార్డు దరఖాస్తుల పరిష్కారం

ప్రతిపాదనకు అమెరికా అధ్యక్ష సలహా సంఘం ఏకగ్రీవ ఆమోదం

వాషింగ్టన్‌: అమెరికన్‌ గ్రీన్‌కార్డుల కోసం కొన్ని దశాబ్దాలుగా వేచిచూస్తున్న భారతీయులకు శుభవార్త. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ 6 నెలల్లోగా పరిష్కరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించే ప్రతిపాదనకు అధ్యక్ష సలహా సంఘం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు అనుమతి కల్పించేదే గ్రీన్‌కార్డు. హెచ్‌-1బి వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ వృత్తినిపుణులు అక్కడి ఇమ్మిగ్రేషన్‌ విధానం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7% మాత్రమే కేటాయించాలన్నది అక్కడున్న ప్రస్తుత విధానం. అధ్యక్ష సలహా సంఘం ప్రతిపాదనలను ఆమోదం కోసం శ్వేతసౌధానికి పంపనున్నారు. ప్రెసిడెంట్స్‌ అడ్వైజరీ కమిషన్‌ ఆన్‌ ఏషియన్‌ అమెరికన్స్‌, నేటివ్‌ హవాయియన్స్‌, అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌ (పీఏసీఏఏఎన్‌హెచ్‌పీఐ) సమావేశంలో భారత అమెరికన్‌ నాయకుడైన అజయ్‌ జైన్‌ భుటోరియా ఇటీవల ఈ అంశాన్ని ప్రస్తావించగా, మొత్తం 25 మంది కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. గ్రీన్‌కార్డు దరఖాస్తులకు పట్టే సమయాన్ని తగ్గించడం, అనుమతుల విధానాన్ని ఆటోమేట్‌ చేయడం, తద్వారా దరఖాస్తు అందిన ఆరు నెలల్లోగా నిర్ణయాన్ని వెల్లడించడం లాంటివి జరగాలని ఈ కొత్త ప్రతిపాదనలు సూచిస్తున్నాయి. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల ఇంటర్వ్యూల కోసం అధికారులను అదనంగా నియమించుకోవాలని జాతీయ వీసా కేంద్రానికి కమిషన్‌ సూచించింది. 2022 ఏప్రిల్‌లో ఈ ఇంటర్వ్యూల సామర్థ్యం 32,439 ఉండగా, 2023 ఏప్రిల్‌ నాటికి దాన్ని 150 శాతం పెంచాలని తెలిపింది. ఆ తర్వాతి నుంచి గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూలు, వీసా ప్రాసెసింగ్‌ సమయం గరిష్ఠంగా ఆరు నెలలు దాటకూడదంది. 2021లో మొత్తం 2,26,000 గ్రీన్‌కార్డులు అందుబాటులో ఉండగా, కేవలం 65,452 ఫ్యామిలీ ప్రిఫరెన్స్‌ గ్రీన్‌కార్డులనే జారీ చేశారు. దీనివల్ల కార్డులు వృథాగా మిగిలిపోతుండగా, చాలా కుటుంబాలు వేర్వేరుగా ఉండాల్సి వస్తోంది. ఏప్రిల్‌ నాటికి 4,21,458 ఇంటర్వ్యూలు పెండింగ్‌లో ఉన్నాయని భారతీయ అమెరికన్‌ అజయ్‌ జైన్‌ భుటోరియా చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థ ఏమీ మారలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు దరఖాస్తులు, వర్క్‌ పర్మిట్‌ దరఖాస్తులు, తాత్కాలిక ఇమ్మిగ్రేషన్‌ పొడిగింపు విజ్ఞాపనలను త్వరగా పరిష్కరించాలంటే, 2,500 డాలర్లు అదనంగా చెల్లించాలి. అలా చెల్లిస్తే 45 రోజుల్లోగా దరఖాస్తు విషయం తేలిపోతుంది.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని