Published : 21 May 2022 05:09 IST

లుహాన్స్క్‌పై భీకర దాడులు

 12 మంది పౌరుల మృతి 

తూర్పు ఉక్రెయిన్‌ లక్ష్యంగా రష్యా పావులు

మేరియుపొల్‌ నుంచి తరలివెళ్తున్న బలగాలు 

యుద్ధ వ్యూహానికి మాస్కో పదును

కీవ్‌: పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని శుక్రవారం భీకరంగా విరుచుకుపడ్డాయి. ఈ ధాటికి లిసిచాన్స్క్, సెవెరోడోనెట్స్క్‌ నగరాల్లో మొత్తం 12 మంది మరణించారు. మేరియుపొల్‌లోని ఉక్కు కర్మాగారం హస్తగతం కావడంతో, మాస్కో సేనలు ఆ తీర నగరం నుంచి మరో ప్రాంతానికి బయల్దేరి వెళ్తున్నాయి. తాజా పరిణామాలతో రష్యా తన యుద్ధ ప్రణాళికకు పదును పెడుతోందని... కొద్దిరోజుల్లో తూర్పు ఉక్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేయనుందని బ్రిటన్‌ రక్షణశాఖ ఉక్రెయిన్‌ను అప్రమత్తం చేసింది. తూర్పు ప్రాంతాల్లో రష్యా సేనలను తమ బలగాలు సమర్థంగా తిప్పి కొడుతున్నట్టు ఉక్రెయిన్‌ వర్గాలు వెల్లడించాయి. డాన్‌బాస్, చెర్నిహైవ్‌ తదితర ప్రాంతాల్లో మాస్కో బలగాలు తీవ్ర దాడులకు పాల్పడుతున్నాయని... సామాన్యుల ఇళ్లను, వ్యాపారాలను, పబ్లిక్‌ స్థలాలను ధ్వంసం చేస్తున్నాయని అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా మారణహోమానికి పాల్పడుతోందంటూ జాతిని ఉద్దేశించి ఆయన తాజాగా వీడియో సందేశమిచ్చారు.

యుద్ధ ఖైదీలుగా గుర్తింపు..

అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారం వద్ద ఇప్పటివరకూ 1,700 మందికి పైగా ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోయినట్టు రష్యా అధికారులు తెలిపారు. వీరిని యుద్ధ ఖైదీలుగా పరిగణిస్తున్నట్టు వెల్లడించారు. రష్యా చెరలో ఉన్న తమ సైనికుల్ని రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం తీసుకుంటానని జెలెన్‌స్కీ చెప్పారు. వీరి హక్కులను కాపాడేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు రెడ్‌క్రాస్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వర్గాలు తెలిపాయి. ‘అన్ని పక్షాల యుద్ధ ఖైదీలను’ తాము సందర్శిస్తున్నట్టు రెడ్‌క్రాస్‌ శుక్రవారం వెల్లడించింది.

 నాటో సభ్యత్వంపై టర్కీ పేచీ

స్వీడన్, ఫిన్లాండ్‌లు నాటోలో చేరే విషయమై టర్కీ మరోసారి అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ ఉభయ దేశాలు ఉగ్రవాద సంస్థలకు ఊతమిస్తున్నాయని, వాటికి నాటో సభ్యత్వం ఇవ్వకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తామని టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిపి ఎర్డోగన్‌ పునరుద్ఘాటించారు. పోలండ్, బల్గేరియాలకు ఇంధన సరఫరాను ఇప్పటికే నిలిపివేసిన రష్యా- త్వరలోనే ఫిన్లాండ్‌కూ సహజవాయు సరఫరాను కట్‌ చేయనుంది.

 ఉక్రెయిన్‌కు జి-7,  అమెరికాల భూరి సాయం..

యుద్ధం కారణంగా వారాల తరబడి అల్లాడుతున్న ఉక్రెయిన్‌కు జి-7 దేశాల కూటమి సుమారు రూ.1.54 లక్షల కోట్ల (19.8 బిలియన్‌ డాలర్ల) ఆర్థిక సాయం అందజేయనుంది. అమెరికా కూడా భూరి తోడ్పాటు అందించనుంది. ఉక్రెయిన్‌కు సుమారు రూ.3.11 లక్షల కోట్ల (40 బిలియన్‌ డాలర్ల) విలువైన సైనిక, ఆర్థిక, ఆహార ప్యాకేజీని అందించే బిల్లును... అధ్యక్షుడు బైడెన్‌ ఆమోదం నిమిత్తం సెనేట్‌ పంపింది. ఇది కాకుండా, సుమారుగా మరో రూ.778 కోట్ల (100 మిలియన్‌ డాలర్ల) విలువైన సైనిక సామగ్రిని కూడా ఉక్రెయిన్‌కు అందజేయనున్నట్టు అమెరికా ప్రకటించింది.

 పోలండ్‌-అమెరికా సైనిక విన్యాసాలు

తాజా పరిణామాల క్రమంలో- అమెరికా, పోలండ్‌లు సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి! ‘డిఫెండర్‌-యూరప్‌ 22’ పేరుతో నిర్వహించిన ఈ కసరత్తును పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ డుడాతో పాటు... పోలండ్‌లో అమెరికా రాయబారి తదితరులు వీక్షించారు. నాటో సైనిక సహకారం, సామర్థ్యాన్ని ఈ విన్యాసాలు చాటిచెప్పాయని డుడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని