రాకెట్‌ దాడులతో దద్దరిల్లిన పొక్రొవ్స్క్‌

తూర్పు ఉక్రెయిన్‌ పట్టణమైన పొక్రొవ్స్క్‌ బుధవారం ఉదయం బాంబుల మోతతో దద్దరిల్లింది. ప్రజలింకా నిద్ర నుంచి లేవకముందే ఆ పట్టణంపై రష్యా సైనికులు పెద్దఎత్తున రాకెట్‌ దాడులకు దిగారు. దెబ్బతిన్న ఇళ్లు, ఇతర భవంతుల నుంచి కాంక్రీటు శకలాలు గాల్లో ఎగిరిపడ్డాయి.

Updated : 26 May 2022 08:17 IST

బాంబుల మోత మోగించిన రష్యా సేనలు
మా భూభాగాన్ని వదులకోం: జెలెన్‌స్కీ

పొక్రొవ్స్క్‌ (ఉక్రెయిన్‌): తూర్పు ఉక్రెయిన్‌ పట్టణమైన పొక్రొవ్స్క్‌ బుధవారం ఉదయం బాంబుల మోతతో దద్దరిల్లింది. ప్రజలింకా నిద్ర నుంచి లేవకముందే ఆ పట్టణంపై రష్యా సైనికులు పెద్దఎత్తున రాకెట్‌ దాడులకు దిగారు. దెబ్బతిన్న ఇళ్లు, ఇతర భవంతుల నుంచి కాంక్రీటు శకలాలు గాల్లో ఎగిరిపడ్డాయి. ఎటు చూసినా శకలాలే కనిపిస్తున్నాయి. పొక్రొవ్స్క్‌లో నివాస యోగ్యంగా ఏ ప్రదేశం మిగల్లేదని విక్టోరియా కుర్బోనొవా అనే మహిళ చెప్పారు. నెల రోజుల క్రితం జరిగిన దాడిలో తమ ఇంటి కిటికీ అద్దాలు పగిలిపోగా వాటికి ప్లాస్టిక్‌ షీట్లు అమర్చామనీ, దానివల్ల ఈసారి అద్దం ముక్కల నుంచి తమను తాము రక్షించుకున్నామని వివరించారు. అగ్ని గోళంలా వచ్చి పడిన రాకెట్‌ ధాటికి పెద్దఎత్తున ధూళి ఎగసిపడిందని చెప్పారు. క్రమటోర్స్క్‌ నగరంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవంతి కూడా రష్యా దాడుల్లో ధ్వంసమైంది. మరింత ప్రాణనష్టాన్ని నివారించడానికి వీలుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అదే ఏకైక పరిష్కారమని దొనెట్స్క్‌ సైనిక పరిపాలన విభాగాధిపతి పావ్లో కిరిలెంకో అభిప్రాయపడ్డారు. సీవిరోదొనెట్స్క్‌ ప్రాంతంలో 24 గంటల్లో దాడుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని లుహాన్స్క్‌ ప్రాంత గవర్నర్‌ తెలిపారు.

రష్యాకు అప్పగించేది లేదు

తమ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో రష్యాకు అప్పగించేది లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టంచేశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును ఉద్దేశించి వీడియో అనుసంధానత ద్వారా ఆయన ప్రసంగించారు. ‘మేం ప్రాదేశిక సమగ్రతను వదులుకోం. ఎవరికో వ్యతిరేకంగా కాకుండా మా స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు, మా భవిష్యత్తు కోసం మేం మా దేశంలో, మా భూభాగంలో పోరాడుతున్నాం. చర్చలకు ముందుకు వచ్చి, ఫిబ్రవరి 24కంటే ముందు నాటి పరిస్థితికి బలగాలను, ఆయుధాలను రష్యా ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోందో రష్యా అధినేత పుతిన్‌కు పూర్తిగా తెలిసి ఉండదని అన్నారు.

డాన్‌బాస్‌లోనూ మోత

పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌లోనూ బాంబుల మోత కొనసాగింది. పారిశ్రామికంగా కీలకమైన ఈ నగరాన్ని గుప్పిట పట్టేందుకు రష్యా గట్టిగా ప్రయత్నిస్తోంది. థర్మల్‌ విద్యుత్కేంద్రం ఉన్న ఒక పారిశ్రామిక పట్టణాన్ని పుతిన్‌ సేనలు స్వాధీనం చేసుకుని, సీవియెరోదొనెట్స్క్‌ వంటి ప్రాంతాలపై దృష్టి సారించాయి. పెద్దఎత్తున బలగాలను సమీకరించుకుని ఏకకాలంలో రష్యా మున్ముందుకు వస్తోందని స్థానిక అధికార వర్గాలు చెబుతున్నాయి. లుహాన్స్క్‌ మరో మేరియుపొల్‌ అవుతుందని గవర్నర్‌ సెర్హీ హైదై ఆందోళన వ్యక్తంచేశారు. మేరియుపొల్‌ తీరంలో మందుపాతరల్ని తొలగించామనీ, ఉక్రెయిన్‌ దక్షిణ తీరం నుంచి సురక్షితంగా వెళ్లేందుకు 70 విదేశీ నౌకలకు అవకాశం కల్పించనున్నామని రష్యా అధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్‌ సైనికుల విచారణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు.


నాటోలో సభ్యత్వంపై టర్కీతో స్వీడన్‌, ఫిన్లాండ్‌ చర్చలు

అంకారా: ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో)లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాలు ఆ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టర్కీతో చర్చలు జరపనున్నాయి. దీని కోసం ఆ రెండు దేశాల నుంచి సీనియర్‌ అధికారులు అంకారా చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని