మలేరియా నివారణకు జన్యుమంత్రం

అనాదిగా మానవాళిని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో మలేరియా ఒకటి. పరిశోధకులు దశాబ్దాలుగా కృషిచేస్తున్నా దాని వ్యాప్తికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ సగటున నిమిషానికి

Updated : 27 May 2022 06:22 IST

ఆశాకిరణంలా జీన్‌ డ్రైవ్‌ సాంకేతికత

అనాదిగా మానవాళిని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో మలేరియా ఒకటి. పరిశోధకులు దశాబ్దాలుగా కృషిచేస్తున్నా దాని వ్యాప్తికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ సగటున నిమిషానికి ఓ చిన్నారి మలేరియా దెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో ‘జీన్‌ డ్రైవ్‌’ అనే సరికొత్త జన్యుమార్పిడి సాంకేతికత మలేరియా వ్యాప్తి నివారణకు ఆశాకిరణంలా కనిపిస్తోంది.


ఏమిటీ జీన్‌ డ్రైవ్‌?

సాధారణంగా జన్యుమార్పిడి విధానాల్లో జీవుల్లోకి ప్రయోగశాలల్లో కొద్దిగా మార్పులు చేసిన జన్యువులను లేదా సరికొత్త జన్యువులను ప్రవేశపెడతారు. దానికంటే జీన్‌ (జన్యు) డ్రైవ్‌ సాంకేతికత మరింత ఆధునికమైనది. జీన్‌ డ్రైవ్‌ అనేది ప్రయోగశాలల్లో సృష్టించిన జన్యువు. అది నిర్దిష్ట సహజ జన్యువును లక్ష్యంగా చేసుకొని, దాన్ని నాశనం చేస్తుంది. ఆపై దాని స్థానంలో తన ప్రతిరూపాలు తయారయ్యేలా చేస్తుంది. సహజ జన్యువుకు నకలుగా జీన్‌ డ్రైవ్‌ను చెప్పుకోవచ్చు.


ఎలా పనిచేస్తుందంటే..

జీన్‌ డ్రైవ్‌ను కలిగి ఉన్న ఒక జంతువు (ఎ).. దాన్ని కలిగిలేని మరో జంతువు (బి)తో ప్రత్యుత్పత్తి ప్రక్రియలో పాల్గొందని అనుకుందాం. తద్వారా వచ్చే పిండంలో ‘ఎ’, ‘బి’ల జన్యు పదార్థాలు కలుస్తాయి. అప్పుడు ‘ఎ’లోని జీన్‌ డ్రైవ్‌ తన పనిని ప్రారంభిస్తుంది. ‘బి’ జన్యు పదార్థంలో తన వర్షన్‌కు సహజ రూపాన్ని గుర్తించి, ఓ ఎంజైమ్‌ సాయంతో డీఎన్‌ఏ గొలుసులోనుంచి దాన్ని తొలగిస్తుంది. అప్పుడు ‘బి’కి చెందిన క్రోమోజోం.. ‘ఎ’లోని జీన్‌ డ్రైవ్‌ను కాపీ చేసుకోవడం ద్వారా తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. ఫలితంగా పుట్టబోయే పిల్లల్లో జీన్‌ డ్రైవ్‌ కచ్చితంగా ఉంటుంది. ప్రామాణిక జన్యుమార్పిడి విధానాల్లో పిండం ‘ఎ’, ‘బి’ల నుంచి సగం జన్యువుల చొప్పున గ్రహిస్తుంది. కాబట్టి వాటిలో మనం మార్పిడి చేసిన జన్యువులు వచ్చే అవకాశం 50% మాత్రమే ఉంటుంది.


మలేరియా నివారణ ఎలా?

ప్రధానంగా మలేరియా కారక పరాన్నజీవులకు ఆడ ఎనాఫిలిస్‌ దోమలు వాహకంగా పనిచేస్తాయి. కాబట్టి వాటి జనాభాను నియంత్రిస్తే ఆ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసినట్లే. ఈ నేపథ్యంలో ఆడ దోమల పుట్టుకను నివారించే ఓ జీన్‌ డ్రైవ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది రెండు రకాలుగా దోహదపడే అవకాశముంది. ఒకటి- ఆడ దోమలే మనుషుల రక్తాన్ని పీలుస్తాయి. అవి లేకపోతే మలేరియా కారక పరాన్నజీవి మనుషుల్లోకి ప్రవేశించదు. రెండు- ఆడ దోమలు లేకపోతే అసలు ప్రత్యుత్పత్తే ఉండదు. దోమలే కాకుండా ఇతర హానికర జీవుల జనాభా నియంత్రణకూ జీన్‌ డ్రైవ్‌ సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నది పరిశోధకుల యోచన.


అనర్థాలపై ఆందోళన

జీన్‌ డ్రైవ్‌ సాంకేతికతను ప్రస్తుతానికి ప్రయోగశాలల్లోనే పరీక్షిస్తున్నారు. త్వరలో జంతువులపై దీన్ని ప్రయోగించేందుకు అనుమతులు వస్తాయని పరిశోధకులు ఆశిస్తున్నారు. అయితే ఇలాంటి సాంకేతికతల వల్ల మునుముందు మరిన్ని హానికర ఉత్పరివర్తనాలు చోటుచేసుకునే ముప్పును కొట్టిపారేయలేమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని తరాల తర్వాత జీన్‌ డ్రైవ్‌ దానంతట అదే చైతన్యరహితంగా మారే విరుగుడు సాంకేతికతలను సృష్టించి.. తర్వాతే దాన్ని ప్రయోగించాలని సూచిస్తున్నారు.


రూ.93 వేల కోట్లు:  మలేరియా కారణంగా సగటున ఏటా ఆఫ్రికా ఖండంపై పడుతున్న ఆర్థిక భారం

6.27 లక్షలు: ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మలేరియా కారణంగా 2020లో మృత్యువాతపడ్డవారి సంఖ్య

24.1 కోట్లు:  2020లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మలేరియా కేసుల సంఖ్య


- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని