తైవాన్‌ జోలికొస్తే ఖబడ్దార్‌!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చైనాకు తాజాగా ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. తైవాన్‌ను ఆక్రమించేందుకు డ్రాగన్‌ దేశం ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని.. సైనికపరంగా జోక్యం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా

Updated : 24 May 2022 05:14 IST

మేం సైన్యాన్ని రంగంలోకి దించుతాం
చైనాకు బైడెన్‌ ఘాటు హెచ్చరిక

టోక్యో, బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చైనాకు తాజాగా ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. తైవాన్‌ను ఆక్రమించేందుకు డ్రాగన్‌ దేశం ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని.. సైనికపరంగా జోక్యం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. తైవాన్‌ను కాపాడాల్సిన బాధ్యత తమపై ప్రస్తుతం మరింతగా పెరిగిందని పేర్కొన్నారు. జపాన్‌ రాజధాని టోక్యోలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. ‘తైవాన్‌పై చైనా ఆక్రమణకు దిగితే.. మీరు సైన్యాన్ని రంగంలోకి దింపుతారా?’ అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ‘అవును’ అని బైడెన్‌ సమాధానమిచ్చారు. అలా సహాయం చేస్తామంటూ తైవాన్‌కు తాము మాటిచ్చినట్లు చెప్పారు. ‘‘ఒకవేళ తైవాన్‌కు వ్యతిరేకంగా చైనా బలప్రయోగానికి పూనుకుంటే అది ఎంతమాత్రమూ సముచితం కాదు. ప్రాంతీయ స్థిరత్వాన్నీ ఆ చర్య దెబ్బతీస్తుంది. ఉక్రెయిన్‌ తరహా పరిస్థితులే ఇక్కడా తలెత్తుతాయి. తైవాన్‌ను బలప్రయోగం ద్వారా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తుందని నేనైతే అనుకోవడం లేదు. అలాంటి చర్యలకు దిగకుండా డ్రాగన్‌ను అడ్డుకోవడం చాలా ముఖ్యం’’ అని బైడెన్‌ పేర్కొన్నారు.

మండిపడ్డ చైనా

బైడెన్‌ తాజా వ్యాఖ్యలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌ తమ దేశం నుంచి విడదీయలేని భాగమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో విదేశాల జోక్యం అనవసరమని పేర్కొంది. తమ దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతా ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ ఉద్ఘాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని