Updated : 25 May 2022 10:13 IST

ఉక్రెయిన్‌ గెలిచేలా చూస్తాం

ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలి ఉద్ఘాటన
దావోస్‌ సదస్సులో వాతావరణ మార్పులు, యుద్ధంపై చర్చ

దావోస్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సులో రెండోరోజు మంగళవారం కీలక చర్చలు జరిగాయి. ప్రధానంగా వాతావరణ మార్పులు, ఉక్రెయిన్‌ సంక్షోభంపై వక్తలు ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లెయెన్‌ పేర్కొన్నారు. ఈ పోరులో ఉక్రెయిన్‌ విజయం సాధించాలన్నారు. ఇందుకోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామన్నారు. ‘‘ఇది కేవలం ఉక్రెయిన్‌కు, ఐరోపాకు సంబంధించిన అంశం కాదు. ఇది ప్రపంచం మొత్తంతో ముడిపడిన వ్యవహారం’’ అని తెలిపారు. రష్యా బెదిరింపులను అంతర్జాతీయ సహకారంతో తిప్పికొట్టాలని కోరారు. ఉక్రెయిన్‌కు వెయ్యి కోట్ల యూరోల ఆర్థిక సాయాన్ని తాము ప్రతిపాదించినట్లు తెలిపారు.

వాతావరణ సంక్షోభంతోపాటు ఆహార సమస్య కూడా తీరాలి

ష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల సరఫరా వ్యవస్థల్లో తలెత్తిన ఇబ్బందులతో ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత ప్రమాదంలో పడిందని డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో నేతలు పేర్కొన్నారు. వాతావరణ సంక్షోభంతోపాటు ప్రపంచ ఆహార సమస్యనూ పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే తీవ్రమైన ఆహార భద్రత సమస్యను ఎరువుల ధరలు, ఉక్రెయిన్‌ నుంచి ఎగుమతులు నిలిచిపోవడం వంటివి పెంచాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది పస్తులుండాల్సిన పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. ఉక్రెయిన్‌ పోర్టులను రష్యా దిగ్బంధించడం.. ప్రపంచ ఆహార భద్రతపై యుద్ధాన్ని ప్రకటించడమేనని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బీస్లే తెలిపారు. తిండిలేక అలమటిస్తున్నవారికి ఆహారం అందించడం కోసం ఆకలిగా ఉన్నవారి నుంచి తీసుకుంటున్నామంటూ ప్రస్తుత దయనీయ పరిస్థితులను ఏకరవు పెట్టారు. వ్యవసాయోత్పత్తిని పెంచడానికి వినూత్న పరిజ్ఞానాలు వాడాలని, తక్కువ భూమిలో ఎక్కువ పంటను పండించాలని సింజెంటా గ్రూప్‌ సీఈవో ఎరిక్‌ ఫ్రైవాల్డ్‌ కోరారు. ప్రపంచ ఆహార భద్రతను పెంచడంలో ఆఫ్రికా కీలక పాత్ర పోషించొచ్చని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అయితే మొదట అక్కడ హింసను తగ్గించాలని టాంజానియా ఉపాధ్యక్షుడు ఫిలిప్‌ ఇస్డోర్‌ మపాంగో కోరారు.


ఉక్రెయిన్‌పై యుద్ధం ఈయూపై దాడే: స్పెయిన్‌ ప్రధాని

క్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఐరోపా సంఘం (ఈయూ)పై జరిగిన ప్రత్యక్ష దాడిగానే పరిగణిస్తామని స్పెయిన్‌ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్‌ చెప్పారు. దీనిపై ఐరోపా కలిసికట్టుగా నడవాలన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన లక్ష మందికిపైగా శరణార్థులు తమ దేశంలో తలదాచుకుంటున్నారని చెప్పారు. ‘‘ఉక్రెయిన్‌లోని బుచా, మేరియుపొల్‌ వంటి నగరాలు పాశవిక దాడులు, యుద్ధనేరాలకు పర్యాయ పదాలుగా మారాయి. వీటికి బాధ్యులు తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ యుద్ధం వల్ల 60 లక్షల మంది శరణార్థులుగా మారారు. 80 లక్షల మంది అంతర్గతంగా నిర్వాసితులయ్యారు’’ అని చెప్పారు.


స్వేచ్ఛాయుత వాణిజ్యం కన్నా స్వాతంత్య్రం ముఖ్యం: నాటో అధిపతి

స్వేచ్ఛాయుత వాణిజ్యం కన్నా స్వాతంత్య్రమే ముఖ్యమని నాటో కూటమి సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ తెలిపారు. లాభార్జన కన్నా విలువల పరిరక్షణకు పెద్ద పీట వేయాలని చెప్పారు. నిరంకుశ ప్రభుత్వాలపై ఆర్థికంగా ఆధారపడటం అవాంఛనీయమన్న విషయాన్ని ఉక్రెయిన్‌ యుద్ధం చాటిచెప్పిందన్నారు. రష్యాతోపాటు చైనా కూడా ఈ కోవలోకి వస్తుందని తెలిపారు. ఈ దేశాలు అంతర్జాతీయ కట్టుబాట్లకు తూట్లు పొడుస్తున్నాయన్నారు. ఉక్రెయిన్‌కు తమ తోడ్పాటును కొనసాగిస్తామని చెప్పారు. అయితే నేరుగా బలగాలను పంపబోమన్నారు.


ఆర్థిక సాధనాలను ఆయుధాలుగా మలచుకోవడం తప్పు: పాక్‌ మంత్రి వ్యాఖ్య

క్రెయిన్‌ సంక్షోభంలో ప్రతి దేశాన్నీ ఏదో పక్షంలో చేరాలని అడుగుతున్నారని, లేదంటే వైరి పక్షంగా ముద్ర వేస్తున్నారని పాకిస్థాన్‌ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ మహమ్మారి, ఆహార సంక్షోభం, వాతావరణ మార్పుల సమస్యలు ఉన్న సమయంలో యుద్ధం జరగడం సరికాదని చెప్పారు. ఆర్థిక సాధనాలను ఆయుధాలుగా మలచుకోవడం సరికాదన్నారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts