Published : 20 May 2022 05:22 IST

అదృష్టమా, జన్యుబలమా?

కొవిడ్‌ సోకని వారిపై శాస్త్రవేత్తల పరిశోధనలు

లండన్‌: ఎప్పటికప్పుడు కొత్త కరోనా వైరస్‌ వేరియంట్లు పుట్టుకొస్తూ దశల వారీగా కొవిడ్‌ విజృంభిస్తున్నా కొంత మంది ఇంతవరకు ఆ మహమ్మారి బారిన పడకుండా తప్పించుకోవడానికి కారణాలేమిటో శాస్త్రజ్ఞులు ఆరా తీస్తున్నారు. బ్రిటన్‌లో 60 శాతం మందికిపైగా కనీసం ఒక్కసారైనా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారే. కొవిడ్‌ సోకినా రోగ లక్షణాలు కనిపించని వారు మరికొందరు ఉండవచ్చు. వారికి సహజంగానే కొవిడ్‌ను తట్టుకునే శక్తి ఏర్పడి ఉంటుంది. ఈ రెండు వర్గాలకు భిన్నంగా అసలు కరోనా వైరస్‌ బారిన పడనివారు గణనీయ సంఖ్యలో ఉన్నారని అంచనా. వారికి రోగాన్ని తట్టుకునే మానవాతీత శక్తులు ఉన్నాయా లేక అదృష్టవశాత్తు రోగం సోకకుండా బయటపడ్డారా, లేదా మరేదైనా అంతుచిక్కని శాస్త్రీయ కారణం ఉందా అనే ప్రశ్నలకు శాస్త్రవేత్తలు జవాబులు కనుగొనే యత్నంలో ఉన్నారు. బహుశా వారికి అదృష్టం, శాస్త్రీయ కారణాలు రెండూ కలగలసి బలీయ రోగ నిరోధక శక్తి ఏర్పడి ఉండవచ్చు. లేదా ఇంతవరకు అసలు వైరస్‌తో సంపర్కమే ఏర్పడి ఉండకపోవచ్చు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకొని కరోనా వైరస్‌ నుంచి వారు స్వీయ రక్షణ వలయాన్ని ఏర్పరచుకుని ఉండవచ్చు. ఏదేమైనా చాలామంది వైరస్‌ బారిన పడకుండా తప్పించుకోవడం అద్భుతమేనని పరిశోధకులు అంటున్నారు.

 టీకాలా... జన్యువులా?

  కొవిడ్‌ టీకాలు తీసుకున్నవారు తీవ్ర వ్యాధి బారిన పడే ప్రమాదం బాగా తగ్గిపోతుంది. కుటుంబంలో వ్యాధిని వ్యాపింపజేసే ప్రమాదమూ సగానికి సగం తగ్గుతుందని పలు అధ్యయనాలు తేల్చాయి. అయితే, ఈ అధ్యయనాలు ఒమిక్రాన్‌ విజృంభణకు ముందు చేసినవి. ఒమిక్రాన్‌ వైరస్‌పై టీకాల ప్రభావం ఎంత అనేది ఇంకా ఇతమిత్థంగా తేలలేదు. కొందరి నాసికలో, శ్వాస నాళాల్లో వైరస్‌ను స్వీకరించే రిసెప్టార్లు ఉండకపోవచ్చుననీ, అందువల్ల శరీరంలో వైరస్‌ ప్రవేశించినా రోగం కలిగించలేకపోవచ్చని శాస్త్రవేత్తలు సూత్రీకరిస్తునారు. కొందరు దాతల నాసికా కణజాలాన్ని ప్లాస్టిక్‌ పాత్రల్లో ఉంచి కరోనా వైరస్‌కు గురి చేసినప్పుడు, ఒక దాత కణజాలం వైరస్‌ను సమర్థంగా అడ్డుకున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. కాబట్టి వైరస్‌ దేహంలో ప్రవేశించాక రోగ నిరోధక యంత్రాంగం దాన్ని ఎదుర్కొనే తీరు వివిధ వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుందని తేలుతోంది. 

అంటువ్యాధిని తట్టుకునే శక్తి మన వయసు, జన్యు నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది. కొవిడ్‌ వల్ల తీవ్ర రోగలక్షణాలకు గురైనవారిలో 20 శాతంమంది జన్యు కారణాల వల్లే వ్యాధి తీవ్రతకు లోనయ్యారని అధ్యయనాలు తేల్చాయి. కొందరి జన్యు నిర్మాణం కొవిడ్‌కు దారితీస్తే, మరికొందరి జన్యుక్రమం కొవిడ్‌ను ప్రతిఘటించడానికి తోడ్పడి ఉండవచ్చు. కరోనా వైరస్‌లలో ఏడు రకాలు ఉన్నాయి. వాటిలో నాలుగు.. జలుబును కలిగిస్తే, మిగిలిన మూడు సార్స్, మెర్స్, కొవిడ్‌ వ్యాధులను కలిగిస్తాయి. వీటిలో కొవిడ్‌ మినహా మిగిలిన కరోనా వైరస్‌లకు గతంలో గురైన వ్యక్తుల్లో కొవిడ్‌ను ఎదుర్కొనే శక్తీ ఉత్పన్నమై ఉండవచ్చు.

ఆరోగ్యవంతమైన జీవన శైలితో రక్షణ

 విటమిన్‌ డి లోపం, నిద్రలేమి కూడా కొవిడ్‌ తేలిగ్గా సోకడానికి కారణమవుతాయి. ఇటువంటి లోపాలకు తావు లేని ఆరోగ్యవంతమైన జీవన శైలి కొవిడ్‌ నుంచి రక్షణ ఇస్తుంది. అది కూడా కొవిడ్‌ సోకనివారి విజయ రహస్యమై ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, శరీరంలో కొవిడ్‌ను తట్టుకునే శక్తి ఎంత కాలం ఉంటుందనేది ఆసక్తికరమైన ప్రశ్న. 2020కి ముందు జలుబు, ఫ్లూ జ్వరాలను కలిగించిన కరోనా వైరస్‌లు 12 నెలల తరవాత మళ్లీ వ్యాధిని కలిగించిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ కొవిడ్‌ కారక సార్స్‌ కోవ్‌ 2 వైరస్‌ బారిన పడి కూడా కొవిడ్‌ 19 వ్యాధి నుంచి తప్పించుకోగలిగారంటే అది అదృష్టం కావచ్చు లేదా జన్యు బలమూ కావచ్చు. ఏదిఏమైనా నిరంతరం కొవిడ్‌ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం వివేకవంతమైన చర్య అవుతుందని పరిశోధకులు అంటున్నారు.  

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని