Published : 24 May 2022 04:53 IST

తూర్పు ఉక్రెయిన్‌పై బాంబు గర్జన

రష్యా చర్యల్ని ఖండించిన జపాన్‌, అమెరికా
పుతిన్‌ను ఇరకాటంలో పెట్టేలా దౌత్యవేత్త రాజీనామా
యుద్ధం అనేక మందికి ఇష్టం లేదని వెల్లడి

కీవ్‌: పారిశ్రామిక కేంద్రమైన తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల మోత మోగిస్తోంది. మేరియుపొల్‌ స్వాధీనం తర్వాత అటు వైపుగా పుతిన్‌ సేనలు దృష్టి సారించిన విషయం తెలిసిందే. డాన్‌బాస్‌ ప్రాంతంలో ఒక్కో పట్టణంపై పట్టు కోసం రెండు దేశాల సైనికులు పోరాడుతుండడంతో అనేకమంది పౌరులు తమ ఇళ్లను వీడి వెళ్తున్నారు. మూడు నెలలుగా సూర్యరశ్మిని చూడకపోవడంతో దాదాపు అంధకారం వచ్చినట్లయిందని బంకర్లలో తలదాచుకుని బయటకు వచ్చినవారు చెబుతున్నారు. తమ ఇళ్లన్నీ ధ్వంసమైపోయాయనీ, పరిస్థితి భయానకంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. లుహాన్స్క్‌ ప్రాంతంలో 24 గంటలపాటు ఏకధాటిగా కొనసాగిన బాంబుదాడుల వల్ల పలు నగరాలు మరింత దెబ్బతిన్నాయి. ఒక్క తూర్పు ప్రాంతాల్లోనే కాకుండా ఇతర చోట్లా బాంబుల వర్షాన్ని రష్యా కురిపించింది. డాన్‌బాస్‌ ప్రాంతంపై దూకుడును కాస్త తగ్గించి, లుహాన్స్క్‌ ప్రావిన్సులోని ప్రధాన నగరమైన సీవెరోదొనెట్స్క్‌పై దృష్టి సారించింది.

రోజూ 100 మందిని కోల్పోయాం: జెలెన్‌స్కీ

మార్షల్‌ లా అమలును ఉక్రెయిన్‌ పార్లమెంటు మూడోసారి పొడిగించింది. ఇది ఆగస్టు 23 వరకు అమల్లో ఉంటుంది. తూర్పు ప్రాంతాల్లో సాగిన యుద్ధంలో రోజుకు 50 నుంచి 100 మంది సైనికుల్ని కోల్పోయామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేస్తూనే తమవారెందరు చనిపోయారో తెలుసుకునేవాడినని చెప్పారు. 1914లో సరజెవోలో, 1938లో మ్యూనిచ్‌లో జరిగిన ఘటనలు ప్రపంచ యుద్ధాలకు ఎలా దారితీశాయో తాజా దురాక్రమణ కూడా అలాంటిదేనన్నారు. యుద్ధం మొదలయ్యాక తన భర్తను చూడడం ఎంతో కష్టతరమయిందని అధ్యక్షుని భార్య జెలెన్‌స్కా చెప్పారు. ఇతర ఉక్రెయిన్‌వాసుల మాదిరిగానే తమ కుటుంబమూ విడిపోయిందని అధికారిక టీవీ ముఖాముఖిలో తెలిపారు. బంధుమిత్రులను కలిసే అవకాశం కోసం నిరీక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ ముఖాముఖిలో జెలెన్‌స్కీ కూడా పాల్గొన్నారు.

బలంగా నిలిచిన జపాన్‌: బైడెన్‌

రష్యా తీరును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియొ కిషిద ఖండించారు. టోక్యోలో వారిద్దరూ భేటీ అయ్యారు. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా బలంగా నిలిచారంటూ జపాన్‌కు బైడెన్‌ కృతజ్ఞతలు తెలిపారు.


ఎటు చూసినా విధ్వంసమే

గ్నికీలలు, ఫిరంగుల మోతలతో తమ ఇళ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయని పలువురు ఉక్రెయిన్‌ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్తు, తాగునీరు లేకుండా బేస్‌మెంట్లలో వారాల తరబడి తలదాచుకోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఒక రైల్లో 270 మంది ప్రజలు పొక్రొస్స్క్‌ ప్రాంతం నుంచి తరలివెళ్లారు. తమ ఇళ్ల స్థానంలో శిథిలాల గుట్టలు, బూడిదే కనిపిస్తున్నాయని వారు కన్నీళ్లుపెట్టుకున్నారు. వీధుల్లో నడవడం ప్రాణాంతకంగా మారిందని చెప్పారు. భారీ పేలుళ్ల మధ్య.. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని రైలు వరకు రాగలిగామని తెలిపారు.


రష్యా సైనికుడికి జీవిత ఖైదు

ష్యా యుద్ధ ట్యాంకు సార్జంట్‌ షిషిమారిన్‌ (21)కు ఉక్రెయిన్‌ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. యుద్ధ నేరాలపై విచారణ చేపట్టిన తొలి కేసు ఇదే. ఫిబ్రవరి 28న చుపాఖివ్కాలో 62 ఏళ్ల సామాన్య పౌరుడిని కాల్చి చంపినందుకు ఉక్రెయిన్‌ ఈ శిక్ష విధించింది. తనను క్షమించాలని కమాండర్‌ చేసిన అభ్యర్థనను మృతుని భార్య తోసిపుచ్చారు. కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లనున్నట్లు హక్కుల సంఘాల నేతలు తెలిపారు. రష్యా 11 వేల కంటే ఎక్కువ యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపిస్తున్న ఉక్రెయిన్‌.. వాటిపై దర్యాప్తు చేస్తోంది. ఉక్రెయిన్‌ సైనికులపై తాము కూడా అభియోగాలు మోపుతామని రష్యా ప్రకటించింది. పట్టుబడిన సైనికుల్ని పరస్పరం అప్పగించుకునే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని రష్యా విదేశాంగ శాఖ ఉప మంత్రి ఆండ్రీ రుడెన్కో చెప్పారు.


ఐరాసలో రష్యా దౌత్యవేత్త రాజీనామా

జెనీవాలోని ఐరాస కార్యాలయంలో రష్యా దౌత్యవేత్తగా ఉన్న బోరిస్‌ బొండరెవ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఉక్రెయిన్‌పై పుతిన్‌ ప్రకటించిన యుద్ధానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దౌత్యవేత్తగా ఆయనకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. అరుదైన రీతిలో ఆయన తీసుకున్న నిర్ణయం పుతిన్‌ సర్కారును ఇరకాటంలో నెట్టనుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించినరోజు తన దేశ చర్యపై ఎంతో సిగ్గు పడ్డానని ఆయన చెప్పారు. తమ దేశం చేస్తున్న పని భరించరానిదని అన్నారు. రష్యా అధికారుల్లో చాలామందికి యుద్ధం ఇష్టలేకపోయినా కిమ్మనకుండా కూర్చోవాల్సి వస్తోందని చెప్పారు. ఎప్పటికీ అధికారంలో కొనసాగుతూ, విలాసవంతమైన భవంతుల్లో ఉండాలనుకునేవారే యుద్ధ ఆలోచన చేశారని పరోక్షంగా పుతిన్‌ను విమర్శించారు. అబద్ధాలు చెబుతోందంటూ తమ విదేశాంగ శాఖపైనా విమర్శలు చేశారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని